సూత్రధారులు... | Theater group sutradhar vinayvarma interview | Sakshi
Sakshi News home page

సూత్రధారులు...

Published Thu, Dec 26 2013 11:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Theater group sutradhar vinayvarma interview

హైదరాబాద్‌తో విడదీయలేని ఉర్దూ సాహితీ ప్రపంచ పు మహోన్నత వ్యక్తిత్వాలను విభిన్న ప్రాంతాల ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు వినయ్‌వర్మ.  ఆయన  ‘సూత్రధార్ కేస్టింగ్ ఏజెన్సీ, థియేటర్ గ్రూప్ సూత్రధార్’ నిర్వాహకుడు, రచయిత, దర్శకుడు. ఇస్మత్ చుగ్తాయ్, మహా లఖాబాయ్‌లను ‘లామకాన్’ వేదికపై ఇటీవల సాక్షాత్కరింప జేసిన సందర్భంగా వినయ్‌తో ఇంటర్వ్యూ...
 
 ‘ఇస్మత్ ఏక్ ఔరత్’ అనే పేరు పెట్టడంలో అంతరార్థం ఏమిటి?

ఇరవయ్యవ శతాబ్దపు సాహసోపేత, వివాదాస్పద రచయిత్రి ఇస్మత్ చుగ్తాయే. ఆమె రచనలను చదివి ‘ఒక మహిళ ఇలా రాయగలదా! ఒక మహిళై ఉండి ఇలా రాస్తుందా?’ అనుకునేవారు. ఆధునిక భారతదేశంలో తొలితరం స్త్రీవాదిగా భావించే ఇస్మత్ చుగ్తాయ్‌లోని స్త్రీత్వాన్ని గురించి ఆమె స్నేహితుడు, సహ రచయిత ‘మంటో’ హృద్యంగా రాశారు. ‘పురుషుడు ప్రాబల్యం వహించే అన్ని రంగాల్లోనూ మహిళ అతడిపై పైచేయి సాధించవచ్చు, కానీ ఆమె అరచేతిలో గోరింటాకు పూయవలసినదే, ముంజేతులు గాజుల సవ్వడి విన్పించవలసినదే. పురుష ప్రపంచపు క్రౌర్యం పైనే తప్ప పురుషులపై ఇస్మత్‌కు కాఠిన్యం లేదు. ఇస్మత్‌లా మరెవరూ రాయలేరు. ఇస్మత్ స్త్రీ కాకపోతే కొన్ని వాక్యాలు రాయలేదు’ అనే మాటలు ‘ఇస్మత్ ఏక్ ఔరత్ (ఇస్మత్ ఒక స్త్రీ)’కి స్ఫూర్తి. ఇస్మత్ చిరపరిచితమైన ఉత్తరాదిలో ఇటీవల జరిగిన ప్రదర్శన చూసిన ప్రేక్షకులు మా స్ఫూర్తిని హర్షించారు. దేశ విభజనకు ముందు ‘అభ్యుదయ రచయితల సంఘం’లో క్రియాశీల సభ్యులుగా ఇస్మత్ చుగ్తాయ్-మంటోలు హైదరాబాదీలకు పరిచితులే!
 
ఇస్మత్ రచనలు చేసే వాతావరణాన్ని ఆహ్లాదంగా చూపారు.  గద్దీపై ఇస్మత్ కూర్చున్న తీరు, నేపథ్యంలో హిందుస్తానీ సంగీతం, చేతిలో ఐస్ ముక్కను తిప్పుతూ నోట్లో వేసుకుని కొరకడం ఇవన్నీ మీ ఊహలా?
 
ఊహ కాదు. ఇస్మత్ సాహిత్యాన్ని, ఆమె గురించి వచ్చిన సాహిత్యాన్ని చదవడం ద్వారా ఈ రంగాలంకరణ, హావభావ రూపకల్పన సాధ్యమైంది.
 
పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మహాలఖా బాయ్ వర్తమానానికి ఎలా కనెక్ట్ అవుతుంది?


 పర్షియా, హిందూభాషల కలయికగా కొత్త భాష ‘ఢాకిని-దక్కనీ’ రూపొందుతున్న కాలంలో మహాలఖాబాయి (1768 - 1824) జీవించింది. ఆమె పేరుకు అర్ధం పూర్ణచంద్రవదన! ‘గుల్జార్ -ఎ-మహలఖా’ అనే ఉర్దూ కవితా సంపుటి కవయిత్రిగా ఆమె సౌందర్యాన్ని వెల్లడిస్తుంది. మీర్ నిజాం ఆలీఖాన్‌కు మూడు యుద్ధాలలో సహకరించిన యోధురాలు, మహావితరణశీలి. సమకాలీన భారత సంస్థానాల్లో ఆమెతో పోల్చదగిన గజల్ రచయితలు, గాయకులు, నృత్యకారిణులు కనిపించరు. మహాలఖాబాయి మహాదాత. తన నగరాన్ని రక్షించమని ఆమె రాసిన కవితాపాదాలు ప్రపంచంలోని నాగరీకులందరికీ శిరోధార్యాలు. కాబట్టే: యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిధులతో రెండేళ్లక్రితం మౌలాలీలోని ఆమె సమాధిని సందర్శనీయ స్థలంగా ఆధునీకరించారు. అక్కడ చెక్కిన ఒక గజల్ పంక్తి : ‘పువ్వుగా వికసించాలని ప్రతి మొగ్గ తన అరచేతిలో ఆత్మను పదిలపరచుకుని ఎదురు చూస్తుంటుంది’!

 ‘మహాలఖాబాయి’ పొందిన ప్రశంసలు ఎవరెవరికి చెందుతాయి?

 నిస్సంశయంగా రచయిత్రి ఔధేషీ రాణి బావాకు క్రెడిట్ దక్కుతుంది. చారిత్రక విషయాలపట్ల ఆమె పరిజ్ఞానం, రంగాలంకరణ లో, రాగాల ఎంపికలో ఉపకరించాయి. లఖాబాయి జీవిత చరిత్రను, గజల్స్‌ను అధ్యయనం చేసిన రతికా సంత్ కేశ్వానీ తన నటనకు సహజత్వాన్ని తీసుకుని వచ్చారు. ‘సూత్రధార్’లోని పాత్రధారులంద రూ నన్ను సక్సెస్ చేశారు.
 - పున్నా కృష్ణమూర్తి
 
మహాలఖాబాయి పేరుకు అర్ధం పూర్ణచంద్రవదన!  ‘గుల్జార్-ఎ-మహలఖా’ అనే ఉర్దూ కవితా సంపుటి కవయిత్రిగా ఆమె సౌందర్యాన్ని వెల్లడిస్తుంది. మీర్ నిజాం ఆలీఖాన్‌కు మూడు యుద్ధాల్లో సహకరించిన యోధురాలు, మహా వితరణ శీలి. సమకాలీన భారత సంస్థానాల్లో ఆమెతో పోల్చదగిన గజల్ రచయితలు, గాయకులు, నృత్యకారిణులు కనిపించరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement