లాభాల సాగు చేయిస్తున్నాడు! | This is the cultivation of the profits! | Sakshi
Sakshi News home page

లాభాల సాగు చేయిస్తున్నాడు!

Published Wed, Apr 9 2014 11:04 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

లాభాల సాగు చేయిస్తున్నాడు! - Sakshi

లాభాల సాగు చేయిస్తున్నాడు!

రైతు... నేలతల్లిని నమ్ముకొన్నవాడు, ప్రకృతిపై ఆధారపడ్డవాడు.. నిత్యం చెమటోడ్చేవాడు. అంతే కాదు రైతంటే ఎదురుచూపులకు అలవాటు పడ్డవాడు... వర్షం కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం, రుణాల కోసం, గిట్టుబాటు ధరకోసం.... సీజన్ వచ్చిందంటే చాలు, నేలతల్లికి దండం పెట్టుకొని తన పనిని ప్రారంభిస్తాడు. అలాంటి అన్నదాత కష్టాల గురించి ప్రతి ఒక్కరికీ అపారమైన జాలి ఉంటుంది. కరణ్‌చోప్రాకు కూడా ఇలాంటి జాలి కలిగింది. అయితే అతడు జాలిని వర్షింపజేయడంతో ఆగిపోలేదు. వారి సమస్యల గురించి అధ్యయనం చేసి, వారి సంక్షేమం కోసం తన వంతు సహకారాన్ని అందించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
 
నష్టాలతో సతమతమవుతున్న రైతుల చేతే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి చూపించాడు కరణ్ చోప్రా(27). ఈ యువకుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని రైతులకు అత్మబంధువుగా మారాడు. గ్లోబల్ అగ్రి డెవలప్‌మెంట్ కంపెనీ (గడ్కో) ఎగ్జిక్యూటివ్‌గా తన ప్రణాళికలను అమల్లో పెడుతూ వ్యవసాయాన్ని లాభసాటి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఆఫ్రికాలోని ఘనా దేశంలో కరణ్ చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయి.

వ్యవసాయం చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఘనా రైతులకు మార్కెటింగ్‌కు మించిన కష్టం మరోటి లేదు. అటువంటి వాళ్లు పండించిన బియ్యాన్ని చైనాకు ఎగుమతి చేసే ఏర్పాట్లు చేశాడు. దీంతో వాళ్ల దశ తిరిగింది. గ డ్కో ద్వారా శాశ్వతంగా ఒక మెకానిజంను ఏర్పాటు చే సి అక్కడ వ్యవసాయదారులకు వరాన్ని ప్రసాదించాడు కరణ్. పొలం, శ్రమ రైతులది అయితే విత్తనాలకు, పెస్టిసైడ్స్‌కు అవసరమైన పెట్టుబడులను గడ్కో ద్వారా పెట్టించి లాభాలను రైతులకే పంచే ఏర్పాట్లను చేశాడు.
 
హార్వర్డ్ గ్రాడ్యుయేట్...
 
అట్లాంటాలో ని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ(హానర్స్) చేసిన కరణ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. భారతీయుడే అయినప్పటికీ చిన్న వయసు నుంచే దేశానికి ఆవల ఉంటున్నాడు. ప్రస్తుతాడికి గడ్కో కార్యకలాపాలను నిర్వహించడానికి ఘనాలోనే నివసిస్తున్నాడు.
 
ప్రముఖలతో పనిచేస్తున్నాడు...

బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో సహా అనేక స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు కరణ్. ప్రత్యేకించి వ్యవసాయదారులకు సహకారం అందించే విషయంలో... గేట్స్‌ఫౌండేషన్ కరణ్ సలహాలను స్వీకరిస్తోంది. ఇంతేగాక... కరణ్ అనేక ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖమైన ఫౌండేషన్లు, వ్యాపార సంస్థలు, ఎన్జీవోలు ఉండటం విశేషం. వ్యవసాయం, ఫారెస్ట్రీ, సహజ వనరుల పరిరక్షణ, నిర్వహణ, ఆర్థికరంగ అభివృద్ధి వంటి విషయాల్లో అతడికి మంచి పట్టుందన్న పేరుంది. ఇథోపియా, గయానా, హైతీ వంటి దేశాల పునర్నిర్మాణ ప్రణాళికలను రచించాడతను.
 
ఫోర్బ్స్ జాబితాలో...
 
కరణ్‌ను సోషల్ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా గుర్తించింది ఫోర్బ్స్ పత్రిక. ప్రపంచ వ్యాప్తంగా సమాజ జీవనాన్ని ప్రభావితం చేస్తున్న ముప్పై మంది యువతీ యువకులతో కూడిన జాబితా ‘30 అండర్ 30’లో ఇతడికి స్థానాన్ని ఇచ్చింది. కరణ్ ఆలోచనలు సమాజాభ్యుదయానికి మార్గంగా కనిపిస్తున్నాయని ఆ పత్రిక ప్రశంసించింది.
 
ప్రత్యేకించి వ్యవసాయదారులకు సహకారం అందించే విషయంలో గేట్స్ ఫౌండేషన్ కరణ్ సలహాలను స్వీకరిస్తుంది. ఇంతేగాక... కరణ్ అనేక ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement