సుబ్రహ్మణ్యస్వామి పరధ్యానం
నిడివి : 1 ని.
హిట్స్ : 6,55,207
తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి పరధ్యానం ఇటీవల దేశ ప్రజల వదనాలపై నవ్వుల పువ్వులూ పూయించింది. తిరునెల్వేలిలో జరిగిన ఒక పెళ్లికి హాజరైన స్వామి, ఒక పెళ్లిపెద్దగా ఆచారం ప్రకారం తాళిబొట్టును తాకి పురోహితుడికి తిరిగి ఇవ్వవలసి ఉండగా, దాన్ని పెళ్లికూతురి మెడలో కట్టబోవడం, వెంటనే ఆయన పక్కన ఉన్న స్నేహితురాలు చంద్రలేఖ ఆ పొరపాటును గ్రహించి ఆయన్ని వెనక్కి లాగడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం విరగబడి చూస్తున్నారు. పగలబడి నవ్వుతున్నారు.
ఫ్లోటస్ స్టైల్
నిడివి : 2 ని. 10 సె.
హిట్స్: 5,87,248
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్‌లో తన సతీమణికి ఓ సవాల్ విసిరారు. జిమ్‌లో నీ సత్తా ఏంటో చూపగలవా అని. మిషెల్ ఆ చాలెంజ్‌ను స్వీకరించారు. వైట్ హౌస్ అథ్లెటిక్ యూనిట్‌కి వెళ్లి తన పవర్ ఏమిటో చూపించారు. 51 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు పిల్లల మాతృమూర్తి 35 పౌండ్ల బరువైన రెండు డంబెల్స్‌ను అలవోకగా పైకీ కిందికీ కదిలించారు. పంచించ్ బ్యాగ్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇక అప్పుడు ఒబామా ఒక్కరే చూడరు కదా. అమెరికన్ పౌరులు ఎంతో ఇష్టంగా ఆ వీడియోను చూస్తూ తమ దేశ ప్రథమ పౌరురాలిని ప్రశంసిస్తున్నారట.
గర్ల్స్ లైక్ టు స్వింగ్
నిడివి : 1 ని. 30 సె.
హిట్స్ : 3,36,536
జూన్ 5న విడుదల కాబోతున్న ‘దిల్ ధడ్‌కనే దో’ చిత్రం కోసం శంకర్-ఈషన్-లాయ్ స్వరపరచి ఆలపించిన గర్ల్స్ లైక్ టు స్వింగ్ పాటలో అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రాల డాన్స్‌ను వీక్షించినవారు మళ్లీ మళ్లీ యూట్యూబ్‌ను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కొద్దిపాటి నలుపు రంగు దుస్తుల్లో ప్రియాంక అపరిమితంగా ఆకట్టుకుంటుంటే, అనుష్క ఇంచుమించు అదే రకమైన తెలుపు రంగు బట్టల్లో, సరికొత్త హెయిర్ స్టెయిల్‌తో అలరిస్తున్నారు. అసలు ‘గర్ల్స్‌లైక్ టు స్వింగ్’ అనే టైటిలే కిక్కెక్కిస్తోందని ఇండియన్ యూత్ అంటోంది.
మారీ టీజర్
నిడివి : 0 ని. 32 సె.
హిట్స్ : 4,71,406
ధనుష్ టైలర్‌గా, కాజల్ అగర్వాల్ దారాలమ్మే అమ్మాయిగా నటించిన ‘మారి’ తమిళచిత్రం టీజర్ ఇది. ఇందులో ధనుష్ సిగరెట్ తాగే విధానం అతడి మామగారు రజనీకాంత్ స్టెయిల్‌ను గుర్తుకు తెస్తుంది. కారు అద్దాలు బద్దలవుతుండగా, కారు వెనుక నుంచి నోట్లో సిగరెట్‌తో ధనుష్ మెల్లిగా ఎంట్రీ ఇస్తాడు. మారీ వచ్చే జూలైలో విడుదల కాబోతోంది. రజనీ, ధనుష్‌ల ఉమ్మడి అభిమానులకు ఈ టీజర్ కన్నుల పండుగగా ఉంది. టీజర్‌లో ధనుష్‌తో పాటు కాజల్‌ను కూడా చూపించి ఉంటే కన్నుల నిండుగా ఉండేది.
ఈ వారం యూట్యూబ్ హిట్స్
Published Mon, Jun 1 2015 1:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement