సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సినిమా పంచాయితీ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యవహారాన్ని నటుడు, ఎంపీ మురళీ మోహన్ వద్ద పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రస్తావించారు. దీంతో రాజేంద్రప్రసాద్‌పై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్ పాల్గొన్న ఆయన, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినిమా పరిశ్రమ నుంచి మెజార్టీ నటులు, సాంకేతిక సిబ్బంది టీడీపీలోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటు ఇండస్ట్రీలోని చాలామందిని బాధపెట్టాయని ఈ సందర్భంగా మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.
అయితే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల సారాంశం పూర్తిగా తెలియదన్న చంద్రబాబు.. ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం టీడీపీ విధానం కాదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఎవరైనా అలా ప్రవర్తించినా తప్పక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. మరోవైపు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. ప్రముఖులుగా ఉన్నవారు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొంటే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాలపై రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.
అసలేం జరిగింది?
ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ రెండు రోజుల క్రితం తీవ్రంగా విమర్శించారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప.. వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు. తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు.
దర్శక, నిర్మాతల ఫైర్
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు దర్శక, నిర్మాతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? టీడీపీ నాయకులే లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు టీడీపీలోనే ఉన్నారని, వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment