రెండేళ్లలో మూడింతలు | Tripled in two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో మూడింతలు

Published Fri, Feb 28 2014 11:24 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

రెండేళ్లలో మూడింతలు - Sakshi

రెండేళ్లలో మూడింతలు

టార్గెట్..

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి ఏడాదిలో పదేసిరెట్లు, వందేసి రెట్లు సంపాదించిన వారి కథలు చూస్తూనే ఉంటాం. కాకుంటే అలాంటివారు ఒకరో ఇద్దరో ఉంటే... డబ్బులు పోగొట్టుకున్నవారు మాత్రం వందలు, వేలల్లో ఉంటారు. కాకపోతే మంచి షేర్లలో పరిమిత లాభాన్ని ఆశిస్తూ పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం షేర్లు మంచి లాభాలనే ఇస్తుంటాయి. అలాంటి ఓ విజయమే ఇది...
 
నా పేరు శ్రీధర్. చిరుద్యోగిని. మా తాతయ్య 2012లో రిటైరయ్యాడు. వచ్చిన డబ్బుల్లోంచి మా అమ్మకు లక్ష రూపాయలిచ్చాడు. మా అమ్మ నాకు బైక్ కొనుక్కోవడానికి దాంట్లోంచి రూ.25 వేలు ఇచ్చింది. అప్పుడే మా కంపెనీ క్యాబ్ సౌకర్యం ఏర్పాటు చేయటంతో నాకు బైక్ అవసరం లేకపోయింది. అమ్మ ఇచ్చిన డబ్బులు ఏం చేయాలా... అని ఆలోచించా. బ్యాంకులో వేస్తే సురక్షితమే కానీ ఎక్కువ రాబడి రాదు. ఎక్కువ రాబడి వచ్చేది రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో మాత్రమే. కానీ 25 వేలు రియల్ ఎస్టేట్‌కు ఎటూ చాలదు.

స్టాక్ మార్కెట్‌లోనైతే చేయొచ్చు. అలా అనుకున్న తరవాత... ఏ షేర్ కొనాలనేది పెద్ద సమస్య అయింది. అప్పట్లో స్టాక్ మార్కెట్లో ఐటీ, ఫార్మా షేర్ల హవా సాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులున్నాయి కనుక ఐటీ షేర్ల జోలికి వెళ్లకూడదనుకున్నా. మిగిలింది ఫార్మా. అప్పట్లో సన్ ఫార్మా బాగా పెరిగేది. భారత్‌లోని టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటి కావటంతో పాటు, అమెరికా జనరిక్స్ మార్కెట్లో కూడా మంచి ఆదాయం ఆర్జిస్తోందని పేపర్లో చదివా. కొనాలా వద్దా అనుకుంటుండగానే ఆ షేర్ రూ.1,800 నుంచి రూ.2,300కు దూసుకెళ్లింది.

మెడికల్ షాపులకు చెప్పిన టైమ్‌కు డెలివరీ చేయడం, ఇన్వాయిస్‌లు, క్రెడిట్ నోట్‌లు అన్నీ పర్ఫెక్ట్‌గా చేసే కంపెనీల్లో ఇదొకటని మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే మిత్రుడొకడు చెప్పాడు. కంపెనీ పనితీరు బాగుంటే షేరు పనితీరు కూడా బాగుంటుందన్న అంచనాతో ఒక్కో షేర్‌ను రూ.2,300 చొప్పున 10 సన్ ఫార్మా షేర్లు కొన్నా. నా పెట్టుబడి రూ.23,000. నేను కొన్న కొన్ని రోజులకే ఈ షేర్‌ను స్ల్పిట్ చేశారు. రూ.5 ముఖ విలువ ఉన్న షేర్‌ను రూ.1 ముఖ విలువ ఉన్న 5 షేర్లుగా విభజించారు. దీంతో నా దగ్గరున్న 10 షేర్లు 50 అయ్యాయి. షేర్ ధర 2,500 నుంచి రూ.500కు సర్దుబాటయింది.
 
తరవాత మెల్లగా పెరిగి రూ.800కు చేరింది. ఆ సమయంలో 1:1 బోనస్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో నా దగ్గరున్న 50 షేర్లు 100 అయ్యాయి. షేర్ ధర రూ.400కు సర్దుబాటయింది. ప్రస్తుతం రూ.644 పైనే ఉంది. అంటే నా పెట్టుబడి దాదాపు మూడు రెట్లయినట్లు లెక్క. అది కూడా రెండేళ్లలోనే. పెపైచ్చు ఈ రెండేళ్లలో కంపెనీ నుంచి రూ.1,000 పైనే డివిడెండ్ అందింది. అదీ నా ఇన్వెస్ట్‌మెంట్ కథ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement