
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : పొగాకు, మద్యం ఆరోగ్యానికి పెను ముప్పు కారకాలని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మరణాల్లో పొగాకు కారణంగా 110 మరణాలు సంభవిస్తుండగా, మద్యం 33 మందిని బలితీసుకుంటోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక ప్రతి లక్ష మరణాల్లో కొకైన్ కారణంగా ఏడుగురు మృత్యువాతన పడుతున్నారని తేల్చింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు కనీసం నెలపాటు విపరీతంగా తాగుతున్నారని, జనాభాలో 15 శాతం మంది రోజూ పొగతాగుతున్నారని పేర్కొంది. గత ఏడాది కొకైన్‌ను ప్రపంచ జనాభాలో కేవలం 0.35 శాతం మందే తీసుకున్నారని వెల్లడించింది. మత్తుపదార్థాల బారినపడుతున్న వారు ప్రతి లక్షమందిలో 500 మంది ఉండగా, 843 మంది మద్యానికి బానిసలయ్యారు. పొగతాగడం, మద్యం సేవించడం ద్వారా లక్షల మంది ఆరోగ్యకర జీవనాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రమాదకర అలవాట్లతో ఏ ప్రాంతంలో నష్టం ఎలా ఉందన్న అంచనాలకు మరింత విస్తృత సమాచార విశ్లేషణ అవసరమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస ఏజెన్సీ తదితర సంస్థల సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు వారు తెలిపారు. అథ్యయన వివరాలు జర్నల్ అడిక్షన్‌లో ప్రచురితమయ్యాయి.