సాక్షి, కోల్‌కతా : ప్లాస్టిక్ గుడ్లపై కలకలం రేగిన క్రమంలో తాజాగా మైనం పూతతో వస్తున్న యాపిల్స్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. గతంలో ప్లాస్టిక్ కోడిగుడ్లపై నెలకొన్న ఆందోళనతో కలత చెందిన వినియోగదారులు ప్రస్తుతం యాపిల్స్‌పై మైనం పూతపై సాగుతున్న ప్రచారంతో బెంబేలెత్తుతున్నారు. యాపిల్స్ తాజాగా, నిగనిగలాడేలా కనిపించేందుకు కొందరు వ్యాపారులు షూలు, కార్లను పాలిష్ చేసేందుకు ఉపయోగించే పెట్రోపాన్ పారాఫిన్, మైనంను పండ్ల పైపూతగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కోల్‌కతాలోని డం డం రోడ్‌లో ఇలాంటి యాపిల్స్‌ను కొందరు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు సింతిమోర్ ప్రాంతంలోని ఇద్దరు దుకాణదారులను అరెస్ట్ చేశారు. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ పండ్ల మార్కెట్ నుంచి ఈ యాపిల్స్ నగరమంతటా సరఫరా అవుతున్నాయని విచారణలో దుకాణదారులు తెలిపారు.
కాగా, కోల్‌కతా అంతటా మైనం పూసిన యాపిల్స్ విక్రయిస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని స్ధానిక కౌన్సిలర్ గౌతం ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను కోల్‌కతా మేయర్ దృష్టికి తీసుకువెళతానని ఘోష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment