
ఎగిరే ట్యాక్సీలో ఆఫీసుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటికి మొన్న చైనీస్ కంపెనీ ఎహాంగ్ తొలిసారి ఇద్దరిని తమ ఎయిర్ ట్యాక్సీలో విజయవంతంగా కొంతదూరం వెళ్లేలా చేయగా.. తాజాగా విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ తన ఎయిర్ ట్యాక్సీ ‘వాహన’ను పరీక్షించింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పెండెల్టన్ కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలో వాహన దాదాపు నిమిషం పాటు గాల్లోకి ఎగిరింది.
ఆ తరువాత సురక్షితంగా నేలకు దిగింది. ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు ఎయిర్‌బస్ సిద్ధం చేస్తున్న వాహన 50 మైళ్ల దూరం వరకూ ప్రయాణించగలదు. డ్రైవర్ లేదా పైలట్ అవసరం కూడా లేకపోవడం ఇంకో విశేషం. మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్ల సాయంతో గాల్లోకి ఎగిరే వాహనంలో ఇంధనం విద్యుత్తే.