సర్వేంద్రియాల్లో నయనం ప్రధానమే. కానీ నయనమే ప్రధానం కాదు. ఆ విషయం ‘విశ్వదృక్’ బృందంలో ఉన్న ఏ ఒక్కరిని చూసినా అర్థమవుతుంది. ఎందుకో ఏమో... భగవంతుడు వారి జీవిత చిత్రానికి నలుపురంగును పూశాడు. కానీ దానికి వాళ్లు చింతించలేదు. తమలోని ప్రతిభతో మరికొన్ని రంగులను అద్దుకున్నారు. తమ జీవితాలను అందమైన హరివిల్లులుగా మలచుకున్నారు. అందరితో ‘శభాష్’ అనిపించుకుంటున్నారు.
ఎన్ని వేల మైళ్ల పయనమైనా... ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఎంత గొప్ప లక్ష్యమైనా... చిన్న ఆలోచన నుంచే పుడుతుంది. విశ్వదృక్ ఫౌండేషన్ స్థాపనకు బీజం వేసింది... ఓ అతి సామాన్యమైన వ్యక్తి మదిలో మెదిలిన ఆలోచన.
అక్టోబర్ 2, 2005. గాంధీజయంతి సందర్భంగా పాటల పోటీ జరుగుతోంది. ఆ పోటీలో ఓ చూపులేని యువతి కూడా పాల్గొంది. తన కళ్లలో ఉన్న చీకటి తన మనసులో లేదని తన పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె పాటలోని శృతిశుద్ధతకి ఆడియెన్స్‌లో ఉన్న ఒక వ్యక్తి గుండె లయ తప్పింది. ఏ వైకల్యం లేని ఎంతోమంది సింగర్స్ కంటే అద్భుతంగా పాడిన ఆమెపై ఆయనకు ఎంతో గౌరవం కలిగింది. అందుకే ఆమెతో పరిచయం చేసుకున్నారు. స్నేహహస్తాన్ని అందించారు. ఆ వ్యక్తి సందిపగు రాము... ఆవిడ పేరు మాధవి. ఆ ఇద్దరి పరిచయమే... ‘విశ్వదృక్ ఫౌండేషన్’కి పునాదిరాయి వేసింది.
రాము పరిచయమయ్యాక తనకు చూపు లేదన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు మాధవి. ఆమె పాటల పోగ్రాములకు సంబంధించిన ఏర్పాట్లు రాముయే చూసుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన ఆమెకు తోడునీడగా సాగారు. అప్పుడే ఆయనలో ఓ ఆలోచన పుట్టింది. మాధవి లాంటి వారు చాలామంది ఉంటారు. వాళ్లలోనూ ఏదో ఒక ప్రతిభ ఉండే ఉంటుంది. కానీ వాళ్లకు తనలాంటి ఒక వ్యక్తి ఎవరైనా తోడుగా ఉండి ఉంటారా? ఉండకపోవచ్చు. మాధవికి తోడుగా ఉన్న తాను, అలాంటి వారందరికీ తోడుగా ఉండలేనా? ఈ ఆలోచన రాముని ఓ పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేయించింది.
ఐదుగురితో మొదలు...
ఆలోచించినంత తేలిక కాదు ఆచరించడం. ఎక్కడో ప్రకాశం జిల్లానుంచి జీవనోపాధికై హైదరాబాద్ వచ్చిన రాముకి, ఊరు కాని ఊరిలో అనుకున్నది సాధించడం ఎంత కష్టమో తెలియంది కాదు. అదే సమయంలో ఇంటి యజమానురాలు నస్రీన్ దారి చూపించారు రాముకి. ఆవిడ ఇచ్చిన లక్ష రూపాయలతోనే రాము అడుగులు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు తిరిగారు. టాలెంట్ ఉన్నవాళ్ల కోసం వెతికారు. మొదటి ప్రయత్నంలో ఓ అయిదుగురిని కనుగొన్నారు. ఆ అయిదుగురితోనే 2007, జూలైలో ‘విశ్వదృక్’ ఏర్పడింది. ఆ సంస్థ తలుపులు అంధుల కోసం నేటివరకూ తెరచుకునే ఉన్నాయి.
విశ్వదృక్ స్థాపించిన కొన్ని నెలలకు మాధవిని వివాహం చేసుకున్నారు రాము. ఇద్దరు పిల్లలతో సంతోషంగా కాపురం చేస్తూనే... ఇన్నేళ్లలో ఎంతోమంది చూపులేని పిల్లలను చేరదీశారు ఈ దంపతులు. వారి ప్రతిభకు సానబట్టారు. వారినో ట్రూపులా ఏర్పరచి, ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు (ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు) ఆ వచ్చే కొద్దిపాటి పారితోషికంతో అందరినీ చదివిస్తున్నారు.
ఏ లోటూ లేకుండా చూస్తున్నారు. అయితే వారికి తిండి పెట్టడం, ఆశ్రయమివ్వడం రాము లక్ష్యం కాదు. ఎవరి మీదా ఆధార పడకుండా, వారు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అందుకునేలా చేయాలన్నదే ఆయన తపన. దాన్ని చాలా వరకూ సాధించారు. అయితే ఇవన్నీ తన ఒక్కడివల్లా సాధ్యం కాలేదంటారాయన. ఈ ప్రయాణంలో, ప్రయత్నంలో తన వెంట నిలబడిన ఏ ఒక్కరినీ ఆయన మర్చిపోరు. యద్దనపూడి సులోచనరాణిగారు, ఐఏఎస్ అధికారి రమణాచారిగారితో పాటు తేజేశ్వరరావు, కనకరాజు, శోభ, శశి, లక్ష్మి, విజయ, సునీత... ఇలా ఎందరో మనసున్న మనుషుల తోడ్పాటు లేనిదే తన విశ్వదృక్ లేదంటారు. అయితే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ పిల్లలకు ఓ సొంత గూడు ఏర్పరిచేందుకు కాసింత స్థలాన్ని, ప్రదర్శనలకు తీసుకెళ్లడానికి ఓ వాహనాన్ని ఇస్తే చాలని అంటున్నారు.
ఆలోచన గొప్పదైనప్పుడు, ఆచరణకు మార్గాలు తెరచుకుంటాయి. లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు... దాని ఫలితాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. రాము ఆలోచన గొప్పది. ఆయన లక్ష్యం ఉన్నతమైనది. అందుకే ఆయన సాక్షిగా... కొన్ని నయనాలకు వెలుగు వచ్చింది. నిరాశ నిండిన కొందరి జీవితాలకు అర్థం ఏర్పడింది. విశ్వదృక్ పేరు... పదిమంది నోట పలుకుతోంది. ముందు ముందు దేశమంతటా మోగుతుంది!
- సమీర నేలపూడి
విశ్వదృక్పథం
Published Tue, Dec 3 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement