
గాలిలోని తేమను నీరుగా మార్చే యంత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. భూతాపోన్నతి నేపథ్యంలో భవిష్యత్తులో గుక్కెడు నీరు కూడా దక్కదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రైజ్ సంస్థ కొన్నేళ్ల క్రితం ఓ పోటీ పెట్టింది. గాలిలో ఉండే తేమను నీటిగా మార్చడం మాత్రమే కాకుండా, రోజుకు కనీసం రెండు వేల లీటర్ల నీళ్లు ఉత్పత్తి చేయాలన్నది పోటీలోని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా.. పెట్రోలు, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధన వనరులను వాడకుండా ఈ పని సాధించాలి. లీటర్ నీటికి రెండు రూపాయల కంటే ఎక్కువ ఖర్చవకూడదు కూడా. ఈ నేపథ్యంలో ‘సమృద్ధిగా నీరు’ పేరుతో మొదలైన ఈ పోటీలో మొత్తం 25 దేశాల నుంచి 98 బృందాలు పాల్గొన్నాయి.
ఏడాది క్రితం కొంతమంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా.. గత నెలలో మొత్తం ఐదుగురు ఫైనలిస్టుల్లో ఇద్దరిని నమూనా యంత్రం తయారుచేసి చూపాల్సిందిగా ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ కోరింది. చివరకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైవాటర్ అలయన్స్ ఈ పోటీలో మొదటి బహుమతి సాధించింది. రెండో స్థానంలో హవాయికి చెందిన జేఎంసీసీ వింగ్ నిలిచింది. మొదటి బహుమతిగా పది కోట్ల రూపాయలు లభించగా, రెండో బహుమతి కింద కోటి రూపాయలు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment