లవ్‌ మీటర్‌ | valentines day special | Sakshi
Sakshi News home page

లవ్‌ మీటర్‌

Published Mon, Feb 13 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

లవ్‌ మీటర్‌

లవ్‌ మీటర్‌

సినిమాలో మీటితే వచ్చేది లవ్‌ మరి, దాన్ని లవ్‌ మీటర్‌ అనమా?
చిరిగిన ప్యాంట్‌ వేసుకున్న అబ్బాయిది లవ్వు
కుదరదు పొమన్న అమ్మాయి తెగువ జివ్వు
చంపేస్తా.. నరికేస్తా.. అన్న విలన్‌ది భౌవ్వు
అంతా సెటిల్‌ అయిపోతే క్లైమాక్స్‌లో నవ్వు

ఓకే... ఆర్టికల్‌ బాగుంటుంది
కమాన్‌... సినిమా లవ్వుని కొంచెం తవ్వు
ఆ“ మీటర్‌ పడిందిరా!
ఇచ్చి పుచ్చుకో సినిమా ప్రేమకి ఎర్ర గులాబీ పువ్వు!


ప్రేమ ఒక సినిమా
‘సాహసం చేయరా ఢింబకా. రాకుమారి లభించునులే’ అంటాడు నేపాళ మాంత్రికుడు. రాకుమారిగానీ, ప్రేమగానీ సాహసం లేకుండా దొరకవని తెలుగు సినిమాలో సమర్థంగా ప్రవేశ పెట్టిన నటుడు ఎన్‌.టి.రామారావు. ఆయన నటించిన రెండు ప్రేమకథలు ‘పాతాళభైరవి’, ‘మల్లీశరి’ దాదాపు ఒక సమయానికి చెందినవి. నిరుపేద కూడా రాకుమారిని వలచవచ్చు, వలచి సాధించవచ్చు అని ‘పాతాళభైరవి’ నిరూపిస్తే నిర్మలమైన ప్రేమకు అడ్డుగా చక్రవర్తి నిలుచున్నా ఆ ప్రేమ సఫలమై తీరుతుందని ‘మల్లీశ్వరి’ స్థిరపరిచింది. తెలుగు సినిమాల్లో ప్రేమ, పాటా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. అందుకే ప్రేమ ఉంటే పాట ఉంటుంది. పాటలో ప్రేమ ఉంటుంది. ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’... వాహ్‌ ఏం పాట. ‘జాలి గుండెల మేఘమాల..’ అని మేఘాలతో ప్రేమను మొరపెట్టుకుంటే మనసు మబ్బుల్లో తేలిపోదూ.

కుడి ఎడమైంది
ఇలా సాహసంగా మొదలైన ప్రేమ మరో రెండేళ్లకు మందుగ్లాసు పట్టుకుంది. మరి మన ఏ.ఎన్‌.ఆర్‌ వచ్చాడు కదా. ‘పల్లెకు పోదాం పారును చూదాం చలోచలో...’ అని హుషారుగా ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ సఫలం కాదు. పార్వతి కోసం దేవదాసు పుట్టాడు. దేవదాసు కోసం పార్వతి ఊపిరి పోసుకుంది. వారిద్దరినీ విధి ఓడిస్తే ఆలంబనగా మత్తు విషాన్ని ఆశ్రయించాడు దేవదాసు. ‘శరత్‌’ రాసిన ఈ నవల భారతదేశానికే కాదు భారతీయ ప్రేమకు కూడా ఒక పాత్రను ఇచ్చింది. ప్రతి విఫల ప్రేమికుడూ లోకం దృష్టిలో దేవదాసే. ప్రేమ ఫలిస్తే ఒక దైవత్వం. విఫలమైనా దైవత్వమే. అందుకే దేవదాసు ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌..’ అన్నాడు. అవును. ఓడిపోలేదోయ్‌.

నా పేరు బికారి నా దారి ఎడారి
కృష్ణ వచ్చాడు. రావడం రావడమే రివాల్వర్‌తో ఢామ్మని ప్రేమలో పడ్డాడు. ‘డీరి డిరిడిరి డీరిడి’ అని అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. కాని తుపాకీని ప్రేమించేవాడికి కూడా మెత్తటి మనసు ఉంటుంది. అందుకే ‘శ్రీ రాజరాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌’లో కృష్ణ హోటల్‌ అధిపతి అందాల కుమార్తెను మూగగా ప్రేమించాడు. ‘నా పేరు బికారి... నా దారి ఎడారి..’ అయినా నన్ను ప్రేమించలేవా అని ప్రాధేయపడ్డాడు. ‘ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంట..’ అని పాటల్లో కలలు కన్నాడు. ఆ ప్రేమ ఫలించిందనుకోండి చివరకు.

నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు
ఇలా పవిత్రంగా అమూర్తంగా ఉన్న ప్రేమ శోభన్‌బాబు దగ్గరకు వచ్చేసరికి కొంచెం హద్దు దాటింది. అసలే మంచు ప్రాంతం. ఆమె చలి బారిన పడింది. పక్కనే అతడున్నాడు. ప్రేమలో ఉన్న జంట దగ్గరయ్యింది. కాని దాని వల్ల వారి మధ్య ఎడబాటే వచ్చింది. బిడ్డ పుట్టినా కలిసి ఉండలేని దురదృష్టం. ‘నిన్ను మరిచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా...’ అని అతడు బాధ పడాల్సి వచ్చింది ‘మంచి మనసులు’ సినిమాలో. కాని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని సినిమా చివరలో ఆమే, అతడూ, నడిచే కొడుకూ ఒక్కటవుతారు. ఇదే శోభన్‌బాబు ‘గోరింటాకు’ సినిమాలో ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం...’ అంటూ సుజాతను ప్రేమిస్తాడు. ‘కొమ్మకొమ్మకో సన్నాయి..’ అని ఆమె ప్రేమలో రాగాలు ఊదుకున్నాడు. ఆమె మాత్రం గోరింటాకులా అతడి బతుకును పండించి రాలిపోతుంది. కొన్ని ప్రేమలు అంతే. ఎదుటివారి జీవితాన్ని పండిస్తాయి.

నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
కృష్ణంరాజు నటించిన ‘అమరదీపం’లో ఈ పాట. దేవదాసు సినిమాలో తాగితాగి అతడు మరణాన్ని ఆశ్రయిస్తే తను ప్రేమించిన ప్రియురాలి సంతోషమయమైన జీవితం కోసం ఈ సినిమాలో కృష్ణంరాజు ఆత్మార్పణ చేసి అమరదీపం అవుతాడు. అసాంఘిక కార్యక్రమాల్లో ఉన్న కృష్ణంరాజు తన దగ్గర పని చేసే జయసుధను ప్రేమిస్తాడు. కాని ఆమె అతడి తమ్ముణ్ణి కోరుకుంటుంది. వారిరువురూ ఇతడి మనసు తెలుసుకోలేక ద్వేషిస్తారు. ఏ దేవత అయితే తన జీవితంలో ఉదయించిందో ఆ దేవతే శాపంగా మారడం అతడు తట్టుకోలేక వారి జీవితాల్లో నుంచి నిష్క్రమిస్తాడు.

అగ్రిమెంట్‌ ప్రేమ
ఈ తీరులో సాగుతున్న తెలుగు సినీ ప్రేమ కథను బాలచందర్‌ ‘మరో చరిత్ర’ మలుపు తిప్పింది. తమిళ అబ్బాయి, తెలుగు అమ్మాయి, భీమిలీ బీచ్, అందమైన పాట ఆ సినిమా తెలుగు ప్రాంతపు నలుమూలలా ప్రేమను పదింతలు పెంచి, కుర్రకారును ప్రేమలో మునకలేసేలా చేసింది. ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించారు. అప్పుడే ఆ ప్రేమికులు ఆ తల్లిదండ్రులు పెట్టిన అగ్రిమెంట్‌కు అంగీకరిస్తారు. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా గడిపి తమది నిజమైన ప్రేమ అని నిరూపించి పెళ్లి చేసుకుందామనుకుంటారు. కాని ప్రేమికులు ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది. ఆ గొప్ప ప్రేమికులు తమ ప్రేమలో ప్రాణాలు కోల్పోయి తీరంలో అనాథ కెరటాల్లా విగతమవుతారు.

ప్రేమకు ఖైదీ
చిరంజీవి వచ్చాడు. రగులుతోంది మొగలిపొద అన్నాడు. ‘ఖైదీ’లో మాధవితో ప్రేమలో పడ్డాడు. కాని ఆ ప్రేమ రావుగోపాలరావుకు ఇష్టం లేదు. నానా హింసా సృష్టించాడు. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన హీరోని ఖైదీగా మార్చాడు. చివరకు ఆ ఖైదీ క్లయిమాక్స్‌లో ‘పగ కోసం ఈ జన్మ ప్రేమ కోసం మరో జన్మ...’ అని అనాల్సి వస్తుంది. ఇదే చిరంజీవి ‘రుద్రవీణ’లో తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఒక దళిత అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్లది నిజంగా ఎంతో హుందా అయిన ప్రేమ. ఊరి బాగు కోసం ఆ ప్రేమికులిరువురూ తమ ప్రేమను త్యాగం చేస్తారు. ‘లలిత ప్రియ కమలం విరిసినది’... ఆ పాట మాత్రం ప్రేక్షకులకు మిగిల్చారు.

సాహసమే జీవితం
తండ్రి నీడ నుంచి బయటికొచ్చి హీరోగా పూర్తి స్థాయి కెరీర్‌ ప్రారంభిస్తూ బాలకృష్ణ చేసిన తొలి సినిమా ప్రేమ సినిమాయే. మొన్నటి ‘చంద్రముఖి’ డైరెక్టర్, పెద్ద ఎన్టీఆర్‌కు పర్సనల్‌ మేకప్‌ మేన్‌ అయిన పి.పీతాంబరం కుమారుడు పి.వాసు దాని డైరెక్టర్‌. విజ్జి హీరోయిన్‌. కాలేజీలో, సిటీ బస్సులో ప్రేమలూ మొదటిసారి చూపించిన సినిమా ‘సాహసమే జీవితం’. అంతేకాదు తమ క్లాస్‌మేట్స్‌ ప్రేమను విజయవంతం చేయడానికి కాలేజీ స్టూడెంట్స్‌ తిరుగుబాటు చేయడాన్ని మొదటిసారి చూపిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత దానిని చాలా సినిమాల్లో ఉపయోగించారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా, మరో ప్రేమ కథ (వరుసకు మరదలైన రజనీని చిన్నప్పటి నుంచి ప్రేమించి, పెద్దయ్యి సాధించుకోవడం)  ‘సీతారామ కల్యాణం’తో బాలకృష్ణ పెద్ద విజయాన్ని సాధించాడు. ‘రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లూ...’ పాట ఉన్న ఆ సినిమా మంచి ప్రేమ సినిమాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

మజ్నూ ప్రేమించిన గీతాంజలి
తండ్రికి ‘ప్రేమాభిషేకం’ ఇచ్చిన దాసరి నారాయణరావు.. కొడుకు నాగార్జునకు ‘మజ్నూ’ ఇచ్చాడు. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జునను ఎత్తి గట్టున పెట్టిన సినిమా ఈ ‘మజ్నూ’. నాటి దేవదాసు స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో కూడా నాగార్జున మరణిస్తాడు. ఈ సినిమాలో నాగార్జున తాను ప్రేమించిన రజనీని కొందరి మాటల ప్రభావంతో అనుమానిస్తాడు. ప్రేమలో ఉండాల్సింది నమ్మకమనీ అనుమానం కాదనీ ఆమె అతణ్ణి చీదరించుకుని విడిపోతుంది. దాంతో తట్టుకోలేని నాగార్జున చివరకు మృత్యు పరిష్వంగంలో సేద తీరుతాడు. కాని మరణం ఖాయం అని తెలిసినా ఎప్పుడు వస్తుందో తెలియని మరణం కోసం ఎదురు చూసేకన్నా ఉన్న నాలుగు రోజులు హాయిగా ప్రేమలో ఉందాం అని చెప్పిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’. ఇందులో హీరో హీరోయిన్‌ ఇద్దరూ కేన్సర్‌ బాధితులే. కాని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారిని బతికిస్తుంది. బతికించగలుగుతుందనే భరోసాను ఇస్తుంది. ‘ఓ పాపా లాలి...’, ‘ఆమని పాడవే హాయిగా...’ వంటి హాౖయెన పాటలు ఉన్న ఈ ప్రేమ సినిమాలు ప్రభాతపు మంచుదుప్పట్ల అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఈనాడే ఏదో అయ్యింది
ప్రేమకు అమ్మాయి తండ్రో అబ్బాయి తండ్రో అడ్డు పడటం అప్పటి దాకా అందరూ చూశారు. కాని అమ్మాయి తల్లి ప్రేమకు విలన్‌ కావడం ‘ప్రేమ’లో చూశారు. సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, రేవతి కలసి నటించిన ఈ సినిమాలో రేవతి తల్లి మంజులకు, వెంకటేష్‌కు ఇగో క్లాషెస్‌ వస్తాయి. ఆమె వారి ప్రేమను అన్ని విధాలా అడ్డుకుంటుంది. కాని గొప్ప మనసు, పాట ఉన్న  వెంకటేష్‌ ప్రేమే చివరకు గెలుస్తుంది. మొదట ఈ సినిమా క్లయిమాక్స్‌లో హీరోయిన్‌ చనిపోతుంది. కాని ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చనిపోయే సీన్‌ను వెంటనే కట్‌ చేశారు. ఇళయరాజా ‘ఈనాడే ఏదో అయ్యింది..’ హిట్‌ ఇందులోనే. ప్రేమ సినిమాలో రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండే వెంకటేషే ‘చంటి’ సినిమాలో ఎంతో అమాయకంగా మీనా ప్రేమలో పడతాడు. పావురానికి, పంజరానికి పెళ్లి చేసే పాడులోకంలో వారి ప్రేమకు చాలా అడ్డంకులే వస్తాయి. చివరకు సఫలమయ్యి ‘ఎన్నెన్నో అందాలు...’ వారు చూడగలుగుతారు.

తొలిప్రేమ, వర్షం, నువ్వు–నేను
ఆ తర్వాతి తరంలో ఎందరో హీరోలు. ఎన్నో ప్రేమ కథలు. సృష్టిలో స్త్రీ, పురుషుడు ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది. తెర మీద సినిమా ఉన్నంత కాలం అందులో ప్రేమ ఉంటుంది. కెరీర్‌ ఒడిదొడుకులలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ను హిట్‌లలోకి తీసుకుచ్చింది కరుణాకరన్‌ తీసిన ప్రేమకథ ‘తొలి ప్రేమ’. అందులో గొప్పింటి అమ్మాయిని ప్రేమించి మామూలు కుర్రాడు బాలూగా పవన్‌కల్యాణ్‌ మనసులను ఆకట్టుకుంటాడు. ఇక ‘వర్షం’లో ప్రభాస్, త్రిషాలు ప్రేమజల్లులను ప్రేక్షకుల మీద చిలకరిస్తారు. అయితే దర్శకుడు తేజా వచ్చి ప్రేమను మరింత ఘాటుగా ప్రేక్షకులకు ఎక్కించాడని చెప్పాలి. ఉదయ్‌కిరణ్, అనితా కలిసి నటించిన ‘నువ్వు–నేను’ పెద్ద హిట్‌. ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కామా...’ పాటా హిట్టే. ఇదే తేజా నితిన్, సదాలతో తీసిన ‘జయం’ ఇంకా పెద్ద హిట్టయిన ప్రేమకథగా నిలిచింది. హీరోయిన్‌ కాలిపట్టీలతో హీరో ప్రేమలో పడతాడు. ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో...’ అని ప్రశ్నిస్తాడు. ఈ కాలంలోనే ప్రేమను స్నేహం అనుకుని మోసపోవద్దు, స్నేహాన్ని ప్రేమ అనుకొని భ్రమపడవద్దు అనే పాయింట్‌తో వచ్చిన ‘నువ్వే కావాలి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తరుణ్, రిచాలకు మాత్రమే కాదు యువ ప్రేక్షకులకు కూడా అదో పెద్ద జాక్‌పాట్‌. లవ్‌పాట్‌. వీటి మధ్యలో ఫ్యాక్షన్‌ కథలో కూడా అందమైన ప్రేమను చూపించగలిగిన ‘ప్రేమించుకుందాం రా’, ‘ఒక్కడు’ సినిమాలను కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు. ‘ఒక్కడు’లో ఎయిర్‌పోర్ట్‌లో భూమికను వదిలి ఖాళీ బైక్‌ను కిక్‌ కొట్టాక మహేశ్‌బాబు ఆ అమ్మాయి ఇంకా తనతోనే ఉందనుకుంటూ ‘ఎక్కు’ అనంటాడు. అది చూసి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అతణ్ణి కావలించుకుంటుంది. ప్రేమ పుట్టింది. చప్పట్లు పడ్డాయి. మంచి ప్రేమ సన్నివేశం అది. ఇక రవితేజ ‘ఇడియట్‌’ ఒక మొండివాడి ప్రేమ గెలుపు.

గంగోత్రి... మనసంతా నువ్వే
అల్లు అర్జున్‌ హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ ప్రేమ వల్లే విజయం సాధించగలిగింది. పాలేరైనా ప్రేమికుడే అని చెప్పిన సినిమా ఇది. మరోవైపు ఎమ్మెస్‌ రాజు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ‘మనసంతా నువ్వే’ ఉదయ్‌ కిరణ్‌ జీవితంలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ‘తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే’... పాటకు జనం థియేటర్లకు పరిగెట్టారు. అలాగే సిద్ధార్థ, త్రిష నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జూబ్లీహిట్‌గా నిలిచింది. ప్రేమ జన్మజన్మలకు కొనసాగుతుందని రామ్‌చరణ్‌ ‘మగధీర’ నిరూపించింది.

ఏ మాయ చేసావె
కాలం మారింది. తరం కూడా మారింది. నాగచైతన్య వచ్చి ‘ఏ మాయ చేసావె’, ‘హండ్రెడ్‌ పర్సెంట్‌ లవ్‌’ వంటి హిట్స్‌ ఇచ్చాడు. తాజాగా ‘ప్రేమమ్‌’ను డెలివర్‌ చేశాడు. జీవితం కొనసాగుతూ ఉంటే ప్రేమ కూడా కొనసాగుతుంది అని చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. నాని తన ప్రేమ కోసం ‘ఈగ’గా పునర్జన్మ ఎత్తాడు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ప్రేక్షకులకు చూపించాడు. తనకు మతిమరుపు ఉన్నా ప్రేమను గెలుచుకుని ‘భలే భలే మగాడివోయ్‌’ అనిపించాడు. నాని నటించిన ప్రేమకథలు మజ్నూ, నేను లోకల్‌ కూడా సక్సెస్‌ మీటర్‌ను టచ్‌ చేశాయి. రాజ్‌తరుణ్‌ ‘ఉయ్యాల జంపాల’, విజయ్‌దేవరకొండ ‘పెళ్లిచూపులు’, రోషన్‌ ‘నిర్మలా కాన్వెంట్‌’ ఇవన్నీ ప్రేమ చుట్టూ అల్లుకున్న కథలే.  – సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement