
‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో..
‘అగ్నిసాక్షి’ సీరియల్ హీరో శంకర్ బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితం. అసలు పేరు అర్జున్ అంబటి. బుల్లితెరపై గౌరితో ప్రణయం, పరిణయం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ‘స్టార్ మా’లో వచ్చే ఇస్మార్ట్ జోడీ రియాల్టీ షో ద్వారా తన అర్ధాంగి సురేఖతో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో సందడి చేస్తున్నారు. ‘నేను బెంగళూరు నుంచి వచ్చాను అనుకున్నారు చాలామంది. కానీ, తెలుగింటి అబ్బాయినే’ అంటూ తన గురించి వివరించారు అర్జున్.
‘అగ్నిసాక్షి’ సీరియల్‌కు ముందు ‘అర్ధనారి’ అనే సినిమా చేశాను. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సౌఖ్యం, దేశముదురు ఇటీవల అశ్వమేధం సినిమాల్లో నటించాను. నేను స్క్రీన్ ముందుకు రాకముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. చెన్నై, హైదరాబాద్‌లలో ఐటీ కంపెనీలో జాబ్ చేశాను. సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపుగా వచ్చాను. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా సీరియల్ ఆఫర్ వచ్చింది.
ఆసక్తిగా అగ్నిసాక్షి
వందలో ఒకటో రెండో ఇలాంటి సీరియల్ టాపిక్స్ వస్తాయనుకుంటాను. అరుదైన కథతో ఆసక్తిగొలిపే కథనం గల ఈ సీరియల్ నన్ను వరించడం గొప్పగా భావిస్తున్నాను. ఈ సీరియల్ నటుడిగా నన్ను నిలబెట్టింది. ఈ సీరియల్‌లో డ్రెస్సింగ్ స్టైల్ మిగతా అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ఆప్యాయంగా చూడటం, కుటుంబం.. ఆ పద్ధతులు... అన్నీ చాలా డిఫరెంట్. ఈ సీరియల్‌లోని విషయాలు కొన్ని నా నిజజీవితంలో పాటించేలా చేశాయి. చేసిన ఫస్ట్ సీరియల్‌కే మంచి గుర్తింపు వచ్చింది. అవార్డులూ వరించాయి.
సాఫ్ట్‌వేర్ నుంచి..
మొదట్లో అందరూ నన్ను బెంగుళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మాది విజయవాడ దగ్గర నర్సరావు పేట. మా నాన్న ఫిల్మ్ డిస్టిబ్యూటర్. అమ్మ గృహిణి. తమ్ముడు, చెల్లీ ఉన్నారు. వాళ్లిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా నేనూ, సురేఖ బయట కలిశాం. మా పరిచయం స్నేహంగా మారింది. రెండేళ్లు గడిచాక ఇరు కుటుంబాల అంగీకారంతో మా ప్రేమ పెళ్లి పీటలెక్కింది.
రియాల్టీ షో
‘స్టార్ మా టీవీ’లో ఇస్మార్ట్ జోడీ అనే పేరుతో వచ్చే భార్యభర్తల డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. నా భార్య సురేఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ ఉద్యోగి. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా ఇరువైపు కుటుంబాల్లో ఏ చిన్న ఈవెంట్ అయినా తన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాకపోతే ఇలా కెమెరా ముందు డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. తను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ షోలో పాల్గొంది. అది చూసి నాకూ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతీవారం ఒక థీమ్ ఇస్తారు. వెడ్డింగ్, కుకింగ్ స్పెషల్.. అంటూ ఒక్కోవారం ఫన్ టాస్క్‌లు ఉంటాయి.
రూమర్స్‌కి దూరం
మా పెళ్లి అయ్యి ఏడాది పూర్తయ్యింది. సురేఖ చాలా సపోర్టివ్ నాకు. రూమర్స్ వచ్చినప్పుడు నేను కొంత డిస్టర్బ్ అయినా తనే నన్ను అర్థం చేసుకుంటుంది. ‘మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది. నేను అర్ధం చేసుకోగలను’ అంటుంది. తను చాలా కూల్ పర్సన్. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. ఏదైనా విషయంలో ఇద్దరం గొడవపడినా.. తనే ముందు మాట్లాడి మూడీగా ఉన్న వాతావరణాన్ని ప్లెజెంట్‌గా మార్చేస్తుంది.
అందరం ఒక చోట
మా అమ్మ నాన్న విజయవాడలో. తమ్ముడు, చెల్లి విదేశాల్లో. మేం హైదరాబాద్‌లో. మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఇటీవల కాలంలో ఉన్నది లేదు. పండగలప్పుడు కూడా అందరం కలవడానికి కుదరడం లేదు. అదొక్కటే బాధగా ఉంటుంది. మేమందరం కలుసుకుని సరదాగా గడిపేలా ఒక్క పండగైనా చేసుకోవాలని మా వాళ్లకు చెబుతుంటాను.’– సంభాషణ: నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment