ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది | Undermines love to hate | Sakshi
Sakshi News home page

ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది

Published Thu, Jul 3 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది

ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది

ధ్యాన భావనలు
 
మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని!
 
ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది.
 
అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి.
 
అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం.   
 
శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను.
 
ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను.

ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి.
 
-  స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement