Khadeer
-
కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం!
1970–80 దశకానికి ముందు కాలంలో కేన్సర్ రోగులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చూసినా కేన్సర్ రోగులు కనిపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్సైట్లో ఉంచిన సమాచారం ప్రకారం.. 2030 నాటికి కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది వరకు కేన్సర్ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం.. ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది. పురుగు మందులు జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది. గతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎమల్షన్ రూపంలో నీటిలో కరగని రీతిలో ఉండేవి. తదనంతరం, నీటిలో కలిసిపోయే రకం పురుగుమందులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలో జన్యుమార్పిడి సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో జరిపిన ప్రయోగ ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలకు ఈ ఆలోచన వచ్చింది. కలుపు మందులు సోయాబీన్స్ పొలంలో మొలిచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు కలుపు నివారణ మందులను తయారు చేశారు. అయితే, ఈ కలుపు మందులు వాడినప్పుడు ప్రధాన పంట కూడా దెబ్బతిన్నది! ఈ కలుపుమందుకు 2–4–డి. దీనికి ‘ఏజెంట్ ఆరెంజ్’ అనే మరో పేరు కూడా ఉంది. మొక్కలు చూస్తుండగానే మాడిపోయేలా చేయడానికి దీన్ని వియత్నాం యుద్ధంలో వాడారు. సోయాబీన్ పంటను కలుపు మందు నుంచి కాపాడుకోవడానికి.. కలుపు మందును తట్టుకొని నిలిచేలా సోయాబీన్స్‌కు జన్యుమార్పిడి చేశారు! ఆ విధంగా రసాయనం సోయాబీన్ పంటలోకి చేరింది. ఈ రసాయనం క్రమంగా ఫెనోలిక్ కాంపౌండ్‌గా రూపుదాల్చి, కొంత మేరకు నీటిలో కరిగే స్వభావాన్ని సంతరించుకుంది. దీన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత నీటిలో కరిగే స్వభావం కలిగిన ‘గ్లైఫొసేట్’ వంటి కలుపు మందులను కనుగొన్నారు. సరిగ్గా ఈ దశలోనే ‘కేన్సర్’ పుట్టిందని ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అంటున్నారు! ఈ క్రమంలోనే నీటిలో కరిగే కలుపు మందుల ఉత్పత్తి, వాడకం పాశ్చాత్య దేశాల్లో పెద్దఎత్తున ప్రారంభమైంది. పర్యావరణ వ్యవస్థలోకి రసాయనాలు చేరిపోవటం అలా మొదలైంది. దక్షిణ ధృవంలో నివసించే పెంగ్విన్ల దేహాల్లోకి కూడా ఈ విషాలు చేరిపోయాయంటే వ్యవసాయ రసాయనాలు యావత్ భూగోళాన్నే ఎంతగా విషతుల్యంగా మార్చాయో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఈ రసాయనాలను చాలా విస్తారంగా వినియోగిస్తుండడంతో మన పర్యావరణ వ్యవస్థలోకి కూడా విషతుల్య పదార్థాలు పెద్దఎత్తున చేరిపోయాయి. జన్యుమార్పిడి పంటలు కేన్సర్ వ్యాధి విపరీతంగా విస్తరించడానికి జన్యుమార్పిడి మొక్కజొన్న సాగు కూడా మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్‌ను తయారు చేసిన రసాయనిక / ఔషధ కంపెనీలే జన్యుమార్పిడి మొక్కజొన్నను కూడా రూపొందించాయి. ఈ మొక్కజొన్నలో కొవ్వు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1 మిల్లీ గ్రాము కొవ్వు ఉంటుంది). ఈ జన్యుమార్పిడి మొక్కజొన్నను పశువులకు, కోళ్లకు మేపుతున్నారు. పాల ఉత్పత్తులు, మాంసం, పంది మాంసం, కోడి మాంసం, కోడిగుడ్లు తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విషతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరిపోతున్నాయి. కూరగాయలు కూడా విషరసాయనాల బారిన పడ్డాయి. బేకింగ్ పరిశ్రమ బిస్కెట్లు, కేకులు వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నాయి. కల్తీ వంట నూనెలు కేన్సర్ వ్యాధి విజృంభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి–8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలకాలతో మినరల్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కృత్రిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె మాదిరిగానే ఉండే కృత్రిమ వంట నూనె తయారవుతున్నది. ప్రకృతి సిద్ధమైన వంట నూనెలో ఈ కృత్రిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఆ విధంగా విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకే ఆహారోత్పత్తి పద్ధతులను, ఆహార శుద్ది ప్రక్రియలను రసాయన రహితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పంటల సాగులోను, వ్యవసాయోత్పత్తుల శుద్ధి కర్మాగారాల్లోనూ విష రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది! విష రసాయనాల వాడకాన్ని నిషేధించక పోతే.. వివిధ రూపాల్లో విజృంభిస్తున్న కేన్సర్ మహమ్మారిని నియంత్రించటం, నిరోధించడం అనే పెను సవాలును విజయవంతంగా ఎదుర్కోవడం కనాకష్టమే. తినకూడనివి ‘‘కేన్సర్‌ను విజయవంతంగా జయించిన వారు గానీ లేదా కేన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు గానీ లేదా కేన్సర్ జబ్బు బారిన పడకూడదనుకున్న వారు గానీ.. వరి బియ్యం, గోధుమలు, పంచదార, మాంసాహారం తినకూడదు. పాలు తాగకూడదు’’ అని డాక్టర్ ఖాదర్‌వలీ అంటున్నారు. ‘‘ఇవి మన దేహంలో రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు మన దేహంలోని అణువణువులో క్రమంగా పోగుపడి (బయో కాన్సంట్రేషన్) జబ్బును కలిగిస్తాయి. అందువల్లనే కేన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కోవాలనుకుంటే వీటిని మన ఆహారం లోనుంచి తొలగించాల్సిందే’’నని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యంతో నా వంక చూస్తుంటారు. అటువంటప్పుడు నేను ఏ సందిగ్ధమూ లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే.. ముమ్మాటికీ సాధ్యమే! ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే. తు.చ. తప్పకుండా అనుసరిస్తున్న రోగులెందరో నాకు తెలుసు. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, మన వృత్తి, క్రమంతప్పని శారీరక వ్యాయామం, నడక, యోగా, మంచి అలవాట్లు, ధ్యానం, మన ఆసక్తులు.. ఇవన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరచిపోయాం. వేళా పాళా లేకుండా తినటం, అనారోగ్యకరమైన పోషకాల్లేని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం. పాల దిగుబడి పెంచేందుకు పాడి పశువులకు ఆక్సీటోసిన్/ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నాం. గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలొక్సాన్ అనే బ్లీచింగ్ రసాయనాన్ని వాడుతున్నారు. ఆ మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో క్లోమ గ్రంధికి బీటా సెల్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్‌ను నిల్వ చేసి, అవసరం మేరకు విడుదల చేయటంలో ఈ బీటా సెల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. మైదా తినటం వల్ల మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం. -
క్యాన్సర్‌పై చిరు పిడికిలి
సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకుంటూ... కషాయాలు తగితే కేన్సర్‌ను జయించవచ్చు ఆహారం, జీవనశైలిలో పాశ్చాత్య అంధానుకరణ మారితే 6 నెలల నుంచి రెండేళ్లలో పూర్తి ఆరోగ్యవంతులు కావచ్చు మైసూరుకు చెందిన స్వతంత్ర ఆహార, అటవీ కృషి శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనుభవాల సారమిది... ‘మన ఆహారమే మన ఔషధం కావాలి’ ఈ మాట హిప్పొక్రేట్స్ అనే మహానుభావుడు క్రీస్తు పూర్వమే చెప్పారు. సాంకేతికంగా సమాజం ఎంత ‘అభివృద్ధి’ సాధించినా ఇప్పటికీ ఈ భావనే మానవాళి అంతటికీ తలమానికం కావాల్సి ఉంది. ఆహారంలో పెచ్చుమీరిన రసాయనాల అవశేషాలు, పర్యావరణ కాలుష్యం, పాశ్చాత్య జీవనశైలి అంధానుకరణ... తదితర కారణాల నేపథ్యంలో ఇటీవల సంవత్సరాల్లో కేన్సర్, మధుమేహం ఆందోళనకరంగా వ్యాపిస్తున్నాయి. అత్యాధునిక అల్లోపతి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుటికీ.. రోగుల దైనందిన జీవితాలు వ్యధాభరితంగా మారుతున్నాయి. కేన్సర్ బారిన పడే వారి సంఖ్యతోపాటు దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇంకేదైనా మెరుగైన దారి ఉందా??నిస్సందేహంగా కేన్సర్‌ను జయించే మార్గం ఉందంటున్నారు స్వతంత్ర ఆహార, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి! సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవటం, కొన్ని రకాల కషాయాలను తాగటం, జీవనశైలిలో కచ్చితమైన మార్పులు చేసుకోవటం ద్వారా కేన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ ఖాదర్ చెబుతున్నారు. సిరిధాన్యాలు, కషాయాలు, హోమియో/ ఆయుర్వేద మందుల ద్వారా రోగులు సాంత్వన పొందవచ్చని అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. తన వద్ద చికిత్స పొందిన, పొందుతున్న కేన్సర్ రోగుల జీవితాల్లో చీకట్లు తొలగి కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు. డా.ఖాదర్‌వలి‡ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...నాలుగు నెలల క్రితం ఒక యువకుడు తన తల్లితో కలిసి నా దగ్గరకు వచ్చాడు. అతను బయోటెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదువుకున్నాడు. అతని తల్లి గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చారు. ఆ చికిత్స తర్వాత ఆమె బక్కచిక్కి, బలహీనపడ్డారు. వైద్యులు ఇక చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా కుమారుడిని వెంటబెట్టుకొని ఆమె నా దగ్గరకు వచ్చారు. నేను వెంటనే ఆమె అనారోగ్యం పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నాను. ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత.. పర్వాలేదు, మీరు క్రమంగా కోలుకుంటారని నేను ఆశాభావంతో చెప్పాను. ఇంతకుముందు వైద్యులు ఇచ్చిన మందులను కొనసాగిస్తూనే.. అరికె బియ్యం, సామ బియ్యం వంటి సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని.. రావి ఆకులు, జామ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని 3–4 నెలల పాటు తాగాలని సూచించాను. నేను చెప్పిన మాటలపై ఆమె కుమారుడికీ నమ్మకం కుదిరినట్లు అనిపించింది. తల్లి, కొడుకు ఇద్దరూ ఆశాభావంతోనే ఇంటికి తిరిగి వెళ్లారు. అటువంటి రోగులు చాలా మంది నన్ను కలుసుకుంటూ ఉండటం మామూలే కాబట్టి ఆ తల్లి, కుమారుడి గురించి నేను అప్పట్లోనే మర్చిపోయాను. అయితే, రెండు రోజుల క్రితం వాళ్లిద్దరూ మళ్లీ నన్ను కలవడానికి వచ్చారు. నన్ను చూసీ చూడగానే కుమారుడు నాకు పాదాభివందనం చేశాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అనిపించింది. నేను ఆహారంలో చెప్పిన మార్పులను ఆమె తు.చ. తప్పకుండా పాటించారు. నిజానికి వాళ్లు తమకు అంతకుముందు వైద్యం చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్లి నేను సూచించిన వైద్యాన్ని గురించి తెలియజేశారు. ఆయన వాళ్ల వైపు చూసి పిచ్చా.. వెర్రా.. అన్నట్లు హేళనగా నవ్వారట. కేన్సర్ వంటి తీవ్ర వ్యాధులతో బాధపడే రోగులు నా దగ్గరకు చాలా మందే వస్తూ ఉంటారు లేదా ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తూ ఉంటారు. కానీ, నేనెప్పుడూ వారి కథలను రాసిపెట్టలేదు. ఇటువంటి వాళ్లందరికీ నేను సిరిధాన్యాలు + కషాయాలతో సులభమైన చికిత్సనే చేస్తున్నాను. ఈ చికిత్స చాలా మామూలు సంగతిగా అనిపిస్తున్నప్పటికీ ప్రభావశీలంగా పనిచేస్తున్నది. అందువల్ల, సిరిధాన్యాలు + కషాయాలతో కూడిన చికిత్స పద్ధతి ఆవశ్యకతను గురించి వివరంగా చెప్పుకోవటం అవసరం అనిపిస్తోంది. కషాయాలను వాడటం అనేది మన ఇళ్లలో పూర్వం నుంచీ ఉన్నదే. ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా బామ్మలు ఆయా లక్షణాలను బట్టి తగిన కషాయాలను సూచిస్తూ ఉంటారు. బామ్మలు సూచించే అటువంటి ఔషధాల గురించి నేను చాలా లోతుగా శాస్త్రీయ అధ్యయనాలు చేసి, నిర్థారణకు వచ్చిన తర్వాత రోగులకు సూచిస్తున్నాను. ఔషధ గుణాలున్న సిరిధాన్యాలు ఐదు రకాలు. కొర్ర (Foxtail Millet) బియ్యం, ఊద(Barnyard Millet) బియ్యం, అరిక(kodo Millet) బియ్యం, సామ(Littile Millet) బియ్యం, అండు కొర్ర(Browntop Millet) బియ్యం. వ్యాధిని బట్టి, కేన్సర్ రకాన్ని బట్టి ఈ ఐదింటిలో ఎంపిక చేసిన రెండు రకాల చిరుధాన్యాలను తినాలి. వీటితో పాటు ఈ ఐదింటిలో ఇతర సిరిధాన్యాల బియ్యాన్ని కూడా తినవచ్చు. కేన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి నువ్వు లడ్డు తినాలి. లడ్డు తినటం వీలుకాకపోతే.. దోరగా ఇనుప పాత్రలో వేయించిన నువ్వులు అర చెంచాడు లేదా చెంచాడు, వారానికోసారి, తినాలి. కషాయం.. ఓ ఆరోగ్య పానీయం! కషాయాలను మొక్కల ఆకులు, రెమ్మలు, వేళ్లతో తయారు చేసుకుంటుంటాం. నాలుగైదు ఆకులను లేదా అవసరమైనన్ని రెమ్మలు లేదా వేరు ముక్కలను తీసుకోవాలి. వాటిని 150–200 ఎం.ఎల్. నీటిలో వేసి 3–4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపునే తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని నీటితో మాత్రమే కషాయం కాయడానికి వాడాలి! కేన్సర్ రోగులకు రోజూ రెండు రకాల కషాయాలు.. సాధారణంగా ఏ రకమైన కేన్సర్‌తో బాధపడే వారైనా సరే.. ప్రతి రోజూ రెండు రకాల కషాయాలు తాగాలి. ఉదయం, రాత్రి ఆహారానికి ముందు ఒక కషాయం తాగాలి. మధ్యాహ్న భోజనానికి ముందు మరో రకం కషాయం తాగాలి. ఈ కషాయాలను 3–4 నెలల పాటు క్రమం తప్పకుండా, విధిగా తాగాలి. ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు. అయితే, ఇదే వరుస పాటించాలన్న నియమం అవసరం లేదు. ఉదయం, రాత్రి తాగే కషాయాలు 3 రకాలు. మధ్యాహ్నం తాగే కషాయాలు 2 రకాలు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకోవడానికి ముందు, వారానికో రకం కషాయం చొప్పున 3 రకాల కషాయాలను తాగాలి. ఒక వారం పారిజాతం ఆకుల కషాయం, రెండో వారం రావి ఆకుల కషాయం, మూడో వారం జామ ఆకుల కషాయాలను ఒకదాని తర్వాత మరొకటి తాగాలి. ఈ 3 రకాల కషాయాలతోపాటు.. కేన్సర్ రకాన్ని బట్టి ఈ కింద పేర్కొన్న విధంగా.. రోజూ మధ్యాహ్నం ఆహారం తీసుకోవడానికి ముందు, మరో రెండు రకాల కషాయాలను, వారానికి ఒకటి చొప్పున తాగాలి. సిరిధాన్యాలను తినటం ద్వారా ఆధునిక కాలపు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సిరిధాన్యాల్లో పుష్కలంగా ఉన్న పీచుపదార్థమే మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. దీనికితోడు ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. పొగతాగడం, మద్యం తాగడం తక్షణం ఆపేయాలి. ఏయే కేన్సర్‌కు ఏయే చికిత్స? శ్వాసకోశ కేన్సర్: సిరిధాన్యాలు: కొర్ర బియ్యంతో ఒక రోజు, సామ బియ్యంతో మరో రోజు అన్నం వండుకొని తినాలి. ఆ రోజు 3 పూటలూ అదే రకం బియ్యం వండుకొని తినాలి. కషాయాలు: పారిజాతం , రావి , జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం అల్లం కషాయం, మరో వారం పసుపు కషాయం తాగాలి. ఎముకల కేన్సర్: సిరిధాన్యాలు: ఎముకల కేన్సర్ రోగులు అండు కొర్ర బియ్యం ఒక రోజు, సామ బియ్యం మరొక రోజు, అరిక బియ్యం ఇంకో రోజు తినాలి. వీటిని అన్నంగా వండుకొని తినొచ్చు. లేదా గంజి చేసుకొని కూడా తాగొచ్చు. కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను (వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో ఒక వారం, పుదీన ఆకులతో ఒక వారం కషాయం చేసుకొని తాగాలి. మెదడు కేన్సర్: సిరిధాన్యాలు: అరిక బియ్యం ఒక రోజు, సామబియ్యం మరో రోజు, అండు కొర్ర బియ్యం ఇంకో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు.. సదాప/ సదాపాకు (కన్నడలో నాగదాలి) ఆకులతో ఒక వారం, మరో వారం దాల్చిన చక్క కషాయం తాగాలి. రక్త కేన్సర్: సిరిధాన్యాలు: అరికబియ్యం ఒక రోజు, కొర్ర బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కరివేపాకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం మరో వారం తాగాలి. మూత్రాశయం/ప్రొస్టేట్ కేన్సర్: సిరిధాన్యాలు: ఊదబియ్యం ఒక రోజు, అరి బియ్యం మరో రోజు, అండు కొర్ర బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కొత్తిమీర కషాయం ఒక వారం, అటిక మామిడి ఆకుల కషాయం మరో వారం తాగాలి. రొమ్ము కేన్సర్: సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, అరిక బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కానుగ ఆకుల కషాయం ఒక వారం, వేప ఆకుల కషాయం మరో వారం వాడాలి. నోటి కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: కొర్ర బియ్యం, సామబియ్యం వండుకొని తినాలి. కషాయాలు: పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం పుదీన ఆకుల కషాయం, మరో వారం అల్లం కషాయం తాగాలి. నోటి కేన్సర్ రావడానికి ముఖ్య కారణం సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లేదా ఏదో ఒక రూపంలో పొగాకు నమలడం. పొగాకును ఏ రూపంలోనూ వాడకూడదు. అంతేకాదు, మద్యం తాగకూడదు. థైరాయిడ్/పాంక్రియాస్ కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: అరికబియ్యం ఒకరోజు, సామ బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం, రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు బంతిపూలకషాయం ఒక వారం, చింత చిగురు కషాయం మరో వారం తాగాలి. చింత చిగురు ఏడాది పొడవునా దొరకదు. అటువంటప్పుడు మునగ చెట్టు పూలతో చేసిన కషాయం తాగాలి. పొట్ట కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్రబియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం, రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో చేసిన కషాయం ఒక వారం, అరటి బోదె ముక్కలతో చేసిన కషాయం మరో వారం వాడాలి. చర్మ కేన్సర్‌కు చికిత్స: అతి ప్రమాదకరమైన కేన్సర్లలో చర్మ కేన్సర్ ఒకటి. సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్ర బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఉల్లికాడలకషాయం ఒక వారం, కలబందకషాయం మరో వారం తాగాలి. ఎవరీ డా.ఖాదర్‌వలి? కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన డాక్టర్ ఖాదర్ వలి (60) సిరిధాన్యాల పునరుద్ధరణకు 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. మైసూరులో ఎమ్మెస్సీ (ఎడ్యుకేషన్) చదివిన తర్వాత బెంగళూరులో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ చేశారు. సహ విద్యార్థిని ఉషను ప్రేమించి పెళ్లాడారు. అమెరికా వెళ్లి బీవెర్టాన్ ఓరెగాన్‌లో పర్యావరణ శాస్త్రంపై పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఉన్నారు. ఏజెంట్ ఆరెంజ్, డయాక్సిన్లు వంటి అత్యంత విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయటంపై పరిశోధన చేశారు. ఆహారం వాణిజ్యకరించబడుతున్న నేపథ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటమే జీవితానికి అర్థవంతంగా ఉంటుందని భావించి 1997లో భారత్‌కు తిరిగి వచ్చి మైసూరులో స్థిరపడ్డారు. అంతరించిపోతున్న 5 రకాల చిరుధాన్యాల పునరుద్ధరణకు కృషి చేశారు. వీటిని వాడే క్రమంలో ప్రతి ఒక్క చిరుధాన్యానికి ఉన్న ఔషధ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు సైతం తగ్గుతున్నాయని కనుగొన్నారు. అందుకే వీటికి సిరిధాన్యాలని పేరు పెట్టారు. వీటిని సహజ పద్ధతుల్లో సాగు చేయడానికి ‘కాడు కృషి’ అనే విధానాన్ని ఆవిష్కరించారు. తన వద్దకు వచ్చే రోగులకు సిరిధాన్యాలు, కషాయాలతోను.. మరీ అవసరమైనప్పుడు హోమియో మందులనూ అందిస్తున్నారు. వరి బియ్యం, గోధుమలు, పాలు, మాంసాహారం, వేళా పాళాలేని ఆహార విహారాలు, జన్యుమార్పిడి పంటలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పర్యావరణాన్ని, ఆహారాన్నీ విషతుల్యంగా మార్చి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలడానికి కారణభూతమవుతున్నాయని ఆయన భావిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మలబద్ధకం, పైల్స్, గ్రాంగ్రీను, ట్రైగ్లిజరైడ్స్, పీసీఓడీ, అతి తక్కువ వీర్యకణాలు, చర్మవ్యాధులు, మూత్రపిండాలు, థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలతోపాటు మెదడు సంబంధమైన, రక్త సంబంధమైన వంటి జబ్బులేవీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిరిధాన్యాలు అందిస్తాయని రుజువైందని తెలియజెబుతున్నారు. ►మన దేశంలో కేన్సర్ నిర్థారణ రోజుకు 2,000 మంది ► కేన్సర్ మరణాలు.. రోజుకు 1,500 మంది ► కేన్సర్‌తో ఏటా చనిపోతున్న భారతీయులు: 5,56,400 మంది ► 2020 నాటికి పెరగనున్న కేన్సర్ రోగుల సంఖ్య 17.3 లక్షలు ► రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. ఏదన్నా చేయండి చెమట పట్టేలా చేయాలి! వంటికి చెమట పట్టడం చాలా మందికి ఇష్టం లేక ఇటువంటి పనులు చేయటం లేదు. ఇది అసలు సరైనది కాదు. చెమట పట్టడం వల్ల దేహంలో నుంచి వ్యర్థాలను, కల్మషాలను బయటకు పంపటంతోపాటు.. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామనడానికి నిదర్శనం కూడా. గమనిక: ఈ వ్యాసంలో వ్యక్తపరచిన అభిప్రాయాలన్నీ స్వతంత్ర ఆహార, అటవీ వ్యవసాయ (కాడు కృషి) శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి (మైసూరు) వ్యక్తపరచినవి. -
ప్రకృతి వైపు మరలండి..
పూజించండి.. ఆరాధించండి... కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలు, కషాయాలతోనే మధుమేహం, కేన్సర్ వంటి జబ్బులను చాలా మందికి నయం చేస్తున్నారని విన్నాం. మీరు విన్నది నిజమే. గత 20 ఏళ్లు నేను నమ్ముతున్న మార్గం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాను. అసలు మంచి ఆహారం తీసుకోవడమే సగం ఆరోగ్యాన్ని పొందడం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి అని దేవుడు వైవిధ్యమైన ఆహారాన్ని ప్రతి చోటా సృష్టించాడు. కానీ మనం బియ్యం, గోధుమలతోనే సరిపెట్టుకుంటూ సంక్షోభంలో పడిపోయాం. దీంట్లో నుంచి బయటపడాలంటే, ప్రకృతి వైపు నడవాలి. తినే ఆహారంలో మార్పు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్య స్థితిని పొందవచ్చు. సిరిధాన్యాలే మనుషులకు అసలైన ఔషధ గుణాలున్న ఆహారం. ఆ చైతన్యం నింపడానికే మైసూరులో ‘కాడు కృషి’ని నెలకొల్పాం. గత 20 ఏళ్లుగా రైతులు, రోగులతో కలిసి పనిచేస్తున్నాం. కేన్సర్, మధుమేహం అనువంశికం అనే ప్రచారం ఉంది. కేన్సర్, మధుమేహం.. వారసత్వంగా సంక్రమించేవి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలి సమస్యల వల్లనే అవి వస్తున్నాయి. ఎగ్జిమా, కొన్నిరకాల బుద్ధిమాంద్యాలు మాత్రమే అనువంశిక జబ్బులు. పూర్వం కేన్సర్, మధుమేహం ఎక్కడో ఒకరికి వచ్చేవి. ఇప్పుడు ఎటు చూసినా ఈ రోగులు కనిపిస్తున్నారు. ఆహారం మారిపోవటం అంటే.. వాణిజ్యకరణ చెందిన ఆహారం మనుషులను రోగగ్రస్తులుగా మార్చుతున్నది. ∙అంటే విదేశీ ఆహారోత్పత్తులే సమస్యా? మనం విదేశీ ఆహారాన్ని తప్పుపట్టడం లేదు. వాళ్ల దేశంలో ఆ ఆహార పదార్థాలు మంచివే. అండు కొర్రలను అమెరికన్ మిల్లెట్ అంటారు. వాళ్లు పూర్వం తింటుండేవాళ్లు. గుమ్మడికాయలు కూడా తినేవాళ్లు. అవి తిన్నన్నాళ్లు వాళ్లకు గుండె జబ్బుల్లేవు. అటువంటి సహజమైన ఆ ఆహారాలను వదిలేసి, జన్యుమార్పిడి ఆహారాలు తింటున్న తర్వాత అక్కడా జబ్బులు పెరిగాయి. మనకు తెలిసినన్ని ధాన్యాలు వాళ్లకు తెలియవు. కొర్రలు మన దగ్గర 108 రకాలుండేవి. ఈ వైవిధ్యతను కాపాడుకునే జ్జానం వాళ్లకు లేదు. కొర్రలను ఇటాలియన్ మిల్లెట్ అంటారు. పూర్వం వాళ్లు తినేవాళ్లు. ఇప్పుడు విత్తనాలు కూడా లేకుండా నాశనం చేశారు. నేను 20 ఏళ్ల క్రితం అమెరికా నుంచి తిరిగి ఇక్కడకు వచ్చి సిరిధాన్యాల విత్తనాలు సేకరించి, రైతులతో సాగు చేయించకపోతే ఇవి కూడా అంతరించిపోయేవి. ∙కేన్సర్, మధుమేహం వంటి జబ్బులను సిరిధాన్యాలు, కషాయాలు ఎలా తగ్గించగలుగుతున్నాయి.. ఇందులో శాస్త్రీయత ఏమిటి? సిరిధాన్యాలు (కొర్రలు(Foxtail Millet), అండుకొర్రలు (Browntop Millet), సామలు(Little Millet), ఊదలు (Barnyard Millet), అరికలు(Kodo Millet)) ఔషధ గుణాలు కలిగిన, ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఆహార ధాన్యాలు. కషాయాలు మన సంప్రదాయ జీవనంలో అంతర్భాగంగా పూర్వం నుంచీ ఉన్నవే. వీటి ద్వారా ఎవరైనా వారి వారి రోగ స్థితిగతులను బట్టి.. 6 నెలల నుంచి 2 ఏళ్లలో ఆరోగ్యవంతంగా మారవచ్చు. చాలా ఏళ్లుగా రకరకాల రోగాలతో బాధపడుతున్న వేలాది మంది అనుభవాల ద్వారా ఇది రూఢీ అయిన విషయం. చిరుధాన్యాలలో 5 రకాలను ‘సిరిధాన్యాలు’గా మీరు పిలుస్తున్నారు. వీటికి ఆ ఔషధ గుణాలు ఎలా వచ్చాయి? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిండిపదార్థం (కార్బోహైడ్రేట్లు) ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిండిపదార్థం 79 శాతం. అంటే వీటి నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిండి పదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే ఔషధ శక్తిగల ఆహారంగా భావించాలి. వీటిని తిన్న తర్వాత గ్లూకోజ్‌ను 6–8 గంటల్లో నెమ్మదిగా సమతుల్యంగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. జొన్నలు, రాగులు, సజ్జలకు తటస్థ ధాన్యాలని పేరు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన, సహజమైన ఆహారం. డాక్టర్లు ఇచ్చిన మందులు మామూలుగానే వాడుకోవచ్చా..? వాడుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అల్లోపతి వైద్యవిధానాన్ని నేను ప్రోత్సహించను. ఆయుర్వేదం, యునాని, హోమియో పద్ధతుల్లో ఏ రోగానికి చికిత్స పొందుతున్న వారైనా ఆయా మందులు వాడుకుంటూనే ఆహారంలోను, జీవనశైలిలోను మార్చు చేసుకుంటే ఆరోగ్యవంతులు కావచ్చు. ప్రశ్నలు–జవాబులు డాక్టర్ ఖాదర్‌వలి ఈ కథనంలో వ్యక్తపరచిన అభిప్రాయాలపై ప్రశ్నలను పాఠకులు ‘ఎడిటర్ (సిరిధాన్యాలతో చికిత్స), సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్డు నంబర్ –1, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034’ చిరునామాకు పంపవచ్చు. ఆ ప్రశ్నలకు డా. ఖాదర్ ఇచ్చే జవాబులను ‘సాక్షి’లో ప్రచురిస్తాం. – ఎడిటర్ -
ఒక పాట నిదురించడానికి వెళ్లింది...
వీడ్కోలు: పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానిని ఎంత అవసరమో అంత, మరికొంత ఉంటే బాగుండనిపించేలా... మరికాస్త తీపికి ముఖం వాచేలా. తూ ఛుపీ హై కహా మై తడప్తా యహా.... ఒక పాట నిదురించడానికి వెళ్లింది. మన బుగ్గల మీద మెల్లగా తట్టి, చిన్నగా పరిహాసమాడి, మరెళ్లొస్తాను సుమా అని, బాధ పడకుండా ఉండేందుకు, విరహంతో వేగకుండా ఉండేందుకు, ఎడబాటులో రగిలిపోకుండా ఉండేందుకు కొన్ని పాటల్ని- ఉత్త రంగురాళ్లుగా కాకుండా రతనాలుగా, మణిమాణిక్యాలుగా, ఏం చెప్తాం మన ఇంటి అరుగు నుంచి తుంచిన కొన్ని మట్టిబెడ్డలుగా మూటగట్టి, పదిలంగా అప్పజెప్పి, మళ్లీ రానని, ఏడు ఆకాశాల ఆవల మువ్వల పరుపు మీద శయనించడానికి, పల్లవులను చరణాలుగా చేసుకొని కరుగుతూ కరుగుతూ అదృశ్యమైపోయింది. దేవుని దప్పిక తీర్చడానికి చేసిన పయనమది. నరకలోక జనుల గాయాలను ముద్దాడి సేద తీర్చేందుకు పయనం. తూ ప్యార్ కా సాగర్ హై తేరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్... సారా తాగి తాగి నలభై ఏళ్ల వయసులో సైగల్ పోయాడు. తన్తో పాటు ఆ గరగరలాడే స్వరాన్ని, పొగలు పొగలుగా ఒరుసుకునే గాత్రాన్ని దయా కనికరం లేకుండా పట్టుకొని పోయాడు. కాని- బీడుపడ్డ మైదానాలను ప్రకృతి అలాగే వదల్దు. పాడుబడ్డ హృదయాలను తడపకుండా మేఘం ఘనీభవించి మిగలదు. పాత పంజాబు నుంచి రఫీ వచ్చాడు. లక్నో నుంచి తలత్ వచ్చాడు. ‘దిల్లీ’ నుంచి మధురమైన ‘మాధుర్’ను ఇంటి పేరుగా కలిగిన ముఖేశ్ వచ్చాడు. దిల్ జల్తా హై తో జల్నే దే - ఇది నేను అన్నాడు ముఖేశ్. సుహానీ రాత్ ఢల్ చుకీ - ఇది నేనే అన్నాడు రఫీ. ఏయ్ దిల్ ముఝే ఐసీ జగా లే చల్ - ఇది నేనూ అని ఎవరూ లేని చోటుకు తీసుకెళతానన్నాడు తలత్. 1950ల నాటికి ముగ్గురూ దోగాడటం మాని మైక్రోఫోన్ ముందు తడబడకుండా నిలబడి పాడే ఎత్తుకు ఎదిగారు. మన్నా డేకి ఆ అదృష్టం పట్టలేదు. ఆ ఫేమ్ తలుపు తట్టలేదు. బారిష్టర్ చదువు చదవమని కోరే తండ్రిని సుతారంగా కాదని కలకత్తా నుంచి బాబాయ్ కె.సి.డేతో కలిసి హార్మోనియం మెట్లే ఆస్తిగా బొంబాయి వస్తే, పాటందుకోవడానికి వస్తే, పాటనేలడానికి వస్తే ఆ గెలుపు అంత సులువుగా దొరకలేదు. అన్నీ బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు... ముక్కూ మొహం ఎరగని పాటలు. ఈలోపు రఫీ నౌషాద్‌ను గెలుచుకున్నాడు. తలత్ దిలీప్‌ను. ముఖేశ్- నర్గిస్ సహిత రాజ్‌కపూర్‌ను. మన్నా డే ఎక్కడకు వెళ్లాలని? అవకాశం ఎప్పటికి అతడి తలుపు తట్టాలని? కౌన్ ఆయా మేరె మన్ కే ద్వారె పాయల్కీ ఝన్కార్ లియే... ‘మున్నా’ అంటే ‘బుజ్జీ’ అని అర్థం. కె.సి.డే అలా పిలిచేవాడు. అదే ‘మన్నా’గా మారి మన్నా డే అయ్యింది. ఏ ముహూర్తాన ఆ పేరు వచ్చిందోగాని కెరీర్ మొదలు పెట్టింది మొదలు అన్నీ చిట్టి పొట్టి బుజ్జి అవకాశాలే. ఇంత మంచి గొంతు ఉండీ, ఇంత మంచి ప్రతిభ ఉండీ, ఇంతగా క్లాసికల్లో కంఠ నరాలు తెగే సాధన ఉండీ... బాధ... ఏడుపు... కోత. పగవాడికి కూడా వద్దు. ఆఖరుకు ఎస్డి బర్మన్ తనూరోడే కనుక అశోక్ కుమార్ తీసిన ‘మషాల్’ (’50)లో మంచి పాట ఇచ్చి- ఒరే... దీన్తో నువ్వు పేలాల్రా బాబూ అని వెన్ను తడితే- అంత వరకూ ఉక్కిరిబిక్కిరిగా ఉన్నవాడు కళ్లు రెండూ తుడుచుకుని- ఊపిరి పీల్చుకొని- ఊపర్ గగన్ విశాల్- అని ఎలుగెత్తి అందుకుంటే అందరూ అదిరిపోయారు. ఒక చెయ్యి గూబకు ఆన్చి ఒక చెయ్యి ఆకాశానికి చూపుతూ పాడుతూ ఉంటే ఆ ఆకాశమే అతడి ప్రతిభకు హద్దు అని గ్రహించారు. ఆ తర్వాత ‘దో బీఘా జమీన్’ ఇంకో పెద్ద హిట్. అందులో ధర్తీ కహే పుకార్కే- అని ఆరుబయలు నారు పోసే పొలాల మధ్య, వరుస తీరిన రైతు కూలీల కోరస్ల మధ్య మన్నా డే పాట కూడా కొత్తకొత్తగా మొలకెత్తుతూ ఉంటే అదోరకం పులకరం. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ పాటగానీ ఈ పాటగానీ తీసింది హీరోల మీద కాదు. బల్రాజ్ సహానీ వంటి బీదాబిక్కీ రైతుల మీద. ముక్కూముఖం ఎరగని జూనియర్ ఆర్టిస్టుల మీద. దాంతో స్టాంప్ పడిపోయింది. ఇతడు హీరోల సింగర్ కాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుల సింగర్. మన్నా డేకు ఏం అర్థం కాలేదు. వెన్నాజున్నులు మాత్రం పాలు కావా? తన గొంతులో మాత్రం మీగడ తరగలు లేవా? ఏ మేరి జొహర్జబీ తుఝే మాలూమ్ నహీ తూ అభీ తక్ హై హసీ ఔర్ మై జవాన్.... అయితే ఎంతకాలమని వెన్నెలను కానలలోనే అణుస్తారు. ధారలను భూపొరలలోనే దాస్తారు. వెలికి వస్తాయవి. ఉబికి చిమ్ముతాయి పైకి. అదను మీద ఉన్న మన్నా డేను పదునైన పాటలతో కలిశారు శంకర్-జై కిషన్‌లు. ఇద్దరూ అణాకానీ బతుకు నుంచి పైకొచ్చినవారే. టాలెంట్‌కు విలువిచ్చేవారే. అదిఉండాలేగాని నీవాడైతే ఏంటి నావాడైతే ఏంటి. పాట పేలాలి. రాజ్‌కపూర్‌కు చెప్పి, ముఖేశ్‌ను కాసేపు పక్కన పెట్టమని ఒప్పించి మన్నా డేకు పాటలిచ్చారు. వేరేవి అనవసరం. రెండు మాత్రం గుర్తు చేసుకోవాలి. ఒకటి- గాలిగాలిగా ఉన్న ఆ వెలుతురు రాత్రి, అక్కడే వేళ్లాడుతున్న చందమామ, పక్కన పిల్లంగోవిలాంటి అబ్బాయి రాజ్‌కపూర్, వెంట కోరిక కలిగిన తురంగంలా చూసే నర్గిస్ (చోరీ చోరీ). రెండోది- దేవుడా... ఎవరు మాత్రం మర్చిపోగలరు ఆ పాటని... ఆ వాననీ... ఆ గొడుగు... ఆ కొయ్య వంతెన... పొగలు గక్కే చాయ్... తడిసిన రాజ్‌కపూర్ జోళ్లు... ఒణికే నర్గిస్ పెదాలు... రేగే మన్నా డే గమకాలు (శ్రీ 420).... ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్ ప్యారా ప్యారా... ప్యార్ హువా ఇక్రార్ హువాహై ప్యార్‌సే ఫిర్ క్యూ డర్తాహై దిల్... పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు ల్లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానికి ఎంత అవసరమో అంత. మరికొంత ఉంటే బాగుండనిపించేంత... మరికాస్త తీపికి ముఖం వాచేంత. కావాలంటే ‘బహారోంకే సప్నే’లోని పాటను గుర్తు చేసుకోండి. ఆశా పరేఖ్, రాజేష్ఖన్నాలు మనకెందుకు. లతా, మన్నా డేలతో పదండి వెనుకకు. చునరీ సంభాల్ గోరీ ఉఢీ చలీ జాయెరే మార్ నా దే డంక్ కహీ నజర్ కోయి హాయ్.... కిశోర్ మీద ముందు నుంచి కన్నుంది ఎస్డి బర్మన్కు. దేవ్ ఆనంద్‌కు రకరకాల పాటలు పాడించాడు ఎప్పుడో. రఫీ అంటే ఎంత ఇష్టం ఉన్నా కిశోర్‌కు ఇవ్వాల్సింది కిశోర్కే. కాని ఆయన కడుపున పుట్టిన ఆర్డి బర్మన్ వచ్చి కిశోర్ మీద ఇంకా ప్రేమను చాటుకొని ‘ఆరాధన’తో కిశోర్‌ను సూపర్‌స్టార్‌ని చేశాడు. సంగీతం గురించి ఏమాత్రం తెలియని కిశోర్ సూపర్‌స్టార్ కావడమా? సంగీతం గురించి క్షుణ్ణంగా తెలిసిన మన్నా డే మౌనంగా చూడటమా? అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. వచ్చింది. ‘పడోసన్’ సినిమా. కిశోర్, మన్నా డేల మధ్య పోటీ పాట. ఈ పాటతో వాణ్ణి ఫినిష్ చేస్తా అనుకున్నాడు మన్నా డే. ‘ఏక్ చతురనార్... బడీ హోషియార్’. సంగీతం ఆర్.డి.బర్మన్. కాని ఏ సంగతీ చెప్పలేదు మన్నా డేకి. అతడి గొంతును మెహమూద్‌కు వాడతారట. సునీల్ దత్‌కు కిశోర్ గొంతు అట. మన్నా డే పాడాడు. కిశోర్ ఇంప్రవైజేషన్ పేరుతో అరిచి గోల చేసి అదే పాటగా రికార్డు చేశాడు. తీరా స్క్రీన్ మీద చూస్తే కిశోర్ చేతిలో ఓటమి. మన్నా డేకి బాధ. ఎంత అన్యాయం ఇది. కాని ఎరిగినవాళ్లకు తెలియదా ఎవరిది గెలుపో. కిశోర్ మన్నా డేను అందుకోగలడా? అయితే ఈ పాట పాడమనండి. లాగా చున్రీ మే దాగ్ ఛుపావూ కైసే ఘర్ జావూ కైసే? పోనీ ఈ పాటను. సుర్ నా సజే క్యా గావూ మై సుర్ కే బినా జీవన్ సూనా... భారతీయ సినీగీతానికి మన్నా డే కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే అది ఆయన ఇన్నాళ్లు తనలా ఉంటూనే ఎవరికైనా సరే ఒక పర్ఫెక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఉండటమే. ఆయన కిశోర్‌లాంటి పాట పాడగలడు. రఫీలాంటిది పాడగలడు. హేమంత కుమార్లాంటిది కూడా. బెంగాలీలో ఒక పాటను సలీల్ చౌధురి హేమంత కుమార్ చేత పాడించాడు. అదే పాటను ఒక మెట్టు ఎక్కించడానికి ‘ఆనంద్’లో మన్నా డే చేత. హేమంతకు ఒక పూలహారం ఎలాగూ వేస్తాము. కాని మన్నా డేకు రెండు. గుర్తుందా ఆ పాట. బరువైన ఆనందంలాంటి పాట. జిందగీ కైసి హై పహేలీ హాయే కభితో హసాయే కభితో రులాయే.... కొన్ని పాటలు చెప్పుకోకపోతే ఇంటికొచ్చి తంతారు. ఆవో ట్విస్ట్ కరే; బాబూ... సంఝో ఇషారే; ఏ మెరే ప్యారే వతన్; యారీ హై ఈమాన్ మేరి; ఏ భాయ్ జరా దేఖ్ కే చలో... మన్నా డే ఈ పాటలన్నింటితో నాలుగు దశకాల పాటు మనందరినీ తాకాడు. మన అనేక సందర్భాల్లో మరువలేని అతిథిలా కదలాడాడు. ఆయన పాట ఎప్పటికీ భూలే బిస్రే గీత్ కాలేదు. అది కాలం గడిచే కొద్దీ రుచులు ఊరే పాత మధువు. పోనీ మర్నాటికీ మరువలేని ఒక లేత జ్ఞాపకం. - ఖదీర్