లైఫ్‌లో ఒక్కసారి!! | Today World Tourism Day | Sakshi
Sakshi News home page

లైఫ్‌లో ఒక్కసారి!!

Published Mon, Sep 26 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

లైఫ్‌లో ఒక్కసారి!!

లైఫ్‌లో ఒక్కసారి!!

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
ఒన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. జీవితంలో ఒకే ఒక్కసారి. మీ ఫ్యామిలీకి చూపించాల్సిన అద్భుతమైన కిక్కిచ్చే టూరిస్ట్ స్పాట్స్. ఎందుకంటే వరల్డ్స్ బెస్ట్ కూడా మీ ఫ్యామిలీ ముందు తక్కువే. గట్టిగా అనుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు. అదీ... మీ ఫ్యామిలీకి ఎక్సయిట్‌మెంట్ ఇచ్చే ఇలాంటి ఒకే ఒక్క టూరిస్ట్ స్పాట్ అయినా ప్లాన్ చేసుకోండి. లైఫ్‌లో ఒక్కసారి బ్రేక్ ద బోర్‌డమ్!

 
 
మంథా రమణమూర్తి
భాష ఏదైనా భావమొక్కటే. ‘లైఫ్‌లో ఒక్కసారి’ అని క్రీడాకారులు ఒలింపిక్స్‌లో అనుకుంటే... పర్వతారోహకులు ఎవరెస్టు దార్లో... నటీనటులు ఆస్కార్ థియేటర్లో అనుకునే మాట ఇది. సరే!! ఇలాంటి ప్రత్యేకతలేమీ లేని మామూలు జనం సంగతేంటి? మామూలు మనుషులు కూడా కాస్తంత ప్లానింగ్... కొంచెం వ్యయం చేస్తే ‘ఒకే ఒక్కసారి’ లాంటి కలలు నెరవేరుతాయా? నిజం!! ప్రపంచంలో కొన్ని ప్రాంతాలున్నాయి. జీవితంలో ఒక్కసారైనా అవి చూడాలి. కొన్ని సాహస కార్యాలున్నాయి. ఒక్కసారైనా చెయ్యాలి. కాకపోతే వీటికి మరీ ప్రత్యేకతలేమీ అక్కర్లేదు. కాస్తంత ధైర్యం. ఇంకాస్త సంకల్పం. అంతే!! అలాంటివి పరిచయం చేస్తున్నదే ‘సాక్షి’ ఈ ట్రావెల్ స్పెషల్...
   
దూరంగా పొదల్లో ఏదో కదలిక. అంతలోనే చెట్లకొమ్మలు బలంగా ఊగుతాయి. అలా చూస్తుండగానే... చెట్ల చాటు నుంచి ఠీవిగా గజరాజు బయటికొస్తుంది. పర్వతం లాంటి దాన్ని చూశాక... ఈ జంతుకోటిలో మనమెంత చిరు ప్రాణులమో అర్థమవుతుంది. పులి, సింహం లాంటి మృగ రాజాలతో పాటు రకరకాల జంతువుల్ని నేరుగా, అతి దగ్గర నుంచి చూసే అవకాశం ఆఫ్రికన్ గేమ్ లాడ్జిల్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటి గేమ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఎవరికుండదు?
   
ఎర్రటి ఇసుకలో కంటికి అందనంత వేగంతో ఎగిరెగిరి దూకే దుబాయ్ ఎడారి సఫారీ చెయ్యాలి. పెద్దయ్యేలోగా ఒక్కసారైనా డిస్నీలాండ్‌ను చుట్టేయాలి. ఆనందానికి కొలతలేంటో చెప్పే భూటాన్‌కు కుటుంబంతో సహా వెళ్లిరావాలి. ఇవన్నీ ‘ఒక్కసారైనా’ అనుకునే కేటగిరీలోనివే.  ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఈజీగా చేర్చే రవాణా సౌకర్యాలిపుడు అందుబాటులోకొచ్చాయి. ఎక్కడి నుంచి ఏదైనా బుక్ చేసుకునే ఆన్‌లైన్ సదుపాయాలు మన ముందున్నాయి. ఇవన్నీ తెలీకుంటే... బాధ్యత మొత్తం మాకు వదిలేయండంటూ ముందుకొస్తున్న ట్రావెల్ సంస్థలూ బోలెడన్ని. నేడు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’. ఈ సందర్భంగా కొన్ని స్పెషల్ టూర్‌లు, వాటి విశేషాలు.
 
ఎడారి పరిగెడుతుంది
దుబాయ్ సఫారీ
దుబాయ్ ఎడారుల్లో ఇసుక గుట్టలపై నుంచి ఎగిరెగిరి పడే వాహనాల్లో సవారీ చేస్తే..! అది అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేం. అసలు ఆ వేగానికి వాహనాల్లో కూర్చోవటమే కష్టం. మరి వాహనంలో నుంచి తల బయటకు పెట్టి ఓ సెల్ఫీ తీసుకుంటే!!. ఆ మజాయే వేరు. దుబాయ్ అందాల్ని, అక్కడి వాహనాల్ని చూడటం ఒకెత్తయితే... జీవితంలో ఇదే ఆఖరి రోజేమో అనేంత భయంతో పాటు జీవితానికి సరిపడే థ్రిల్‌ను అందించే ఎడారి సఫారీ మరో ఎత్తు. ఇక దుబాయ్‌కి వెళితే అక్కడి బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్‌లను చూడకుండా ఉంటామా? స్కై దుబాయ్ అనుభవం మిస్ అవుతామా? పామ్ జుమేరా, పామ్ ఐలాండ్స్‌ను చూడకుండా తిరిగొస్తామా? కాకపోతే మూడేళ్లలోపు పిల్లలు, బాగా వృద్ధులు, గర్భిణులు మాత్రం సఫారీని చూసి ఆనందించాలంతే!!.
 
ఎలా వెళ్లాలి?
దుబాయ్‌కి నేరుగా విమానాలున్నాయి. హైదరాబాద్ నుంచి బోలెడు విమానాలు. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.10-12వేల మధ్యే ఉంటాయి.
* సఫారీతో పాటు స్థానిక పర్యటనకు అక్కడి టూర్ ఆపరేటర్లపై ఆధారపడొచ్చు. స్థానిక ప్యాకేజీలైతే మనం ఎంచుకునే దాన్ని బట్టి, ఉండే రోజుల్ని బట్టి ఛార్జీలుంటాయి. ప్రారంభ ఛార్జీ ఒక వ్యక్తికి రూ.25వేలు.
* విమాన ఛార్జీలు మినహాయిస్తే... దుబాయ్, అబుదాబి కలిపి ఒక వ్యక్తికి ఏడెనిమిది రోజుల ప్యాకేజీకి కొన్ని సంస్థలు రూ.35 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. రోజులు తగ్గితే ఈ మొత్తం తగ్గుతుంది.
* సఫారీని మాత్రమే ఎంచుకుంటే ఒక మనిషికి రూ.13వేల నుంచి ప్యాకేజీలున్నాయి. వీటిలో పిక్ అప్, డ్రాప్ ఉండవు. వీటితో పాటు బస తదితరాలు కూడా కలిపితే ధరలు రూ.18 వేల నుంచి 20 వేల వరకూ ఉన్నాయి.
 
ఏ సీజన్లో వెళ్లొచ్చు?

* జనవరి, ఫిబ్రవరిల్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రపంచంలోని షాపింగ్ ప్రియులంతా అక్కడకు చేరుతారు. ఇది మంచి సీజన్.
* ఏప్రిల్ నుంచి దుబాయ్‌లో వేసవి కాలం. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సెప్టెంబరు- అక్టోబరు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.
* నవంబరు నుంచి శీతాకాలం మొదలవుతుంది. అప్పటి నుంచి ఏప్రిల్ వరకూ మంచి సీజనే. కాకపోతే రద్దీ ఎక్కువ ఉండకూడదనుకునేవారు జనవరి, ఫిబ్రవరి నెలల్ని ఎంచుకోకపోవటమే మంచిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement