వాన రాక... ఈ గొడుగుకు ఎరుక!
వానాకాలంలో గొడుగు లేకుండా బయటకు వెళితే ఎన్ని ఇబ్బందులు పడాలో మనకు తెలియంది కాదు. గొడుగు మోసుకెళ్లడం.. వాన రాకపోతే చిరాకుపడటమూ మనకలవాటే. ఇంకొందరేమో మోసుకెళతారు... అక్కడ, ఇక్కడ పెట్టేసి మరచిపోతూంటారు. ఇలాంటి అన్ని సమస్యలకు సమాధానం ఫొటోలో కనిపిస్తున్న ‘ఊంబ్రెల్లా’. దీనికి వానెప్పుడు వస్తుందో తెలుసు.
తనను తీసుకెళ్లడం మరిచిపోవద్దని యజమాని స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టగలదు. ఎక్కడ మరిచిపోయినా... వెంటనే ఫోన్ ద్వారా హెచ్చరిస్తుంది కూడా. ఈ హైటెక్ హంగులన్నింటి కోసం ఊంబ్రెల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దీని పిడిలో ఏర్పాటు చేసిన సెన్సర్లు పరిసరాల ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం, పీడనం, కాంతి వంటి అన్ని వాతావరణ సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి... వర్షం పడేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగా యజమానికి సూచనలిస్తుంది. ఇంకోలా చెప్పాలంటే మీ వద్ద ఓ మినీ వాతావరణ కేంద్రం ఉంటుందన్నమాట.
అంతేకాదు.. వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటే మీతోపాటు పరిసరాల్లో ఊంబ్రెల్లా వాడే వారందరికీ ‘వీజూ’ అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా హెచ్చరికలు పంపుతుంది. ఊంబ్రెల్లా రెండు మోడళ్లలో లభిస్తుంది. దాదాపు 3.1 అడుగుల పొడవైంది ఒకటైతే... మడిచేసి పెట్టుకోగల 0.8 అడుగుల సైజుండేది రెండోది. మీరు ఇప్పటికే వాడుతున్న గొడుగును ఊంబ్రెల్లాగా మార్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఊంబ్రెల్లా మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది.