
మూగ అమ్మా యిగా అమ్ములు తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచయమే. ‘స్టార్ మా’లో వచ్చే ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా ప్రియాంకా జైన్ ‘అమ్ములు’ పాత్రలో అందంగా ఒదిగిపోయింది. సినిమాలు
చేస్తూ వెండి తెర నుంచిబుల్లితెరకు షిఫ్ట్ అయిన నటిప్రియాంకా జైన్ చెబుతున్న ముచ్చట్లివి.
‘మౌనరాగం సక్సెస్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడి వాళ్లంతా నన్ను తమ ఇంటి అమ్మాయిగా అనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టి పెరిగింది ముంబయ్‌లో. మా నాన్న మనోజ్ జైన్ మొబైల్ బిజినెస్ వల్ల నా చిన్నతనంలోనే బెంగుళూర్‌కి షిప్ట్ అయ్యాం. చిన్నప్పుడు చదువు మీద అంత ఆసక్తి చూపేదాన్ని కాదు. దీంతో మా అమ్మ ఫల్గునీ జైన్ నన్ను ‘నటి’ని చేయాలనుకున్నారు. నా చిన్నప్పటి నుంచి ప్రతి హాలీడేస్‌లోనూ ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడకు తీసుకువెళ్లేవారు. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మాత్రం నాన్న ‘నో’ చెప్పారు. ఎగ్జామ్స్ పూర్తయ్యాక ఫొటో షూట్ చేయించారు. ఆ తర్వాత కొన్ని బ్యూటీ పేజెంట్స్‌లో పాల్గొన్నాను. కన్నడలో ‘గోలీసోడా’ అనే మూవీలో అవకాశం వచ్చింది. అదే తెలుగులో డబ్ అయ్యింది. ఆ తర్వాత ‘చల్తే చల్తే, వినరా సోదర వీరకుమారా’ సినిమాలో చేశాను. ఆ తర్వాత ‘స్టార్ మా’ మౌనరాగం సీరియల్‌లో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది.
సవాల్‌గా తీసుకున్నాను
సీరియల్‌లో నా పాత్ర పేరు అమ్ములు. టీవీ సీరియల్‌లో మూగ అమ్మాయి ద్వారా కథను మెప్పించడం అంటే ఒక పెద్ద ప్రయోగమే అనుకున్నాను. ఇందులో డైలాగుల కంటే హావభావాలకే ఎక్కువ ఇంపార్టెన్స్. నటనలో బాగా రాణించవచ్చు అని ఈ పాత్ర నచ్చి ఒప్పుకున్నాను. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్.. నాలో ‘అమ్ములు’ను చూశారు. నన్ను అంత కాన్ఫిడెంట్‌గా నమ్మి ఓకే చేశారు. నా పాత్రకు నేను న్యాయం చేశానని ఇప్పుడు వస్తున్న ప్రశంసలు బట్టి తెలుస్తోంది.
ఉదయం లేస్తూనే సీరియల్
ఈ ఫీల్డ్‌కి రావడానికి ముందు వద్దని చెప్పిన మా నాన్న ఇప్పుడు హాట్‌స్టార్‌లో తెల్లవారు జామునే ఎపిసోడ్ కోసం చూస్తారు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు భాష అర్ధం కాకపోయినా అన్ని పనులు పూర్తి చేసుకొని సీరియల్ టైమ్‌కి టీవీ ముందు కూర్చుంటారు.
లీనమైపోయాను
సీరియల్ మొదట రాజమండ్రి దగ్గర గోదావరి బ్యాక్ డ్రాప్‌లో స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు లొకేషన్‌లో లంగాఓణీ వేసుకొని అక్కడ చెయిర్ వేసుకొని కూర్చుంటే.. ఒక్క సెకన్‌కూడా కాలేదు ‘ఈ ఇల్లు నాది, ఈ గోదావరి నాది’ అనిపించింది. అంతగా ఆ పాత్రలో లీనమైపోయాను. సీరియల్‌లో నాన్న అంటే భయం. అతను నా ముఖం కూడా చూడరు. ఆ భావాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా నా ముఖ కవళికలు, నటన ఉండాలి. చిన్న తేడా కూడా రాకూడదు. కానీ, ఎందుకో తెలియదు ప్రతి ఎమోషన్ మనసు నుంచి వచ్చేది. కొన్నిసార్లు నేను సరిగా నా భావాలను తెలియపరచలేదు అనిపించినప్పుడు నా చుట్టూ ఉన్నవారు సలహాలు ఇచ్చేవారు. ముందు నుంచి ఈ సీరియల్‌కి ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. కానీ, అమ్ములుగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాను. ఇదే సీరియల్ తమిళ్‌లో కూడా వస్తోంది. అందులోనూ నేనే అమ్ములుని.
కొత్త కొత్తగా ఉన్నవే..
ఎప్పుడూ ఒకేలా ఉండిపోకూడదు. కొత్త కొత్తవి ట్రై చేయాలనిపిస్తుంది. ప్రేక్షకులకు నేను ప్రతీసారి కొత్తగా పరిచయం అవ్వాలనుకుంటాను. అందుకే విభిన్న క్యారెక్టర్ల ద్వారా మెప్పించాలనుకుంటున్నాను. ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఆడియన్స్‌ని ఇన్‌స్పైర్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటాను.
మా అమ్మాయి అమ్ములు
రాజమండ్రి దగ్గర మౌనరాగం షూట్ జరుగుతుంటే ఆడియన్స్ పరిగెత్తుకొని వచ్చేసేవాళ్లు. నా ఫస్ట్ అటెమ్ట్‌కే మంచి రెస్పాన్స్ ‘మీరు మా అమ్మాయి అమ్ముల.. మా ఇంటికి ఎప్పుడు వస్తారు’ అని అడుగుతుంటారు. ఎవరైనా మేడమ్ అని పిలిస్తే ‘మేడమ్ కాదు, మీ అమ్ములునే’ అని చెబుతుంటాను.
వంటలోనూ కొత్తదనం
తీరిక దొరికితే వంటలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాను. వంట చేయడం అంటే చాలా ఇష్టం. అయితే, వంట చేసే సమయంలో మధ్యలో అమ్మతో సహా ఎవరూ రాకూడదని కండిషన్ పెడతాను. వంటతో పాటు పెయింటింగ్, సింగింగ్, డ్యాన్స్... ఇష్టపడతాను.
అంతా నేచురల్
యూనిట్‌లో తెలుగువారిని మెప్పించేలా ఉండాలన్నారు నా కాస్ట్యూమ్స్. ముందు తీసుకున్న కలర్ డ్రెస్సులు కూడా మురికి చేసి డల్‌గా మార్చేశాం. ఫస్ట్ డే మేకప్ మ్యాన్ మేకప్ చేశారు. నాకు మేకప్‌తో ఆ క్యారెక్టర్‌ని చేయడం నచ్చలేదు. మరుసటి రోజు మేకప్ లేకుండా చేస్తాను, అప్పుడు చూడండి అని చెప్పాను. మేకప్ లేకుండా లొకేషన్‌కి వెళితే ఇలాగే నేచరల్‌గా కావాలన్నారు. దీంతో మళ్లీ మళ్లీ టచప్ అనేదే లేదు. అలా నేచరల్‌గా ఆడియన్స్ అమ్ములు క్యారెక్టర్‌ని రిసీవ్ చేసుకున్నారు.ముందు నాకు అస్సలు తెలుగు రాదు. వింటూ వింటూ రెండు నెలల్లో తెలుగు వచ్చేసింది. ఎవరేం మాట్లాడుతారో వాళ్ల మధ్య ఉంటూ మాటలు వింటూ వచ్చాను. మొదట్లో కాదు, రాదు, వద్దు.. పదాలను ఎక్కడ ఉపయోగించాలో తెలియదు. యూనిట్‌లో తెగ నవ్వుకునేవారు. ఇప్పుడు నా భాష విని తెలుగమ్మాయినే అంటున్నారు. మూగమ్మాయిలా నటించినా నా యాక్టింగ్ మాట్లాడుతుంది అనుకుంటాను.’’– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment