పక్షవాతానికి ఫేస్‌ టర్నింగ్‌ | Turning to face paralysis | Sakshi
Sakshi News home page

పక్షవాతానికి ఫేస్‌ టర్నింగ్‌

Published Wed, Jan 4 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

పక్షవాతానికి ఫేస్‌ టర్నింగ్‌

పక్షవాతానికి ఫేస్‌ టర్నింగ్‌

ఫేషియల్‌ పాల్సీ పక్షవాతం అనిపిస్తుంది
కానీ... అది పక్షవాతం కాదు.
స్ట్రోక్‌ లాంటి షాక్‌నిస్తుంది
అయినా... భయపడాల్సిన పనిలేదు.
ధైర్యంగా ఫేస్‌ టర్నింగ్‌ ఇవ్వండి
నార్మల్‌ ఫేస్‌కు టర్న్‌ అవ్వండి.


‘అమ్మా! కన్ను ఎర్రగా ఉందేమిటి?’ కంగారుగా అడిగింది కావ్య.‘‘తలస్నానం చేసేటప్పుడు షాంపూ కంట్లోకి వెళ్లింది. అప్పటికీ కళ్లు గట్టిగా మూసుకున్నాను. అయినా ఎలా వెళ్లిందో’’ అంది రమాదేవి చాలా మామూలుగా. అంతలోనే...‘‘నిన్నటి నుంచి చెవి వెనుక నొప్పిగా ఉంది. పట్టించుకోకుండా తలస్నానం చేశాను. నొప్పి పెరుగుతుందో ఏమో’’ టవల్‌ అంచును సన్నగా చేసి చెవిలో దూరుస్తూ అన్నదామె.
‘‘అసలే చలికాలం. చెవి నొప్పెడుతుంటే తలస్నానం చేశావా? అయినా చెవి నొప్పి ఎందుకు వస్తోంది. ఓసారి ఈఎన్‌టికిచూపించుకుందామా’’ అన్నది కావ్య. ‘‘ఈ రోజూ, రేపు చూద్దాం. తగ్గకపోతే డాక్టర్‌ దగ్గరకు పోదాం’’ అని టాపిక్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిందామె.

తల్లీకూతుళ్లిద్దరూ డాక్టర్‌ ఎదురుగా ఉన్నారు. వాళ్ల ముఖంలో కంగారు. రమాదేవి ముఖం పూర్తిగా మారిపోయింది. ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరుస్తోంది. కానీ మాట్లాడిన మాటకు, బయటకు వచ్చే శబ్దానికి పొంతన కుదరడం లేదు. పదాలు స్పష్టంగా పలకలేకపోతోంది. నోరు తెరిస్తే మూతి ఓ పక్కకు లాగేస్తోంది. పెదవులు అదుపు తప్పుతున్నాయి. తన ఇబ్బందిని వ్యక్తం చేయలేకపోతున్నాననే బాధ, తనకు వైద్యం అందేదెలా అనే భయం ఆమె ముఖంలో కనిపిస్తోంది.ఆమె ఆందోళనను అర్థం చేసుకున్న డాక్టరు మెల్లగా చెప్పారు. ‘‘ఇది ఫేషియల్‌ పెరాలసిస్‌. కంగారేం లేదు. ఒకటి – రెండు వారాల్లో మామూలవుతారు’’ అని ధైర్యం చెప్పారు.
పెరాలసిస్‌ అనే పదం వినగానే రమాదేవి, కావ్య భయంతో బిగుసుకుపోయారు. అది గమనించిన డాక్టరు ‘‘ఇది పెరాలసిస్‌ కాదు, పెరాలసిస్‌కీ దీనికీ సంబంధమే లేదు’’ అని ధైర్యం చెబుతూ పరీక్షలు, మందులు రాశారు.

‘‘నిజం అమ్మా! మాటలో స్పష్టతే కాదు, ముఖం కూడా బాగయిపోయింది. పూర్తిగా మామూలయ్యావ్‌. కావాలంటే అద్దంలో చూసుకో’’ అంటూ రమాదేవి భుజం పట్టుకుని లాగి అద్దం ముందు నిలబెట్టింది కావ్య.‘‘అవును నిజమే’’ అంటూ చెంప నిమురుకున్నదామె. నాలుగు వారాలుగా తనను తాను అద్దంలో చూసుకోవడానికే భయపడింది రమాదేవి. రెండు కళ్లను మూస్తూ తెరుస్తూ అద్దంలో చూసుకుంది. నుదుటిని కదిలించి చూసుకుంది. ఆందోళన, భయం స్థానంలో సంతోషం నిండిపోయింది. కావ్య వైపు చూస్తూ ‘‘మందులు ఇంకా వాడాలా? డాక్టర్‌ గారు ఇంకా ఎన్ని రోజులకు రాశారు’’ అంటూ ప్రిస్కిప్షన్‌ చేతిలోకి తీసుకుంది.‘‘మళ్లీ చెకప్‌ వరకు డాక్టర్‌ రాసిన మందులు రాసినట్లు వేసుకో, నీ సందేహాలన్నీ డాక్టర్‌నే అడుగు. సొంత వైద్యాలు చేయకు. నేను లేను కదా అని ఫిజియోథెరపీని నిర్లక్ష్యం చేయకు’’ అని మందలించింది కావ్య చిరుకోపంగా.

సర్జరీ ఎప్పుడు?
మందులు, ఫిజియోథెరపీతో నూటికి ఎనభై మందిలో చక్కటి ఫలితాలు వస్తుంటాయి. మూడు నెలల్లో ఫలితం కనిపిస్తుంది, కొందరిలో ఆరు నెలలపాటు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పటికీ ఫలితం కనిపించనప్పుడు ఏడాది– రెండేళ్ల పాటు నిరీక్షించి ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా ముఖాకృతిని సరి చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఫేషియల్‌ పాల్సీ రావడానికి కారణం ప్రమాదవశాత్తూ ఫ్రాక్చర్‌ కావడం, నరం నొక్కుకుపోవడం వంటివైతే దానికి సర్జరీ చేయడం ఒక్కటే చికిత్స. చెవి వెనుకభాగంలో నరాన్ని సరి చేయడం ద్వారా పరిస్థితి చక్కబడుతుంది.

నిర్ధారణ... చికిత్స!
నూటికి 90 – 95 మందిలో పేషెంట్‌ హిస్టరీ (డాక్టరు ప్రశ్నలకు పేషెంటు ఇచ్చే జవాబులతో అందిన సమాచారం) ద్వారానే నిర్ధారణకు రావచ్చు. కొన్ని సందర్భాలలో ఎంఆర్‌ఐ, ఫేషియల్‌ నర్వ్‌ కండక్షన్‌ స్టడీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే... వ్యాధి కారణాన్ని బట్టి ఉంటుంది. అలాగే పేషెంటు వ్యాధి నిరోధక శక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

మొదటి మూడు రోజుల్లో స్టిరాయిడ్స్‌ ద్వారా ఫాస్ట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ వస్తుంది. ఒకటి – రెండు వారాలు సాధారణ మందులు వాడితే సరిపోతుంది. హెర్పిస్‌ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వాడాలి ∙కనురెప్ప మూతపడక కన్ను తేమ కోల్పోతుంటుంది. దాంతో ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దీనిని నివారించడానికి ఐ డ్రాప్స్‌ సూచిస్తారు. కళ్లలో దుమ్ము, అతి వెలుతురు పడకుండా ఉండడానికి గాగుల్స్‌ పెట్టుకోవాలి ∙మందుల వాడకం ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యం. ముఖం కండరాలు మామూలు స్థితికి రావడానికి కొన్ని ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు. అవి బెలూన్‌లో గాలి ఊదడం, కొవ్వొత్తిని నోటితో ఊది ఆర్పడం, బబుల్‌గమ్‌ నమలడం (కండరం బలహీనపడిన వైపు దవడతో), ముఖం కండరాలకు మసాజ్‌ చేయడం, కంటిని మూసి తెరవడం వంటి వ్యాయామాలు చేయాలి ∙ఇటీవలి వరకు... ముఖం కండరాలకు కరెంట్‌ స్టిములేషన్‌ ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చనే అభిప్రాయం ఉండేది. కానీ దాని ద్వారా అదనంగా పొందే ప్రయోజనం ఏదీ లేదని పరిశోధనల్లో తేలింది. సాధారణ ఫిజియోథెరపీని కచ్చితంగా పాటించడం ద్వారానే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఎందుకు వస్తుందో?
ఫేషియల్‌ పెరాలసిస్‌ రావడానికి స్పష్టమైన, ప్రత్యక్ష కారణాలేవీ లేవు. కానీ ఎక్కువ సందర్భాలలో బెల్స్‌ పాల్సీ కారణమై ఉంటుంది. హెర్పిస్‌ వైరస్‌ కారణంగా నరంలో వాపు రావడం కూడా ఉంటుంది.  ఫేషియల్‌ నర్వ్‌ చిన్న మెదడు నుంచి చెవి వెనుక ఎముక రంధ్రం నుంచి ముఖంలోకి వస్తుంది. దీనికి ఎక్కడ ఇబ్బంది కలిగినా ముఖం కండరాలు బలహీనపడతాయి. ఆ పరిస్థితి ఫేషియల్‌  పెరాలసిస్‌కి దారి తీస్తుంది. వీటితోపాటు... తలకు గాయం కావడం, తలలో ట్యూమర్, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు నరం దెబ్బతినడం, మధుమేహం, సార్క్‌ ఐడోసిస్, జిబి సిండ్రోమ్‌లు కూడా కారణమవుతుంటాయి.

 మాట్లాడబోయినప్పుడు మూతి ఒక పక్కకు లాగుతుంది. ఈ లక్షణం కనిపించే వరకు దీని గురించి పట్టించుకోవడం జరగదు. ఈ లక్షణం బయటపడడానికి ఒకటి – రెండు రోజుల ముందు... చెవి వెనుక ఒక మోస్తరుగా నొప్పి వస్తుంది. అది తీవ్రమైన నొప్పి కాకపోవడంతో పెద్దగా పట్టించుకోరు n నుదుటి కండరాలు కదలికలు మందగిస్తాయి. అయితే అది పరిశీలనగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం. కాబట్టి దానిని సామాన్యంగా గుర్తించలేరు n కనురెప్ప మూత పడదు. దీనిని కూడా ఎవరికి వారు వెంటనే తెలుసుకోలేరు. నిద్రపోతున్నప్పుడు చూసినవాళ్లు గుర్తించగలుగుతారు. సబ్బుతో ముఖం కడిగినప్పుడు రెప్ప మూతపడక కన్ను మంట పుట్టినప్పుడు తెలుస్తుంది. అయినా సీరియెస్‌గా తీసుకోవడం జరగదు n నాలుక ముందు భాగం రుచిని గుర్తించలేదు. లాలాజల ఉత్పత్తి తగ్గడంతో ఆహారం నమిలి తినడం కష్టమవుతుంది n అతి కొద్ది మందిలో చెవి దగ్గర చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది n ఈ సమస్య1–3వ రోజు వరకు ఒక్కొక్క లక్షణం తోడవుతూ తీవ్రస్థాయికి చేరి ఆగిపోతుంది n సాధారణంగా ఇది ముఖంలో ఒక వైపే వస్తుంది. రెండువైపులా రావడం అనేది నూటికి ఒక్క కేసుకు మించదు n మెదడులో రక్తనాళం బ్లాక్‌ అయినా కూడా మాటలు తడబడతాయి. అలాంటప్పుడు ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలుంటాయి. బ్రెయిన్‌ స్ట్రోక్‌లో భాగంగా కూడా ముఖం కండరాలు బలహీనపడి పక్కకు లాగుతాయి. అది ముఖం కిందిభాగంలో మాత్రమే ఉంటుంది.

 డా. బి. చంద్రశేఖర్‌ రెడ్డి
సీనియర్‌ న్యూరాలజిస్ట్‌
సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం.12
బంజారాహిల్స్, హైదరాబాద్‌

– వాకా మంజుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement