
ఈ జ్యూస్‌తో గుండె జబ్బులు దూరం.
టోక్యో : ఉప్పు కలపకుండా టొమాటో జ్యూస్ నిరంతరం తీసుకోవడం బీపీ, కొలెస్ర్టాల్‌లను తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుందని తాజా అథ్యయనం తేల్చింది. దాదాపు 500 మంది స్త్రీ, పురుషులను ఏడాది పాటు పరిశీలించిన మీదట ఉప్పులేని టొమాటో జ్యూస్ తీసుకున్న వారిలో బీపీ గణనీయంగా తగ్గినట్టు తేలిందని టోక్యో మెడికల్, డెంటల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది.
తమ అథ్యయనంలో పాల్గొన్న వారిలో సిస్టోలిక్ బీపీ సగటున 141 ఎంఎంహెచ్‌జీ నుంచి 137కు తగ్గగా, డయాస్టలిక్ బీపీ సగటున 83.3 నుంచి 80కి తగ్గిందని పరిశోధకులు తెలిపారు. ఇక చెడు కొలెస్ర్టాల్ సగటున 155 నుంచి 149కు తగ్గినట్టు గుర్తించారు. మహిళలు, పురుషులు సహా భిన్న వయసుల వారిలో ఒకేరకంగా సానుకూల ఫలితాలను గమనించామని చెప్పారు. ఏడాదిపాటు భిన్న వయసులు, స్త్రీ, పురుషులపై ఈ తరహా అథ్యయనం జరగడం ఇదే తొలిసారని ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అథ్యయన పరిశోధకులు వెల్లడించారు.