బిడ్డ పేలిక | this story about baby birth! | Sakshi
Sakshi News home page

బిడ్డ పేలిక

Published Tue, Jan 19 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

బిడ్డ పేలిక

బిడ్డ పేలిక

పురిటినొప్పుల కంటే భరించలేని నొప్పులు ఏవో చెప్పుకోండి?!
గొడ్రాలి నొప్పులు!
ఈ నొప్పులు కడుపులోంచి తన్నుకురావు.
సమాజమే స్వయంగా వచ్చి తన్నిపోతుంది.
ఎలాగైనా ఈ నొప్పుల్నుంచి బయటపడాలి.
ఒక పేలిక దొరికినా పట్టుకుని ఈ గొడ్రాలి సముద్రాన్ని
ఈదేయాలి.
కానీ... అదే పేలిక.. ముంచింది!

 
బిడ్డ అచ్చం వాళ్ల నాన్న పోలికే... మా తమ్ముణ్ని చూసినట్టే ఉంది... మేనల్లుడి బుగ్గలు పుణుకుతూ మురిసిపోతోంది మేనత్త. రంగు మేనమామది... అంటూ నచ్చని వాటిని అవతలి వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తోంది నానమ్మ.
 వాళ్లమ్మ కళ్లలాగానే చెంపకు చారడేసి ఉన్నాయి... అంటూ మనవడి అందంలో తన కూతురి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోంది బిడ్డ అమ్మమ్మ.
 పోలికలు ఎవరివైతేనేం... ఎలా ఉంటేనేం... కన్నొంకర కాలొంకర లేకుండా సక్కంగా పుట్టాడు... బంగా...రయ్య... వీడి తాతలాగానే మంచిపేరు తెచ్చుకోవడం నా కళ్లతో చూడాలి... అంటూ బిడ్డ తాతమ్మ మంచంలో కూర్చుని బుడ్డోడి భవిష్యత్తును రీళ్లురీళ్లుగా విజువలైజ్ చేసుకుంటోంది.

బిడ్డను చూడడానికి వచ్చి వెళ్లే బంధువులు, స్నేహితులతో ఇల్లు సందడిగా ఉంది. అందరిలా ఆ ఊళ్లోని ఒకామె కూడా వచ్చి బిడ్డను చూసి, తల్లిని పరామర్శించి చాలాసేపు ఉంది. ఆనక వెళ్లలేక వెళ్లలేక, తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చింది. బిడ్డ మంచాన్ని వదలకుండా దగ్గరే కూర్చుంటోంది. కొంతసేపటికి అయిష్టంగా వెళ్తోంది. నాలుగైదు రోజులు గడిచాయి. హటాత్తుగా ఒకరోజు నుంచి రావడం మానేసింది. ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిడ్డ తాతమ్మ ఊరుకోలేదు. కోడలికి రహస్యంగా ఏదో చెప్పింది. ఆమె గొంతులో ఆదుర్దా, ముఖంలో ఆందోళన. చెప్పడం పూర్తి కాకనే కోడలి ముఖంలోనూ రంగులు మారాయి. ఆవేశంతో ముఖం జేపురించింది. భర్త కోసం వెతికింది.
    
ఆ రోజు సాయంత్రానికి రచ్చబండ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం. అందరి ముఖాలూ ఆగ్రహావేశాలకు ప్రతీకల్లా ఉన్నాయి. అందరి చూపు ఒక మహిళ మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె పెడరెక్కలు విరిచి, చెట్టుకి కట్టేశారు. ఆమె జుట్టు రేగి చింపిరిగా చిందరవందరగా ఉంది. దుస్తులు చిరిగి ఉన్నాయి. చెమటలు కారుతున్నాయి. ఒంటి మీద దెబ్బల వాతలు, నెత్తుటి చారికలు. ఆమె మాట్లాడే ఓపిక కూడా లేనట్లు తల వాల్చేసి నిస్సహాయంగా ఉంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? బాణామతి... ‘నిజమే ఆమె బాణామతి చేస్తోంది’ అందరి ఆరోపణా అదే. ‘ఆమె బాణామతి చేయడం మీరు చూశారా’ అని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోప్రశ్న అంతే సూటిగా వచ్చింది.

‘పురిట్లో బిడ్డ పక్కకేసిన కోకను చింపుకెళ్లినామె బాణామతి చేయకపోతే ఇంకేం చేస్తుంది’ ఆగ్రహంగా ప్రశ్నించాడు బిడ్డ తాత. ఆ పక్కనే వాళ్ల బంధువులు ఆమె మీదకురకడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి నోరు పెగలని స్థితిలో తనకేమీ తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపుతోందామె.
 
అత్త ఆరళ్లకు భయపడి...
ఆ అమాయకురాలి గతంలోకి వెళ్తే... ఆమెకి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. మన గ్రామాల్లో ఒక మహిళను రాచి రంపాన పెట్టడానికి ఈ ఒక్క కారణం చాలు. ‘నీకు పిల్లలు పుట్టేట్టు లేరు. నా కొడుక్కేం తక్కువ... మరో పెళ్లి చేస్తే ఏడాది తిరక్కుండా తండ్రవుతాడు’ అంటూ అత్త సాధింపులు. ఇంట్లో తన స్థానం పదిలంగా ఉండాలంటే ఓ బిడ్డను కనితీరాలి. బిడ్డలు పుట్టే మంత్రం ఏదైనా ఉంటే బావుణ్ను. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఇలాంటి అమాయకుల కోసమే కాచుకుని ఉండే మంత్రగాడు ఆ క్షణంలో ఆమెకు ఆపద్బాంధవుడిలా కనిపించాడు. వారం వారం అతడిని దర్శించుకుంటోంది.

పండ్లు, ప్రదక్షిణలు, దక్షిణలు సమర్పించుకుంటూనే ఉంది. ఆమె కాయకష్టం చేసి దాచుకున్న పైసలు అయిపోయాయి. పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారమూ అయిపోయింది. ఆమె అమాయకంగా అడిగే ప్రశ్నలతో సహజంగానే స్వామీజీ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి స్వామీజీ ఓ ప్లాన్ వేశాడు. ‘పురిట్లో బిడ్డ పక్క చించి చిన్న ముక్క తెస్తే దాంతో పూజ చేస్తాను. అప్పుడు నీకు బిడ్డలు పుడతారు’ అని నమ్మబలికాడు. ఆమె నమ్మింది.
    
మంత్రగాడు చెప్పినప్పటి నుంచి ఊళ్లో ఎవరు బిడ్డను కంటారా అని ఎదురు చూసింది. తనకు తెలిసినావిడ నెలతప్పినప్పటి నుంచి ఆమె ప్రసవం కోసం ఎదురు చూసింది. కొన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. బాలింతను పరామర్శించి, బిడ్డను చూడాలనే వంకతో ఆ ఇంటికి తరచూ వెళ్లేది. ఓ రోజు తననెవరూ చూడట్లేదనుకుని రహస్యంగా బిడ్డ పక్కకేసిన పాత చీర నుంచి చిన్న ముక్కను చించుకుని వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా చేసినా, మంచంలో ఉన్న పెద్దావిడ కంట్లో పడనే పడింది. ఎందుకిలా చేసిందనే సందేహాలు కూడా తలెత్తాయి.

బాణామతి చేయడానికేమోనని అనుమానించారు. తనకు బిడ్డల్లేరు. కాబట్టి బిడ్డలు పుట్టిన వాళ్లను చూసి ఓర్వలేక బాణామతి చేస్తోందేమో! అని మరో సందేహం. అది కేవలం సందేహమే, అయితే ఇదే నిజమని ఊరు ఊరంతా ఆరోపించింది. బాణామతి ఉందని కానీ లేదని కానీ వాళ్లలో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక అమాయకురాలిని వధ్యశిల మీద నిలబెట్టడానికి మాత్రం ఎవరూ వెనుకాడలేదు. తల్లి కావాలనే ఆరాటంతో ఆమె మంత్రగాడిని ఆశ్రయిస్తే, ఆ మంత్రగాడి మోసం, అవకాశవాదం ఆమెను ఊరి ముందు దోషిలా నిలిపాయి.
 
ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆమెను వదిలి పెట్టారు. ఇక్కడ మనసును కలిచి వేసే లౌక్యమూ ఉంది. నిందారోపణలతో శిక్షించడానికి వెనుకాడని జనం, పొరబడ్డామని ఒప్పుకోవడానికి ముందుకురావు. అజ్ఞానాంధకారంలో మూర్ఖంగా ప్రవర్తించాం- అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది. పైగా అదే అహం ముసుగులో ఊరంతా కలిసి ‘పాపం అమాయకురాలు క్షమించేద్దాం’ అని తీర్మానించేశారు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
నచ్చచెప్పడం చాలా కష్టం అయింది
ఇది నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని శివనేనిగూడ గ్రామంలో జరిగింది. ఊళ్లో ఒకావిడను కట్టేసి కొడుతున్నారని తెలిసిన వెంటనే మా జనవిజ్ఞానవేదిక మిత్రులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ మొదలు పెట్టగానే స్థానికులు మా వాళ్ల మీద విరుచుకు పడ్డారు. కొట్టినంత పని చేశారు. మీరు నచ్చినట్లే చేద్దురు కానీ ముందు ఆమెని మాట్లాడనిద్దాం... అని వారిని సమాధాన పరిచాం. ఆమె నోరు విప్పిన తర్వాత అందరిలో సానుభూతి వ్యక్తమైంది.

అయినప్పటికీ... బాణామతి అనేది మూఢనమ్మకం అని ఊరి వారిని సమాధానపరచడం మాత్రం చాలా కష్టమైంది. అదే ప్రదేశంలో సమావేశం పెట్టి మంత్రతంత్రాలు ఉండవని చెప్పాం. ఆమె భర్త, అత్తగారికి విడిగా కౌన్సెలింగ్ ఇచ్చాం. డాక్టర్‌కు చూపించుకుని భార్యాభర్తలిద్దరూ వైద్యం చేయించుకోవాలని సూచించాం. మా ప్రయత్నంతో ఆమె కాపురం చక్కబడింది.
 - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement