ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది | They read books and learned life | Sakshi
Sakshi News home page

ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది

Published Sun, Feb 12 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది

ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది

టాప్‌ షెఫ్‌     పద్మాలక్ష్మి
పుస్తకాలు చదివి జీవితాన్ని నేర్చుకున్న వాళ్లున్నారు.
జీవితాన్ని చూసి పుస్తకాలు రాసిన వాళ్లున్నారు.
కానీ.. పద్మ రాసిన పుస్తకాలు చూసి పొయ్యి వెలిగించినవాళ్లు చాలామందే ఉన్నారు.
వెలుగులో వేడి ఉన్నట్లే... పద్మాలక్ష్మి జీవిత పుస్తకంలో గొప్ప వేడి ఉంది. ప్యాషన్‌ ఉంది. ఫ్యాషన్‌ ఉంది.
అందుకే పద్మాలక్ష్మి... భోజ్యేషు పద్మ– లవ్వేషు లక్ష్మి!


ది వే టు ఎ మాన్స్‌ హార్ట్‌ ఈజ్‌ హిజ్‌ స్టొమక్‌.
రుచికరంగా వండిపెడితే మగాడు ఢమాల్‌మని ప్రేమలో పడిపోతాడట!
ఫుడ్డుతోనా, ఫుడ్డును వండిపెట్టిన వాళ్లతోనా? ఎవరితో పడిపోతాడు ప్రేమలో?!
ప్రేమను ఫుడ్డుతో కలిపి పెట్టినవాళ్లతో! సరేనా?

రేపు వాలెంటైన్స్‌ డే. ‘టాప్‌ చెఫ్‌’ పద్మాలక్ష్మి రేపు ఇండియా వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంగంబాక్కంలోని తాజ్‌ కోరమండల్‌ హోటల్‌లో.. తను వండి వార్చిన పుస్తకాన్ని వడ్డించబోతున్నారు. ‘లవ్, లాస్‌ అండ్‌ వాట్‌ వియ్‌ ఏట్‌ : ఎ మెమైర్‌’ ఆ వంటకం పేరు. అదొక గైడ్‌. హెల్త్‌ గైడ్, ఫుడ్‌ గైడ్, లవ్‌ గైడ్‌. ఎలా అన్నిటినీ మిక్స్‌ చేయగలిగారు పద్మాలక్ష్మి! ఆమె జీవితంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ లేవు కూడా కాబట్టి!

బ్యాచిలర్స్‌కి పద్మపూర్ణమ్మ!
అమెరికన్‌ టీవీ చానల్‌ ‘బ్రేవో’ లో ‘టాప్‌ చెఫ్‌’ అనేది పాపులర్‌ రియాలిటీ షో. దాని హోస్ట్‌  పద్మాలక్ష్మి. తమిళ్‌ అమ్మాయి. చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళుతుంటుంది. గత సోమవారం మన హైదరాబాద్‌కి కూడా వచ్చింది. ఏడేళ్ల చిన్న పాప, తను! ఇదే ఆమె ఫ్యామిలీ. అయితే పద్మాలక్ష్మి సృష్టించిన రెసిపీలను ఇష్టంగా ఆరగించేవారందరినీ కలుపుకుంటే ఆమెదొక ఖండాంతర ఫ్యామిలీ అనుకోవాలి. ఖండఖండాలలోని కిచెన్‌ రూమ్‌లలో ఆమె వంటల పుస్తకాలు కనిపిస్తాయి. ఆమె రాసిన త్రీ మినిట్, ఫోర్‌ మినిట్‌ ‘తయారీ’లతో బతుకు లాగించేస్తున్న బ్యాచిలర్లు, నిర్బంధ బ్యాచిలర్లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇల్లాళ్లకైతే పండగే. పద్మాలక్ష్మి పుణ్యమాని ఇంటాయన్ల కడుపులోంచి హృదయంలోకి వారు అవలీలగా ప్రవేశించ గలుగుతున్నారు. కొంచెం ఎక్కువనిపించినా ఇది నిజం. అయితే.. కిచెన్, ఫ్యాషన్, ఫెమినిజం, యాంటీ రేసిజం.. వీటితోపాటు పద్మాలక్ష్మి జీవితంలో దారుణమైన అనుభవాలు ఉన్నాయి! బాల్యంలో లైంగిక వేధింపులు ఉన్నాయి. నెలనెలా వదలక వెంటాడిన ‘దెయ్యమూ’ ఉంది!
పద్మాలక్ష్మీ జీవితంలోంచి సంతోషాన్ని దూరం చేసిన మొదటి వ్యక్తి ఆమె తండ్రి! రెండో టార్చర్‌.. ‘ఎండోమెట్రియోసిన్‌’! పొత్తికడుపు నొప్పి.

నాన్న వడ్డించని.. ప్రేమ విస్తరి!
పద్మ తండ్రి వైద్యనాథన్‌ ఫైజర్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌. తల్లి విజయ నర్సు. ఆంకాలజీ నర్సింగ్‌లో స్పెషలిస్టు. పద్మకు రెండేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. విజయకు పద్మ ఒక్కటే కూతురు. పద్మకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. వీళ్లిద్దరూ తండ్రి రెండో భార్య సంతానం. మామూలుగా తన చెల్లి గురించి మాట్లాడరు పద్మాలక్ష్మి. కానీ ‘గార్డియన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె హార్ట్‌ దాదాపుగా బ్రేక్‌ అయింది. ‘‘నా చెల్లి కెరీర్‌ కోసం నాన్న ఫైజర్‌లో ఉద్యోగం మాని, తన కెరీర్‌ని త్యాగం చేశాడు. ఆ ప్రేమ నా మీద ఏమైందో అర్థం కాదు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు పద్మాలక్ష్మి. ఆ  వెంటనే సర్దుకున్నారు. ఇది ఆమెకు జీవితం నేర్పిన పాఠం. ‘నీకు జరుగుతున్న దాన్ని నువ్వు ఆపలేవు. కానీ, నీకు జరుగుతున్న దానికి నువ్వెలా ఉండాలన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంది’. పద్మాలక్ష్మి ఫిలాసఫీ ఇది. అందుకే ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు.

యు.ఎస్‌.లో అమ్మ.. చెన్నైలో పద్మ
భర్త నుంచి విడిపోగానే, ఇండియా నుంచీ మానసికంగా విడిపోయారు పద్మ తల్లి. చెన్నై నుంచి న్యూయార్క్‌ వెళ్లిపోయారు. కూతుర్ని ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంచేశారు. అలా న్యూయార్క్‌–చెన్నైల మధ్య పద్మ బాల్యం మొదలైంది. పద్మ అయ్యంగార్ల అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల పూర్వీకులది కేరళ. న్యూ యార్క్‌లో తల్లి దగ్గరికి, చెన్నైలో అమ్మమ్మ దగ్గరికి తిరుగుతూ సంప్రదాయం, ఆధునికం కలగలిసిన విలక్షణమైన స్త్రీగా ఎదిగారు పద్మ. ఆమె పూర్తి పేరు పద్మాపార్వతీలక్ష్మీ వైద్యనాథన్‌.

పద్మ టీనేజ్‌ హాయిగా సాగలేదు. పద్నాలుగవ యేట పద్మ మూడు వారాలు న్యూయార్క్‌ ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. వైద్యులు ఆమెకు ‘స్టీవెన్స్‌–జాన్సన్‌ సిండ్రోమ్‌’ అని తేల్చారు. ప్రాణాంతకమైన చర్మ వ్యాధి. ఫస్ట్‌ స్టేజీలో ఉన్నప్పుడు కనిపెట్టారు. మంచి మెడిసిన్‌తో బయట పడేశారు. ఈ లోపు పద్మాలక్ష్మి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. హాస్పిటల్‌ ఉంచి డిశ్చార్జి అయిన రెండు రోజుల తర్వాత.. కాలిఫోర్నియాలో కారు ఆక్సిడెంట్‌ జరిగి పద్మ కుడి తుంటి విరిగింది. కుడి చెయ్యి పైభాగంలో ఎముక చిట్లింది. సర్జరీ తర్వాత నయం అయ్యింది కానీ, ఆమె కుడి చేతి భుజం కింద ఇప్పటికీ ఏడంగుళాల పొడవున సర్జరీ జరిగిన మచ్చ కనిపిస్తూ ఉంటుంది.

ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది
పద్మాలక్ష్మి మరీ నలుపు కాదు, చామన ఛాయా కాదు. కానీ అమెరికన్‌ స్కూళ్లలో అది కారునలుపే. పద్మ క్లాస్‌మేట్స్‌ ఆమెను వేధించేవాళ్లు. ఏడిపించేవాళ్లు. రంగు కారణంగా ఆమె తెలివితేటలు వెలవెలపోయాయి. అత్యాచారానికి ఏ మాత్రం తక్కువకాని విధంగా అమెపై ‘బుల్లీయింగ్‌’ జరిగింది. అప్పుడే అనుకుంది పద్మ. లోపల్నుంచి తను స్ట్రాంగ్‌గా ఎదగాలని. రేసిజాన్ని ఆమె తన మోడలింగ్‌తో డీ కొట్టాలనీ. కొట్టారు! స్కూలింగ్‌ అయింది. థియేటర్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ అయింది. మోడలింగ్‌ కోసం మ్యాడ్రిడ్‌ వెళ్లిపోయారు. కనీసం నాలుగు భాషలైనా తెలిసిన అమ్మాయికి ప్రపంచం చిన్నదైపోతుంది. కానీ మోడలింగ్‌ ప్రపంచానికి ఆమె చేతి మీద మచ్చ పెద్దదిగా కనిపించింది. పద్మకు ఇంగ్లిష్, తమిళ్, హిందీ, ఇటాలియన్, స్పానిష్‌ భాషలు వచ్చు. అవేమీ పని చేయలేదు. మోడలింగ్‌ మహానీయులు ఆమె దేహం.. తెలుపు రంగును మాట్లాడ్డంలేదని తిరస్కరించారు!

మోడలింగ్‌.. ఫ్యాషన్‌.. కిచెన్‌ బుక్స్‌
అప్పటికి పద్మ వయసు 21. మ్యాడ్రిడ్‌లోని ఒక కెఫెలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఆ మధ్యాహ్నం ఒక ఫ్యాషన్‌ ఏజెంటు వచ్చి ఆమెను కలిశాడు. పద్మకు అదే ఫస్ట్‌ మోడలింగ్‌ డీల్‌. ఆ తర్వాత కొద్ది కాలానికే పారిస్‌లో, మిలాన్‌లో, న్యూయార్క్‌లో ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా పద్మాలక్ష్మికి గుర్తింపు వచ్చింది. ఆమెను స్వీకరించినట్లే, ఆమె మచ్చనూ స్వీకరించడం మొదలుపెట్టింది ఫ్యాషన్‌ ప్రపంచం! పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రికల ముఖచిత్రంగా పద్మాలక్ష్మి దర్శనమిచ్చారు. మోడలింగ్‌ నుంచి టీవీలకు, టీవీల నుంచి సినిమాలకు వెళ్లారు! వాటిని మించి రిసిపీ బుక్స్‌ ఆమెకో ఇమేజ్‌ తెచ్చిపెట్టాయి. పద్మ రాసిన మొదటి పుస్తకం ‘ఈజీ ఎక్సాటిక్‌’. రెండో పుస్తకం ‘ట్యాంగీ, టార్ట్, హాట్‌ అండ్‌ స్వీట్‌’. ఇటీవలి పుస్తకమే.. ‘లవ్‌ , లాస్, వాట్‌ వియ్‌ ఏట్‌’.

ప్రేమానుబంధాలు!
ముప్పై నాలుగేళ్ల వయసులో వివాదాస్పద రచయిత సాల్మన్‌ రష్దీని పెళ్లి చేసుకున్నారు పద్మాలక్ష్మి. అయితే మూడేళ్లు మాత్రమే కలిసున్నారు. ఈ మధ్యలో రష్దీ.. ‘ఫ్యూరి’ అనే నవలను రాసి పద్మకు అంకితం ఇచ్చారు. రష్దీతో విడాకులు తీసుకున్నాక వెంచర్‌ క్యాపిటలిస్టు ఆడమ్‌ డెల్‌కు దగ్గరయ్యారు పద్మ. వాళ్లకు పుట్టిన పాపే.. ఎప్పుడూ పద్మ  వెంట కనిపించే కృష్ణ (6). డెల్‌తో విడిపోయాక ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూపు (ఐ.ఎం.జి) సిఇవో టెడ్డీ ఫార్స్‌›్టమన్‌తో ప్రేమలో పడ్డారు పద్మ. 71 ఏళ్ల టెడ్డీ  2011లో చనిపోయారు.

టీనేజ్‌లో మొదలైన నరకం!
ఇరవై ఏళ్ల పాటు పద్మ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడ్డారు. దీనిని 16 వ యేట, 26 వ యేట, కనీసం 32 వ యేట గుర్తించినా నేను నా కుటుంబంతో, నా స్నేహితులతో హాయిగా ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది అని పద్మ ఇప్పటికీ బాధపడుతుంటారు. తనలా బాధపడే వారికోసం పద్మాలక్ష్మి ‘ఎండోమెట్రియోసిస్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ను నెలకొల్పారు.

పచ్చళ్లలో కారం.. ప్రేమలో మమకారం
పద్మాలక్ష్మికి నిల్వ పచ్చళ్లంటే ఇష్టం. చిల్లీస్‌ అంటే చచ్చేంత ఇష్టం. అమ్మమ్మ తనకు అందకుండా పై షెల్ఫులో పచ్చడి సీసాను పెడితే, స్టూల్‌ ఎక్కి సీసాను తియ్యబోతూ దాన్ని పడేసి తిట్లు తిన్న పిల్ల. ఘాటు కోసం తనేమైనా చేస్తుంది. అదే ఘాటును ఆమె ఫుడ్డులోను, ప్రేమలోనూ కోరుకున్నారు. ఆ ఘాటునే కొసరి కొసరి వడ్డించారు. ఇక ఆమె కొత్తగా ఏం సర్వ్‌ చేయబోతున్నారన్నది రేపు చెన్నై తాజ్‌ కోరమండల్‌లో తెలుస్తుంది.
 
ఇంట్లో కూర్చుంటే నేర్చుకోలేం
హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో ప్రముఖ అంతర్జాతీయ మోడల్, టీవీ హోస్ట్, నటి, రచయిత్రి పద్మాలక్ష్మితో ఇటీవల జరిగిన ప్రియభాషణలో ‘సాక్షి’  సిటీ బ్యూరో రిపోర్టర్‌  ఓ మధు పాల్పంచుకున్నారు.

పచ్చళ్లంటే మీకు ఎందుకంత ఇష్టం?!
ఘాటుగా ఉంటాయి.
రిలేషన్‌షిప్స్‌లో కూడా మీరు అంతే గాఢతను ఆశించినట్లున్నారు!
వెల్, పైపైన ఇష్టపడడం ప్రేమ అవుతుందా!
మోడలింగ్‌ మిమ్మల్ని పైకి తెచ్చింది. మీరేమో రెసిపీలను పైకి తెస్తున్నారు. మోడలింగ్‌ మానేసినట్లేనా?
దుస్తులకు మోడలింగ్‌ తగ్గించేశాను. నా ఇష్టాలకు మోడలింగ్‌ చేస్తున్నాను. రుచికరమైన భోజనం జీవితంపై ప్రేమను కలిగిస్తుంది. ఆ విధంగా నేను ప్రేమకు మోడలింగ్‌ చేస్తున్నాను.
మీ పాకశాస్త్ర గురువు మీ అమ్మమ్మ అని చెప్పారు. ప్రేమశాస్త్రంలో?
ప్రేమ.. శాస్త్రం కాదు. ఇట్‌సెల్ఫ్‌.. ఎ గురు. ప్రేమ చాలా నేర్పుతుంది.
మీకేం నేర్పింది?
(నవ్వుతూ) ప్రేమించడం నేర్పింది. ప్రేమించడం అంటే.. మనం ప్రేమించినవాళ్ల ఫీలింగ్స్‌ని గౌర వించడం.
మంచి షెఫ్‌ అవడం కన్నా... ప్రేమించడం ఈజీ అనిపిస్తుంది!
హహ్హహా.. నాట్‌ లైక్‌ దట్‌! మంచి షెఫ్‌ అవడం కూడా కష్టం ఏమీ కాదు. బాగా ట్రావెల్‌ చెయ్యాలి. ఇంట్లో కూర్చుంటే కొత్తగా ఏం నేర్చుకోలేం.

మాధవ్‌ శింగరాజు

సాల్మన్‌ రష్దీతో...



ఆడమ్‌ డెల్‌తో...


టెడ్డీ ఫార్స్‌మన్‌తో...





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement