
కృష్ణప్రియం
కన్నయ్య వెన్నదొంగ. కన్ను పడిందా... కుండ వణికిందే!
ఉట్టికెగిరి ఓ పట్టు పట్టేస్తాడు... యశోదమ్మకు పట్టుబడేస్తాడు..
అంతిష్టం.. వెన్నముద్దంటే..!
ట్వంటీ ఫిఫ్త్‌న ఆయన బర్త్‌డే.
కేకుల్లోని వెన్న... కిట్టయ్యకు ఏ మూలకు చెప్పండి?
బాగా... వెన్నపూసను దట్టించి... వెరైటీగా... నైవేద్యాలు సమర్పించండి.
చుట్టుపక్కల చిన్నారి కృష్ణయ్యలకు, కృష్ణమ్మలకు
తిన్నంత వెన్న పంచిపెట్టండి. వందే కృష్ణప్రియం.
అక్కరవడిసాల్
కావలసినవి: బియ్యం- అర కప్పు పెసరపప్పు- ఒక కప్పు; చక్కెర- ఒక కప్పు వెన్న తీసిన పాలు- 3 కప్పులు (ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా వాడవచ్చు) వెన్న తీయని పాలు - అర కప్పు కుంకుమ పువ్వు- నాలుగు రేకలు బాదం, జీడిపప్పు పలుకులు- టేబుల్ స్పూన్ వెన్న- ఒక కప్పు
తయారీ: బియ్యం, పెసర పప్పు కలిపి మందపాటి పెనంలో వేసి సన్న మంట మీద వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో మూడున్నర కప్పుల పాలు పోసి ఆ గిన్నెను ప్రెషర్‌కుకర్‌లో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ లోపు... అరకప్పు మీగడ పాలను మరిగించి కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. పెనంలో రెండు స్పూన్ల వెన్న వేసి జీడిపప్పు, బాదం పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి. కుకర్‌లో ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో మెదపాలి.
ఇప్పుడు వెడల్పాటి పెనంలో వెన్న వేసి కరిగిన తర్వాత అన్నం, పప్పు మిశ్రమం వేసి అందులో చక్కెర కలపాలి. చక్కెర కరిగినప్పుడు అన్నం గరిటె జారుడుగా అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. చివరగా కుంకుమ పువ్వు పాలను పోసి కలిపి, వేయించిన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్ చేయాలి.
గమనిక: ప్రెషర్ కుకర్‌లో నీటిని పోసి అందులో అన్నం, పప్పు ఉన్న పాత్రను పెట్టి ఉడికించాలి. ఈ పాత్ర చిన్నదైతే ఉడికేటప్పుడు పాలు ఒలికిపోతాయి. కాబట్టి పాత్ర సగం ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మిశ్రమం ఉడికిన తర్వాత కూడా పాత్రలో ముప్పావుకు మించదు.
అవల్ పట్టు
కావలసినవి: అటుకులు (అవల్) - ఒక కప్పు బెల్లం- అర కప్పు కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు- పదిపలుకులు (వెన్నతో వేయించాలి) ఏలకుల పొడి- పావు టీ స్పూన్ వెన్న - అర కప్పు నీరు- అరకప్పు (బెల్లం కరగడానికి)
తయారీ: ఖాళీ పెనంలో అటుకులను దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా నీటిని కలిపి (తడిపొడిగా ఉండేటట్లు) పక్కన ఉంచాలి. బెల్లంలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఆ నీటిని మందపాటి పాత్రలో పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఏలకుల పొడి, అటుకుల పొడి వేసి కలిపి కలపాలి. మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చల్లి కలిపి మూత పెట్టి మిశ్రమాన్ని వేడెక్కనివ్వాలి. చివరగా కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. వేడిగా వడ్డించేటప్పుడు పైన కొద్దిగా వెన్న ముద్ద పెట్టవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే దించినప్పుడే పైన వెన్న వేసి కలపాలి.
కేసర్ శ్రీఖండ్
కావలసినవి: పెరుగు - ఒక లీటరు చక్కెర లేదా బెల్లం - వంద గ్రాములు వేడి పాలు - ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు- పది రేకలు ఏలకుల పొడి- ఒక టీ స్పూన్ జాజికాయ పొడి- అర టీ స్పూన్ బాదం, పిస్తా పలుకులు- ఒక టేబుల్ స్పూన్
తయారీ: పెరుగును పలుచని తెల్లటి వస్త్రంలో వేసి మూట గట్టి ఐదు గంటల సేపు వేలాడ దీయాలి. ఇలా చేయడం వల్ల అదనంగా ఉన్న నీరంతా కారిపోతుంది. ఈ లోపు పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. పెరుగులో చక్కెర, కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి, జాజికాయ పొడి కలపాలి. చివరగా బాదం, పిస్తాతో అలంకరించాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత సర్వ్ చేయాలి. ఇష్టమైతే పన్నీరు ఒక టీ స్పూన్ కలుపుకోవచ్చు. బెల్లం వేసేటట్లయితే కరిగించి వడపోసి కొద్దిగా ఉడికించి చల్లారిన తర్వాత కలపాలి.
గమనిక: శ్రీఖండ్ తయారీకి వాడే పెరుగు తయారీ కూడా చాలా ముఖ్యం. పాలను ఎర్రగా కాచి చల్లార్చి పెరుగు చేయాలి.
గోపాల్‌కాలా
కావలసినవి: బియ్యం- 250 గ్రా తాజా కొబ్బరి తురుము - ఒక కాయది అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి) చిక్కటి పెరుగు - 50 గ్రా; వెన్న- అర కప్పు పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి) కీరదోస - 100 గ్రా(చిన్న పలుకులుగా తరగాలి) జీలకర్ర- ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత క్యారట్- ఒకటి(పలుకులుగా తరగాలి) కొత్తిమీర- చిన్న కట్ట; చక్కెర- అర టీ స్పూన్
తయారీ: బియ్యాన్ని కడిగి అరలీటరు నీటిని పోసి పావుగంట సేపు నానపెట్టాలి. ఒక పాత్రలో వెన్న, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి మగ్గిన తర్వాత బియ్యం (నీటితో పాటు) వేసి కలపాలి. అందులో క్యారట్ ముక్కలు, ఉప్పు, కీరదోస, చక్కెర, పెరుగు, కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. దించిన తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. పాతబియ్యం అయితే నీటి మోతాదు పెంచుకోవాలి.
ఉప్పు సీదై
కావలసినవి: బియ్యప్పిండి - ఒక కప్పు (రెడీమేడ్‌గా పిండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టి వడపోసి, తడి పోయే వరకు మందపాటి టవల్ మీద ఆరబెట్టి మిక్సీలో పొడి చేసి జల్లించాలి) మినప్పప్పు- 2 టేబుల్ స్పూన్‌లు ఎండు కొబ్బరి తురుము- 2 టేబుల్ స్పూన్‌లు వెన్న - ఒక కప్పు నువ్వులు- ఒక టేబుల్ స్పూన్ ఉప్పు- తగినంత నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ: మందపాటి పెనంలో మినప్పప్పును దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. బియ్యప్పిండి, మినప్పిండిని కలిపి జల్లించాలి. ఈ పిండిలో ఉప్పు, వెన్న, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని వేస్తూ ముద్ద చేయాలి. బాణలిలో నూనె పోసి కాగేలోపు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పిండి వేసిన వెంటనే అది పైకి తేలితే నూనె కాగినట్లు. అప్పుడు ఉండలను వేసి చిల్లుల గరిటెతో కలియతిప్పుతూ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.
గమనిక: ఉండలు బఠాణి గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. మరీ పెద్దవయితే లోపల సరిగా కాలవు. అలాగే మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. మంట ఎక్కువైతే లోపల పచ్చిగా ఉండగానే పైన నల్లగా అవుతాయి. వెన్న ఉండలు మరింత మృదువుగా కావాలనుకుంటే బియ్యప్పిండిలో మైదా కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యం కోసం మైదాను మినహాయించడమే మంచిది.
వెన్నఉండలు
కావలసినవి: బియ్యప్పిండి- ఒక కప్పు చక్కెర- ఒక కప్పు; వెన్న - నాలుగు కప్పులు
తయారీ: బియ్యప్పిండిలో ఒక కప్పు వెన్న వేసి కలపాలి. అందులో వేడినీటిని పోస్తూ ముద్దగా చేయాలి. దాని మీద తడి వస్త్రాన్ని కప్పి గంట సేపు ఉంచాలి. ఒక పాత్రలో చక్కెర, కప్పు నీటిని పోసి మరిగించి సిరప్ తయారైన తర్వాత మంట తీసేయాలి. ఇప్పుడు బాణలిలో మూడు కప్పుల వెన్న వేసి కాగేలోపు బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. వెన్న కాగిన తర్వాత ఉండలను వేసి కలియబెడుతూ ఎర్రగా కాలిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేయాలి.