పుల్లన జిల్లున | Vitamin C immunity in Amla | Sakshi
Sakshi News home page

పుల్లన జిల్లున

Published Sat, Nov 24 2018 12:06 AM | Last Updated on Sat, Nov 24 2018 12:06 AM

Vitamin  C immunity in Amla - Sakshi

ఉసిరిని సంస్కృతంలో ‘ధాత్రి’ అని అంటారు. ధాత్రి అంటే సంపదకు నిలయం. నిజంగానే ఉసిరి ఆరోగ్య సిరికి నిలయం.  విటమిన్‌ ‘సి’ ఇందులో పుష్కలం. రోగనిరోధక శక్తికి ఇది సాధనం. ఈ సీజన్‌లో ఉసిరికి చింతకాయను, నిమ్మకాయను జతచేయండి.  తుమ్ముకు, దగ్గుకు జల్ల కొట్టి కారం కారంగా జిల్లుమనిపించండి.

ఉసిరి  ఊరగాయ
కావలసినవి: ఉసిరి కాయలు – అర కేజీ; మిరప కారం – పావు కప్పు; ఆవాలు – ఒక టేబుల్‌ స్పూను; మెంతులు – అర టీ స్పూను; సోంపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
పోపు కోసం: నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను.

తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఆ పైన రంధ్రాలున్న ప్లేట్‌ ఉంచి వాటి మీద ఉసిరికాయలను ఉంచి మూత పెట్టి, పది నిమిషాలు స్టౌ మీదే ఉంచి దింపేయాలి ∙ఉసిరికాయలలోని గింజలను వేరుచేయాలి ∙ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఆవాలు, మెంతులు, సోంపు వేసి దోరగా వేయించి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి ∙ఉసిరి ముక్కలను జత చేసి వేయించాలి ∙మిరప కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పొడి చేసుకున్న ఆవాల పొడి మిశ్రమం జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది.

టొమాటో, పండు మిర్చి పచ్చడి
కావలసినవి: టొమాటోలు – అర కేజీ; ఉప్పు – 1 + అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పండు మిర్చి – అర కేజీ; చింతపండు – 50 గ్రా.; తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, గాలికి ఆరబెట్టాలి  ∙ పూర్తిగా తడి పోయిన తరవాత పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి 
∙ఒక పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి రెండు రోజులు అలాగే వదిలేయాలి ∙పండుమిర్చి తొడిమలు తీసి, నీళ్లలో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, తడిపోయే వరకు గాలికి ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి, కొద్దిగా మెత్తపడేవరకు మిక్సీ పట్టాలి ∙ సీసాలో ఉన్న టొమాటో ముక్కలను బయటకు తీయాలి ∙రసాన్ని వేరు చేయాలి ∙వేరు చేసిన రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి 
∙ఒక పెద్ద పాత్రలో చింతపండు నానబెట్టిన టొమాటో రసం, ఎండ బెట్టిన టొమాటో ముక్కలు, పండు మిర్చి తొక్కు వేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె కాగిన తరవాత ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించి దింపి చల్లారనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ పచ్చడి సుమారు పదిహేను రోజులు నిల్వ ఉంటుంది.

చింతకాయ పచ్చడి
కావలసినవి: పండు చింతకాయలు – 10; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
పోపు కోసం: మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి – తగినన్ని; ఎండు మిర్చి – 1
తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి గాలి చొరని సీసాలో ఉంచి మూత పెట్టి మూడు రోజుల తరవాత బయటకు తీసి, గింజలను వేరు చేయాలి ∙చింతకాయ తొక్కును మరోమారు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙వేయించిన పోపు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙కమ్మటి నేతితో అన్నంలో తింటే రుచిగా ఉంటుంది

పచ్చి మిర్చి–  నిమ్మరసం పచ్చడి
కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – ఒక టీ స్పూను; ఆవాల పొడి – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – తగినంత; నిమ్మ రసం – అర కప్పు; ఇంగువ – కొద్దిగా

తయారీ: ∙ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాక, రెండేసి ముక్కలుగా కట్‌ చేయాలి ∙జాడీలో పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, ఆవాల పొడి, మెంతులు వేసి బాగా కలిపి మూత పెట్టి, రెండు రోజులు వదిలేయాలి ∙మూడో రోజు, స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ∙çపచ్చి మిర్చి ఉంచిన జాడీ మూత తీసి, కాచిన నూనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి ∙ఇది చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది.

చింతకాయ పులుసు
కావలసినవి: చింతకాయలు – 200 గ్రా.; వంకాయలు – 4 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటోలు – 2 (ముక్కలు చేయాలి); సొరకాయ ముక్కలు – 4; ములక్కాడ–1; క్యారెట్‌–1; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను.

పేస్ట్‌ కోసం: బియ్యం – ఒక టేబుల్‌ స్పూను (గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి); ఆవాలు – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్‌ స్పూను; (ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి).

పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. (స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఈ పదార్థాలన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు జత చేసి వేయించి దింపేయాలి).

తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చింతకాయలు వేసి స్టౌ మీద ఉంచి చింతకాయలు మెత్తపడే వరకు ఉడికించి, దించి చల్లార్చాలి ∙బాగా చల్లారాక చింతకాయలను గట్టిగా పిండి, చెత్తను తీసేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙ చింతకాయ రసం జత చేసి కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించాలి ∙ముద్ద చేసి ఉంచుకున్న బియ్యం మిశ్రమం, పోపు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙ పులుసు బాగా మరుగుతుండగా ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి

ఉసిరి తొక్కు పచ్చడి
కావలసినవి: ఉసిరి కాయలు – 20; నీళ్లు – తగినన్ని; నువ్వుల నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – 5 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక టీ స్పూను.

తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి, అందులో నీళ్లు పోసి కాగాక, ఉసిరి కాయలు వేసి పావు గంట సేపు ఉడికించి తీసేయాలి ∙గింజలను వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ముక్కలు బాగా చల్లారిన తరవాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి, మెత్తగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి వేయించాలి ∙ మిరప కారం వేసి బాగా వేయించాలి ∙చివరగా మెత్తగా చేసి ఉసిరి ముద్ద వేసి బాగా దగ్గర పడే వరకు వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙బెల్లం పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. 

పండు మిర్చి  నిమ్మకాయ నిల్వ పచ్చడి
కావలసినవి: పండు మిర్చి – అర కేజీ; నిమ్మకాయలు – డజను (చిన్న సైజువి); ఉప్పు – తగినంత; ఆవాలు–ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 10; నూనె – 100 గ్రా.; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పొడి–ఒక టేబుల్‌ స్పూను; మెంతి పొడి–పావు టేబుల్‌ స్పూను; మిరప కారం–రెండు టీ స్పూన్లు.

తయారీ: ∙ముందుగా పండు మిర్చిని నీళ్లలో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు ఆరబెట్టాలి  మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాక, బయటకు తీసి, ఒక పాత్రలో రెండు రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి  నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, ఆరబెట్టాలి ∙తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినంత ఉప్పు జత చేసి బాగా కలిపి, జాడీలో రెండు రోజుల పాటు ఉంచాలి ∙మూడో రోజు పండు మిర్చి మిశ్రమం, నిమ్మకాయ ముక్కలను బయటకు తీసి, ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙మెంతి పొడి, ఆవ పొడి, మిరప కారం జత చేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక పండుమిర్చి నిమ్మకాయ పచ్చడిలో వేసి కలపాలి ∙ ఈ పచ్చడి సుమారు పది రోజులు నిల్వ ఉంటుంది. (ఉప్పు సరిపడేలా చూసుకోవాలి). 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement