అక్కడ... చుట్టలు.. మద్యమే నైవేద్యం
భగవంతునికి సమర్పించే కానుక ఎంత గొప్పది అన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తితో సమర్పిస్తున్నా మన్నదే ముఖ్యం. అలా భక్తితో అర్పించే వాటి వరుసలో మద్యం, చుట్టలను కూడా చేర్చారు చెన్నైలోని ‘బాడీగార్డ్ మునీశ్వరు’ని భక్తులు. ఈ మునీశ్వరుని విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి, చుట్టలు నైవేద్యం పెట్టడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటూ వాహన సౌకర్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లగలవని విశ్వాసం.
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి అన్నాశాలైకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి దిగగానే కిలోమీటరు దూరంలో ఉంది ఈ ‘బాడీగార్డ్ మునీశ్వరాలయం’. చెన్నై సిటీ బస్సు సర్వీసు ‘పల్లవన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్’ బస్సు బాడీల నిర్మాణం డిపో ఇక్కడే ఉంది. ఈ డిపో పక్కనే ఆలయాన్ని నిర్మించడంతో ‘బాడీగార్డ్ మునీశ్వర్’ అనే పేరు వచ్చిందంటారు స్థానికులు. ఇక్కడ కొలువై ఉన్న ఈ బాడీగార్డ్ మునీశ్వర్ యాభై ఏళ్ళుగా భక్తుల పూజలందుకుంటున్నాడు
ప్రమాదం తప్పాలన్నా... పిల్లలు పుట్టాలన్నా...
తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటారు, మరో దేవుని ప్రసన్నం చేసుకునేందుకు కొబ్బరికాయలు కొడతారు. మునీశ్వర్ వద్ద మాత్రం ‘మా కోర్కెలు నెరవేర్చు స్వామీ! నీకు ఫుల్‌బాటిల్, కట్ట చుట్టలు సమర్పించుకుంటాను’ అని మొక్కుతారు. రోడ్డు మీద ప్ల్లాట్‌ఫామ్‌పై ఉన్న మునీశ్వరాలయానికి విశేషదినాల్లో బడాబాబుల నుండి సాధారణ ప్రజానీకం వరకు క్యూ కడతారు. సైకిల్ అయినా బెంజ్ కారైనా సరే మద్యం, చుట్టల సమర్పణతో ఇక్కడ పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని అపారమైన నమ్మకం.
1919లో ఆర్కాడు జిల్లా నుండి కొందరు కార్మికులు మునీశ్వరుని విగ్రహాన్ని చెన్నైకి తీసుకువచ్చి ప్రస్తుతం గుడి సమీపంలో ప్రతిష్ఠించారు. అయితే బ్రిటిష్ సైనికాధికారి గుడి నిర్మాణంపై నిషేధాజ్ఞలు విధించారు. అదే రోజు ఆ అధికారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ అధికారి వెంటనే నిషేధాజ్ఞలు ఉపసంహరించుకోగా భక్తులు గుడి నిర్మించుకున్నారు.
దాంతో మునీశ్వర్ గుడిలో వాహన పూజలు చేయించుకుంటే ప్రమాదాలకు గురికాబోమనే విశ్వాసం వ్యాప్తి చెందింది. అయితే పూజకు మద్యం, చుట్టల కట్ట సమర్పించే ఆచారం ఎలా మొదలైందో తెలియదు. ఈ విషయాన్ని గుడినిర్వాహకులు, పూజారి కూడా చెప్పలేకపోతున్నారు. భక్తులు మద్యం, చుట్టలను మునీశ్వరునికి నైవేద్యం పెట్టించి గుడి ప్రాంగణంలోని హోమగుండంలో వేస్తారు. - కొట్రా నందగోపాల్