తళుకులీనే తారలెన్నో...
సీనియర్ నట, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి దగ్గర నుంచి కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దాకా దాదాపు ప్రతి హీరో ఇప్పుడు షూటింగ్‌లోనో, స్క్రిప్ట్ పనిలోనో బిజీగా ఉన్నారు. ప్రజాపంథా చిత్రాలకు పాపులర్ అయిన ఆర్.నారాయణమూర్తి తాజాగా అలాంటి మరో కొత్త చిత్రం పనిలో ఉన్నారు. ‘దృశ్యం’ తరువాత కొంత విరామం తీసుకున్న అగ్రహీరో వెంకటేశ్ కొత్త సినిమా షూటింగ్‌కు స్క్రిప్ట్ ఓకే చేసే పనిలో ఉన్నారు. ఇక, లేటెస్ట్ బాక్సాఫీస్ స్టుపెండస్ హిట్ ‘బాహుబలి... ది బిగినింగ్’తో ఉత్సాహంగా ఉన్న ప్రభాస్ ఈ అక్టోబర్ నుంచి ‘బాహుబలి-2’ షూటింగ్‌లో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నారు. రానా కూడా భల్లాలదేవ క్యారెక్టర్‌లోకి మరోసారి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. వచ్చే సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్.
‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ ‘రథం’ అని ప్రచారం) ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. మంచు కుటుంబం నుంచి విష్ణు కొత్త చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మంచు మనోజ్ చేసిన వర్మ సినిమా ‘ఎటాక్’ రిలీజ్‌కు రెడీ అవుతుంటే, దశరథ్ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. ‘భలే భలే మగాడివోయ్’తో చిన్న చిత్రాల్లో తాజా పెద్ద విజయం అందుకున్న హీరో నాని తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.
తమిళ హిట్ ‘సుందర పాండియన్’కు భీమనేని శ్రీనివాసరావు రూపొందిస్తున్న తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ డెరైక్షన్‌లో ఈసారి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’గా శర్వానంద్ అలరిస్తారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ సినిమా సెట్స్‌పై ఉంది. వీటిలో కొన్ని చిత్రాలు ఈ ఏడాది ఆఖరుకు, మరికొన్ని కొత్త సంవత్సరంలో జనం ముందుకు వస్తాయి.