సోదరీ మణులు!
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న... అనే మాటను ఆ ఇద్దరు చాలా సార్లు వినే ఉన్నారు. అమెరికా నుంచి మాతృదేశమైన ఇండియాకు వచ్చి, తిరుగు ప్రయాణంలో- ‘‘భగవాన్...ఈ పేదలను ఆదుకో’’ అని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అంతేకాదు...అమెరికాకు తిరిగి వెళ్లిన తరువాత ఇండియాలోని పేద పిల్లలకు ఆపన్న హస్తం అందించడానికి నడుం బిగించారు...
కవల సోదరీమణులెన ఆర్యా, దివ్యా ఆనంద్‌లు నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు స్వదేశాన్ని చూశామనే సంతోషం కంటే తాము చూసిన కొన్ని దృశ్యాలు, విన్న మాటలు వారిని బాధకు గురి చేశాయి.
ఆడిపాడాల్సిన వయసులో పిల్లలు వీధుల్లో అడుక్కోవడం వారిని కంట తడి పెట్టించింది. చదువుకోవాల్సిన పిల్లలు కూలి పనులకు వెళ్లడం వారిని బాధ పెట్టింది.
‘‘చదువుకునే వయసులో ఇదేమిటి?’’ అనుకున్నారు బాధగా. అమెరికాలోని మాసాచుసెట్స్, అండోవర్ హైస్కూల్‌లో చదువుకుంటున్న ఈ కవల సోదరీమణులు బాధ పడి మాత్రమే ఊరుకోలేదు. తమవంతుగా ఏదైనా చేయాలనుకొని రంగంలోకి దిగారు. దాతల దగ్గర విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ‘ల్యాంప్’ సహకారంతో మన దేశంలోని పేద పిల్లలకు తోడ్పాటు అందించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. 2003లో మొదలైన ‘ల్యాంప్’ ఫౌండేషన్ దాదాపు మూడు లక్షల మంది పిల్లలను విద్యావంతులను చేసింది. ‘‘మాకున్న సౌకర్యాలతో ఇండియాలోని పేద పిల్లల దీనస్థితిని పోల్చుకున్నప్పుడు చాలా బాధేసింది’’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ఆర్యా, దివ్యాలు. బాధ... బాధను మాత్రమే మిగల్చదని... కొత్త ఆలోచనను కూడా ఇస్తుందని ఆర్యా, దివ్యా ఆనంద్‌లను చూస్తే సులభంగానే అర్థమైపోతుంది!