మిత్రమా... కుశలమా?
కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి, కర్నూలు
వారంతా 1983లో కర్నూలు జిల్లా నంద్యాలలోని ఒకే పాఠశాలలో కలిసి పదవ తరగతి చదువుకున్న వారు. ఆపై పైచదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడి పోయారు. ఇప్పుడు వారందరూ తమ తమ హోదాలను, స్థితి గతులను పక్కనపెట్టి మళ్లీ 1983 నాటి గత స్మతులలోకి వెళ్లి పోయారు. ‘దోస్తోంకీ మన్‌కీ బాత్’ పేరిట అందరూ ఒకదగ్గరికి చేరుకున్నారు. కేవలం ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే కాదు... ఇబ్బందులలో ఉన్న మిత్రుల ఇంటికి అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబంతో మనస్ఫూర్తిగా మాట్లాడి వారికి చేతనైన సహాయం చేయడమే ‘దోస్తోంకీ మన్‌కీ బాత్’ కార్యక్రమం ఉద్దేశం. ఈక్రమంలో గతవారం నంద్యాలలోని తమ చిన్ననాటి మిత్రుడు తెల్ల నాగరాజు ఇంటికి వెళ్లారు. 20 నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆ మిత్రుని కుటుంబానికి లక్ష రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. అంతకుముందే తమ స్నేహితుని భార్యకు కుట్టుమిషన్‌ను అందించి జీవనోపాధికి ఒక మార్గం చూపించారు. గతంలోనూ తమ పాత మిత్రులైన హనీఫ్, అమీన్ బాషాల కుటుంబాలను కూడా వీరు ఆదుకున్నారు.
ఎన్నో జన్మల అనుబంధం...!
‘‘ఈ చిన్నపాటి జీవితంలో కోట్లాది మంది ఉన్న ఈ జన ప్రపంచంలో ఒకరికొకరం కలిశామంటే ఏదో పూర్వజన్మ అనుబంధం ఉండి ఉంటుందనేది నా అభిప్రాయం’’ అంటారు ఈ కార్యక్రమ రూపకర్త, కర్నూలు, అనంతపురం జిల్లాల ఫ్యాక్టరీస్ రీజనల్ అధికారి మొదుల్ల విజయ శివకుమార్ రెడ్డి. ఈ పూర్వజన్మ అనుబంధంతోనే మనం ఈ జన్మలో కలుస్తామని, అయితే కేవలం కలవడం మాత్రమే కాకుండా ఇంకా ఏదో చేయాలని తామంతా భావించామని అయన చెప్పారు. ఇందుకోసం దోస్తోంకీ మన్‌కీ బాత్ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.