ఈ వారం యూట్యూబ్ హిట్స్ | this week youtube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Sep 11 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

హానెస్ట్ ఎయిర్‌లైన్ కమర్షియల్
నిడివి : 4 ని. 1 సె. : హిట్స్ : 24,69,132

ఎ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అనుకుంటాం కానీ... మనిషి ఎక్కడైనా మనిషే! బస్సులో, రైల్లో, విమానంలో ఎక్కడైనా ఒకటే. విమానంలో కూడానా? అంత ఆశ్చర్యపోకండి. తరచు విమానయానం చేసేవాళ్లను అడగండి. ఫ్లయిట్ జర్నీలో ఊహించని విధంగా ఎన్ని చికాకులు, అసౌకర్యాలు ఉంటాయో తెలుస్తుంది. లేదా ఈ వీడియో చూడండి. మీకు నవ్వొస్తుంది. కోపం వస్తుంది. ఇంకా రకరకాల ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నిగహిగ పేరుతో యూట్యూబ్‌లో తరచు మీకు కనిపించే 26 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్, యాక్టర్ రియాన్ హిగ ఈ ‘హానెస్ట్ ఎయిర్ లైన్ కమర్షియల్’ను తయారుచేశాడు.

ప్రపంచంలోని ప్రతి ఎయిర్‌లైన్‌లోనూ ఇంతే అనే అర్థం వచ్చేలా ‘ఎవ్రీ ఎయిర్‌లైనర్’ అని పేరుపెట్టి ఈ వీడియోను అప్‌లోడ్ చేశాడు. మూడు సీట్ల వరుసలో ఇద్దరి మధ్య నజ్జునజ్జు అవడం, వెనక సీట్లోంచి కాలొచ్చి ముందు సీటు చెయ్యి మీద ఉల్లాసంగా తాళం వెయ్యడం, పిలుస్తున్నా పలక్కుండా పక్క నుంచే ఎయిర్ హోస్టెస్ వెళ్లిపోవడం, చెవులు చిల్లులు పడేలా ఇయర్‌ఫోన్స్‌లోంచి అనౌన్స్‌మెంట్ వినిపించడం.. ఇందులో మీకు కనిపించే ఒక మోస్తరు అనుభవాలు. అంతకన్నా భయంకరమైన అనుభవాలను చూసేందుకు మీరు కనుక ఉవ్విళూరుతున్నట్లయితే వీడియో ఆసాంతం వీక్షించండి.
 
సయా : ది గ్రేటెస్ట్
నిడివి : 5 ని. 51 సె. : హిట్స్ : 2,85,48,856

త్వరలో విడుదల అవబోతున్న ఆస్ట్రేలియన్ గాయని సయా ఫర్లర్ 8వ స్టుడియో ఆల్బమ్ ‘వియ్ ఆర్ యువర్ చిల్డ్రన్’లోని ఈ సింగిల్ ట్రాక్ ‘ది గ్రేటెస్ట్’ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయిన మూడు రోజులకే రెండు కోట్ల హిట్లు దాటేసింది! ఉద్వేగభరితమైన ఈ పాటకు అమెరికన్ డాన్సర్ మాడీ జీగ్లర్ అర్థవంతమైన దృశ్యరూపాన్ని ఇచ్చారు.
 
‘డోన్ట్ గివ్ అప్.. ఐ వోన్ట్ గివ్ అప్.. డోన్ట్ గివ్ అప్.. నో నో నో..’ అనే రిపీటెడ్ లైన్స్‌తో వెళుతుండే ఈ భావగీతం.. ‘‘ఓ ఓ, రన్నింగ్ అవుట్ అఫ్ బ్రీత్, బట్ ఐ ఓ, ఐ, ఐ గాట్ ద స్టామినా.. ’అని మొదలౌతుంది. ‘ఐ యామ్ ఫ్రీ టు బి ద గ్రేటెస్ట్, ఐ యామ్ ఎలైవ్’ అని ఎండ్ అవుతుంది. అమెరికాలోని ఆర్లండోలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా సయా ఈ సింగిల్‌ని రిలీజ్ చేశారు.
 
వీడియోలో జీగ్లర్ తన బుగ్గలపై రెయిన్‌బో చారికలతో కనిపిస్తారు. ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో తక్కిన డాన్సర్లు ఉగ్రవాదాన్ని పరిహసిస్తున్న ధోరణిలో అభినయాన్ని సహవాద్యంగా అభినయిస్తుంటారు.
 
అండర్‌వరల్డ్ : బ్లడ్ వార్స్ / ట్రైలర్
నిడివి : 1 ని. 48 సె. : హిట్స్ : 21,02,005

హాలీవుడ్ యాక్షన్ హారర్ ఫిల్మ్ ‘అండర్‌వరల్డ్ : బ్లడ్ వార్స్’ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అండర్ వరల్డ్ సీరీస్‌లో ఐదో సీక్వెల్ అయిన ఈ చిత్రానికి మొదట అనుకున్న పేరు ‘అండర్ వరల్డ్ : నెక్స్ట్ జనరేషన్’. మూవీ 2017 జనవరి 6న రిలీజ్ అవుతోంది. కేట్ బెకిన్సేల్ హీరోయిన్. నిజానికి హీరోయిన్ కాదు. డెత్ డీలర్! చావుతో ఆటాడుకునే చలాకీ పిల్ల. సీరీస్ అన్నిట్లోనూ కేట్ కంటిన్యూ అవుతోంది.

ఈ కొత్త సీక్వెల్ కథ ఏమిటో పూర్తిగా తెలియకున్నా, మొత్తానికైతే వాంపైర్స్‌కీ, లైకాన్స్‌కి (తోడేలు సంతతి మనుషులు) మధ్య పోరాటమే ప్రధాన కథాంశం అని ట్రైలర్‌ని చూస్తే అనిపిస్తోంది. బై ది వే.. ఇందులో కేట్ కొత్త హెయిర్ స్టెయిల్‌తో కనిపించబోతున్నారు. బహుశా ఇది అండర్ వరల్డ్ సీరిస్‌లో అఖరిది కావచ్చు. ఎందుకంటే మానవాళి సంక్షేమం కోసం వాంపైర్‌లు, లైకాన్‌ల మధ్య యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో కేట్ ఇందులో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి.
 
ఏ దిల్ హై ముష్కిల్ : ఫుల్ సాంగ్
నిడివి : 2 ని. 58 సె. : హిట్స్ : 83,00,903
ప్రేమ ప్రాణం పోస్తుంది. బ్రేకప్ అయితే ప్రాణం తీస్తుంది. మళ్లీ ఇంకొకరికి ప్రాణం ఇస్తుంది. కరన్ జోహార్ డెరైక్షన్‌లో వస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ స్టోరీ లైన్ ఇది. ఈ టైటిల్ సాంగ్‌లో ఈ బ్రేకప్ లవ్‌ని, ప్యాకప్ లవ్‌నీ మీరు చూడొచ్చు. ఐశ్వర్యారాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మల మధ్య నడుస్తుందని అనుకుంటున్న ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఎన్నో కన్నీళ్లు, సంతోషాలు. ‘నువ్వు నా ప్రయాణం.

నువ్వు నా గమ్యం. అయినప్పటికీ హృదయమా నీతో జీవించడం కష్టం’ అనే అర్థం వచ్చేలా ‘తూ సఫర్ మేరా.. హై తు హై మేరీ మంజిల్.. తేరా బినా గుజారా.. ఏ దిల్ హై ముష్కిల్’ అంటూ రణబీర్ కపూర్ బరువెక్కిన గుండెతో పాడుతున్నప్పుడు విడిపోయిన అనుష్కతో అతడి జ్ఞాపకాలు, కొత్తగా కలుసుకున్న ఐశ్వర్యతో అతడి అనుభూతులు రెండూ కంపారిటివ్‌గా ప్రత్యక్షమవుతూ, అదృశ్యమవుతూ ఉంటాయి. మనుషులతో ప్రేమ ఆడుకుంటుందా? ప్రేమను మనుషులే ఒక ఆట ఆడుకుంటారా? ఎప్పటికీ సమాధానం తెలియని ఈ ప్రశ్నకు ఒక అందమైన చిత్రీకరణ ఈ ఎమోషనల్ సాంగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement