సినిమా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు
‘‘సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోతుందా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సినిమా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు. అయినా ఎందుకు వెళ్లాలి? మేము సినిమాలు తీసేది తెలుగు వారి కోసమే కదా!’’ అని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘33 ప్రేమకథలు’ ఆడియో వేడుకలో మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 15 ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్స్, మ్యూజిక్ విభాగాలకు సంబంధించి చెన్నై, ముంబైల పైనే ఆధారపడుతున్నాం. తెలంగాణ వాళ్లు కూడా ఇక్కడి నుండి పరిశ్రమ వెళ్లాలని కోరుకోవడం లేదు’’ అని మురళీమోహన్ చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజమండ్రి, వైజాగ్‌ల్లో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
- ‘మా’ అధ్యక్షులు మురళీమోహన్