కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం! | We will treat cancer with cereals | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం!

Published Thu, Jan 25 2018 12:04 AM | Last Updated on Thu, Jan 25 2018 12:04 AM

We will treat cancer with cereals - Sakshi

1970–80 దశకానికి ముందు కాలంలో కేన్సర్‌ రోగులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చూసినా కేన్సర్‌ రోగులు కనిపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం ప్రకారం.. 2030 నాటికి కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది వరకు కేన్సర్‌ బారిన పడే పరిస్థితి నెలకొంది.  దీనికి ప్రధాన కారణం.. ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది.

పురుగు మందులు
జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది. గతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎమల్షన్‌ రూపంలో నీటిలో కరగని రీతిలో ఉండేవి. తదనంతరం, నీటిలో కలిసిపోయే రకం పురుగుమందులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలో జన్యుమార్పిడి సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో జరిపిన ప్రయోగ ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలకు ఈ ఆలోచన వచ్చింది.  

కలుపు మందులు
సోయాబీన్స్‌ పొలంలో మొలిచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు కలుపు నివారణ మందులను తయారు చేశారు. అయితే, ఈ కలుపు మందులు వాడినప్పుడు ప్రధాన పంట కూడా దెబ్బతిన్నది! ఈ కలుపుమందుకు 2–4–డి. దీనికి ‘ఏజెంట్‌ ఆరెంజ్‌’ అనే మరో పేరు కూడా ఉంది. మొక్కలు చూస్తుండగానే మాడిపోయేలా చేయడానికి దీన్ని వియత్నాం యుద్ధంలో వాడారు. సోయాబీన్‌ పంటను కలుపు మందు నుంచి కాపాడుకోవడానికి.. కలుపు మందును తట్టుకొని నిలిచేలా సోయాబీన్స్‌కు జన్యుమార్పిడి చేశారు! ఆ విధంగా రసాయనం సోయాబీన్‌ పంటలోకి చేరింది. ఈ రసాయనం క్రమంగా ఫెనోలిక్‌ కాంపౌండ్‌గా రూపుదాల్చి, కొంత మేరకు నీటిలో కరిగే స్వభావాన్ని సంతరించుకుంది. దీన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత నీటిలో కరిగే స్వభావం కలిగిన ‘గ్లైఫొసేట్‌’ వంటి కలుపు మందులను కనుగొన్నారు.

సరిగ్గా ఈ దశలోనే ‘కేన్సర్‌’ పుట్టిందని ఆహార శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలీ అంటున్నారు! ఈ క్రమంలోనే నీటిలో కరిగే కలుపు మందుల ఉత్పత్తి, వాడకం పాశ్చాత్య దేశాల్లో పెద్దఎత్తున ప్రారంభమైంది. పర్యావరణ వ్యవస్థలోకి రసాయనాలు చేరిపోవటం అలా మొదలైంది. దక్షిణ ధృవంలో నివసించే పెంగ్విన్ల దేహాల్లోకి కూడా ఈ విషాలు చేరిపోయాయంటే వ్యవసాయ రసాయనాలు యావత్‌ భూగోళాన్నే ఎంతగా విషతుల్యంగా మార్చాయో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఈ రసాయనాలను చాలా విస్తారంగా వినియోగిస్తుండడంతో మన పర్యావరణ వ్యవస్థలోకి కూడా విషతుల్య పదార్థాలు పెద్దఎత్తున చేరిపోయాయి. 

జన్యుమార్పిడి పంటలు 
కేన్సర్‌ వ్యాధి విపరీతంగా విస్తరించడానికి జన్యుమార్పిడి మొక్కజొన్న సాగు కూడా మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్‌ను తయారు చేసిన రసాయనిక / ఔషధ కంపెనీలే జన్యుమార్పిడి మొక్కజొన్నను కూడా రూపొందించాయి. ఈ మొక్కజొన్నలో కొవ్వు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1 మిల్లీ గ్రాము కొవ్వు ఉంటుంది). ఈ జన్యుమార్పిడి మొక్కజొన్నను పశువులకు, కోళ్లకు మేపుతున్నారు. పాల ఉత్పత్తులు, మాంసం, పంది మాంసం, కోడి మాంసం, కోడిగుడ్లు తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విషతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరిపోతున్నాయి.  కూరగాయలు కూడా విషరసాయనాల బారిన పడ్డాయి. బేకింగ్‌ పరిశ్రమ బిస్కెట్లు, కేకులు వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నాయి. 

కల్తీ వంట నూనెలు
కేన్సర్‌ వ్యాధి విజృంభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి–8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలకాలతో మినరల్‌ ఆయిల్‌ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కృత్రిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె మాదిరిగానే ఉండే కృత్రిమ వంట నూనె తయారవుతున్నది. ప్రకృతి సిద్ధమైన వంట నూనెలో ఈ కృత్రిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఆ విధంగా విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకే ఆహారోత్పత్తి పద్ధతులను, ఆహార శుద్ది ప్రక్రియలను రసాయన రహితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పంటల సాగులోను, వ్యవసాయోత్పత్తుల శుద్ధి కర్మాగారాల్లోనూ విష రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది! విష రసాయనాల వాడకాన్ని నిషేధించక పోతే.. వివిధ రూపాల్లో విజృంభిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని నియంత్రించటం, నిరోధించడం అనే పెను సవాలును విజయవంతంగా ఎదుర్కోవడం కనాకష్టమే.

తినకూడనివి
‘‘కేన్సర్‌ను విజయవంతంగా జయించిన వారు గానీ లేదా కేన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు గానీ లేదా కేన్సర్‌ జబ్బు బారిన పడకూడదనుకున్న వారు గానీ.. వరి బియ్యం, గోధుమలు, పంచదార, మాంసాహారం తినకూడదు. పాలు తాగకూడదు’’ అని డాక్టర్‌ ఖాదర్‌వలీ అంటున్నారు. ‘‘ఇవి మన దేహంలో రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు మన దేహంలోని అణువణువులో క్రమంగా పోగుపడి (బయో కాన్సంట్రేషన్‌) జబ్బును కలిగిస్తాయి. అందువల్లనే కేన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కోవాలనుకుంటే వీటిని మన ఆహారం లోనుంచి తొలగించాల్సిందే’’నని ఆయన చెబుతున్నారు.  
‘‘ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యంతో నా వంక చూస్తుంటారు. అటువంటప్పుడు నేను ఏ సందిగ్ధమూ లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే.. ముమ్మాటికీ సాధ్యమే! ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే. తు.చ. తప్పకుండా అనుసరిస్తున్న రోగులెందరో నాకు తెలుసు.  మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, మన వృత్తి, క్రమంతప్పని శారీరక వ్యాయామం, నడక, యోగా, మంచి అలవాట్లు, ధ్యానం, మన ఆసక్తులు.. ఇవన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరచిపోయాం. వేళా పాళా లేకుండా తినటం, అనారోగ్యకరమైన పోషకాల్లేని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం. 

పాల దిగుబడి పెంచేందుకు పాడి పశువులకు ఆక్సీటోసిన్‌/ఈస్ట్రోజన్‌ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నాం.  గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలొక్సాన్‌ అనే బ్లీచింగ్‌ రసాయనాన్ని వాడుతున్నారు. ఆ మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో క్లోమ గ్రంధికి బీటా సెల్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్‌ను నిల్వ చేసి, అవసరం మేరకు విడుదల చేయటంలో ఈ బీటా సెల్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. మైదా తినటం వల్ల మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement