జనరేటైర్
ఇంధనాన్ని సమకూర్చే టైర్ ఉందంటే నమ్ముతారా? ఇది నిజం. విద్యుచ్ఛక్తితో నడిచే కారుకి మరింత బ్యాటరీ పవర్‌ను ఈ రకం టైర్లు అందిస్తాయి. జెనీవాలో జరిగిన ఆటో షోలో ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కో’ కంపెనీ ఈ సరికొత్త ‘బీహెచ్‌ఓ3 టైర్’ను ఆవిష్కరించింది. సహజ ఇంధన వనరులు రానురాను తగ్గిపోతున్నందున ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించి ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను ఆవిష్కరించారు. కరెంటుతో నడిచే కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మంచి ప్రాచుర్యం లభిస్తోంది. వాటికి బీహెచ్‌ఓ3 టైర్లు అమర్చడం వల్ల కారు వేగంగా నడిపే సమయంలో టైర్లలో తీవ్రమైన వేడి ఉత్పత్తి అవుతుంది.
ఆ యాంత్రిక వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చి కారు బ్యాటరీకి పంపడం ఈ టైర్ ప్రత్యేకత. అలా మార్చే క్రమంలో కలిగే ఒత్తిడిని తట్టుకునే మెటీరియల్‌తో ఈ టైర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకున్న ప్రధాన సమస్య రీఛార్జింగ్ . పెట్రోల్ దొరికినంత సులువుగా ఎలక్ట్రిక్ రీఛార్జ్ సెంటర్లు దొరకవు. మనదేశంలో అయితే ఎలక్ట్రిక్ కార్ల వాడకం చాలా తక్కువ. ఇప్పుడీ పవర్ జనరేటింగ్ టైర్‌తో ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.