వెల్లుల్లి... పొట్టను కడిగేస్తుంది!
తిన్న తర్వాత నోటి నుంచి ఘాటైన వాసన వస్తుంటుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
► వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ రక్తనాళాల్లో కొవ్వులు పేరుకోనివ్వదు. గుండెజబ్బులను నివారిస్తుంది.
► వయసు పెరగడాన్ని, క్యాన్సర్‌ను ప్రేరేపించే ఫ్రీరాడికల్స్‌ను అల్లిసిన్ అదుపు చేస్తుంది.
► వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లో సాగే గుణం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లి తిననివారితో పోలిస్తే... క్రమం తప్పకుండా తినే వారిలో రక్తనాళాలు సాగే గుణం 72% అధికం.
► జలుబుతో బాధపడేవారు వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే తక్షణం ఉపశమనాన్ని కలగజేస్తుంది.
► క్రమం తప్పకుండా వెల్లుల్లి తినేవారిలో పొట్ట పరిశుభ్రంగా ఉంటుంది. వెల్లుల్లి వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. నిత్యం వెల్లుల్లి తినేవారిలో స్టమక్ క్యాన్సర్, పెద్దపేగు, కోలోరెక్టల్ క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ.