మళ్లీ దొరుకుతాయో లేదో! | There God will give you a vision | Sakshi
Sakshi News home page

మళ్లీ దొరుకుతాయో లేదో!

Published Sat, Sep 8 2018 12:08 AM | Last Updated on Sat, Sep 8 2018 12:08 AM

There God will give you a vision - Sakshi

అనగనగా ఒక రాజు. న్యాయంగా, ధర్మంగా రాజ్యపాలన చేసేవాడు. నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతని భక్తి శ్రద్ధలకు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చాడు.‘‘రాజా, నీ భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో’’ అన్నాడు. దేవుడి మాటలకు రాజు ఇట్లా అన్నాడు– ‘‘స్వామీ నీ కృపవల్ల నాకు ఏ లోటూ లేనప్పటికీ మీరే అనుగ్రíß స్తానన్నారు కాబట్టి కోరుతున్నాను – మీరు నాకు కనిపించినట్టే, నా ప్రజలందరికీ కూడా మీ దర్శనమిచ్చి వారిని ధన్యులను చెయ్యండి’’ అన్నాడు. ‘‘అది కుదిరే పని కాదు, నా పట్ల నిజమైన ఆర్తి, ప్రేమ ఉన్నవారికి మాత్రమే నేను కనపడతాను’’ అన్నాడు దేవుడు. రాజు విడిచిపెట్టకుండా పదే పదే అడిగేసరికి ‘సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.’’ అన్నాడు దేవుడు. రాజు సంతోషంతో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ‘‘రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు రండి. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు’’ అని నగరంలో దండోరా వేయించాడు.దేవుణ్ణి చూడాలన్న ఆశతో ప్రజలందరూ పోగయ్యారు. రాజు అందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. వారలా నడుస్తుండగా దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. వద్దు వద్దని రాజు చెబుతున్నా వినకుండా కొంతమంది అక్కడే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్లిపోయారు. 

రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన వారిలో కొందరు ‘వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మరెప్పుడైనా కనిపిస్తాడు అనుకుని అటువైపు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. చివరికి రాజు, రాణి మిగిలారు. కొంతదూరం వెళ్లాక వారికి వజ్రాల పర్వతం కనిపించింది. రాణి అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. రాజుకు ఇచ్చిన మాట మేరకు దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే ‘‘ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నాడు. రాజు బాధతో తల దించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement