స్వీటాఫలం | Vitamins And Potassium Is Very High In Custard apple | Sakshi
Sakshi News home page

స్వీటాఫలం

Published Fri, Nov 15 2019 3:48 AM | Last Updated on Fri, Nov 15 2019 3:48 AM

Vitamins And Potassium Is Very High In Custard apple - Sakshi

ఇటీవల మార్కెట్లోకి సీతాఫలాలు విరివిగా వస్తున్నాయి. ఎంతో తియ్యగా ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో. అసలే చలి సీజన్‌లో ఈ పండు తింటే మరింత ఎక్కువగా జలుబు చేస్తుందని కొందరు ఈ పండును తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ వేసవిలో దొరికే మామిడి వేడిచేస్తుందన్నా, శీతకాలంలో దొరికే సీతాఫలాలు జలుబు చేస్తాయన్నా... ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తినాల్సిందే. సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ‘జలుబూ–గిలుబూ జాన్‌తానై’ అంటూ ఆ అపోహలన్నీ పక్కనబెట్టి తప్పక తినేస్తారు. సీతాఫలంతో మనకు సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.

►సీతాఫలంలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్‌–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కారణంగా అది ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
►సీతాఫలంలో పొటాషియమ్‌ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... రక్తపోటును అదుపులో ఉంటుంది.
►రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి. అవి రక్తహీనత (అనిమియా)ను సమర్థంగా అరికడతాయి.
►సీతాఫలాల్లోని విటమిన్‌–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. ఇలా జుట్టు బాగా పెరగడానికి సీతాఫలంలోని ఐరన్‌ ఉపకరిస్తుంది.
►సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్‌ కలిసి మలబద్దకం వంటి సమస్యను నివారిస్తాయి. ఈ పండులోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.
►ఇందులో ఉండే మెగ్నీషియమ్‌ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
►సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్‌)నూ, ఆర్థరైటిస్‌ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది.
►ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది.
►సీతాఫలం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement