మనసును అలరించే సుందర స్వప్నం ఒక్కోసారి మనలో స్ఫూర్తిని నింపుతుంది. అద్భుతాలు సాధించడానికి ఆరంభంగా నిలుస్తుంది. అసాధ్యం అనిపించే విషయాలను సుసాధ్యం చేసి చూపుతుంది. ఆ స్వప్నం వ్యక్తిది గాక సమూహానిదే అయితే రెట్టించిన ఉత్సాహం వస్తుంది. అలాంటి ఉరకలెత్తే ఉత్సాహంతో కొంతమంది టీనేజర్లు చేసిన ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఒక స్ఫూర్తిపాఠమై నిలిచింది.
థాయ్‌లాండ్ దేశంలో ఒక పెద్ద సరస్సు మధ్యలో ఒక చిన్న ఊరు. దాన్ని దీవి అనలేం. ఎందుకంటే దాని విస్తీర్ణం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే... ఆ ఊళ్లో పిల్లలు సైకిల్ తొక్కడానికి కూడా అవకాశం ఉండదు. ఉన్న స్థలంలో అంతా ఇళ్లు కట్టేశారు. చుట్టూరా నీళ్లు మాత్రమే ఉన్నాయి. మైదానం అనే మాట తెలియని ఆ ఊరి పిల్లలకు చుట్టూరా కనిపించే అపారమైన జలధిని దాటి ఒడ్డును చేరడమనేది అంత సులభమైన విషయం కాదు. అలాంటి నేపథ్యంలో ఆ ఊరిలో ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. 1986 ఫీఫా వరల్డ్ కప్ అక్కడి టీనేజర్‌లలో, చిన్నపిల్లల్లో సాకర్ పిచ్చిని ఇంజెక్ట్ చేసింది. ఇంకేముంది.. ఫుట్‌బాల్‌ను చూశారు కాబట్టి, వారిలో ఆడాలనే తహతహ మొదలైంది. అయితే ఆడటానికి ఉత్సాహం ఉన్నా ఊరిలో గ్రౌండ్ లేదు! ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొన్నిరోజుల పాటు కలల్లోనే ఫుట్‌బాల్‌ను ఆడసాగారు అక్కడి యువకులు. క్రమంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడాలని, అటునుంచి అంతర్జాతీయస్థాయికి ఎదగాలనే పట్టుదల మొదలైంది. అంతేకాదు మైదానాన్ని ఏర్పాటు చేసుకొనే పట్టుదల కూడా ఉంది వారిలో!
దాదాపు పాతిక మంది యువకులు... పడవలలో, కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణించి ‘చెక్క పలకల’ను తెచ్చుకొన్నారు. తమ నైపుణ్యంతో వాటి ద్వారా సరస్సు మధ్యలోని తమ ఊరిలో దాదాపు 50 మీటర్ల విస్తీర్ణం మేర ఒక గ్రౌండ్‌ను ఏర్పాటుచేసుకొన్నారు! చదువుసంధ్యలు పెద్దగా లేని ఆ తెగ యువకుల్లోని ఫుట్‌బాల్ ఫీవర్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ యువకులకుఉత్సాహమే కోచ్, ఉల్లాసమే స్ఫూర్తి, పట్టుదలే మైదానం... ఈ మూడింటి సహకారంతో ఉదయించినదే ‘పన్ ఈ’ ఫుట్‌బాల్ క్లబ్.
బెస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌గా ఎదిగింది...
ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని బెస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌లలో పన్‌ఈ ఒకటి. ఒక సరస్సు మధ్యలో ఏర్పాటుచేసుకొన్న మైదానంలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన యువకులు అతి తక్కువ రోజుల్లోనే ఇతర జట్ల మీద సవాళ్లకు సిద్ధమయ్యారు. నది మధ్య నుంచి మైదానాల మధ్యకు వచ్చి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నారు. విజయాలు సాధించారు. తమకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొన్నారు. 1986లో గ్రౌండ్ నిర్మాణంలో పాలు పంచుకొన్న యువకులు... 2000 సంవత్సరం నుంచి థాయ్‌లాండ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. ఆ ఏడాది ట్రోిఫీని గెలిచారు. తర్వాత 2004, 2005, 2006, 2007, 2009... సంవత్సరాల్లో యూత్ ఛాంపియన్‌షిప్‌ల విషయంలో పన్‌ఈ క్లబ్ దే హవా!
టీమ్ స్పిరిట్...
వ్యక్తిగతంగా ఆ మైదానం నిర్మాణంలో ఎవరికీ క్రెడిట్ లేదు కానీ... పన్ ఈ ఫుట్‌బాల్ క్లబ్ మాత్రం అత్యంత స్ఫూర్తిమంతమైనదిగా పేరు తెచ్చుకొంది. వీరు సాధించిన విజయాల కన్నా వీరి విజయగాథకు మంచి గుర్తింపు ఉంది. వీరి సక్సెస్‌స్టోరీపై అనేక డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్టు... కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకోవడం కూడా అవసరమే!
-జీవన్‌రెడ్డి బి.