క్యాన్సర్‌పై చిరు పిడికిలి | Dr. Khader Wali tips on cancer health | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై చిరు పిడికిలి

Published Thu, Jan 25 2018 12:00 AM | Last Updated on Thu, Jan 25 2018 12:00 AM

Dr. Khader Wali tips on cancer health - Sakshi

సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకుంటూ...
కషాయాలు తగితే కేన్సర్‌ను జయించవచ్చు
ఆహారం, జీవనశైలిలో పాశ్చాత్య 
అంధానుకరణ మారితే 6 నెలల నుంచి
రెండేళ్లలో పూర్తి ఆరోగ్యవంతులు కావచ్చు
మైసూరుకు చెందిన స్వతంత్ర ఆహార,
అటవీ కృషి శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి 
అనుభవాల సారమిది...

‘మన ఆహారమే మన ఔషధం కావాలి’ 
ఈ మాట హిప్పొక్రేట్స్‌ అనే మహానుభావుడు క్రీస్తు పూర్వమే చెప్పారు. సాంకేతికంగా సమాజం ఎంత ‘అభివృద్ధి’ సాధించినా ఇప్పటికీ ఈ భావనే మానవాళి అంతటికీ తలమానికం కావాల్సి ఉంది. ఆహారంలో పెచ్చుమీరిన రసాయనాల అవశేషాలు, పర్యావరణ కాలుష్యం, పాశ్చాత్య జీవనశైలి అంధానుకరణ... తదితర కారణాల నేపథ్యంలో ఇటీవల సంవత్సరాల్లో కేన్సర్, మధుమేహం ఆందోళనకరంగా వ్యాపిస్తున్నాయి. అత్యాధునిక అల్లోపతి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుటికీ.. రోగుల దైనందిన జీవితాలు వ్యధాభరితంగా మారుతున్నాయి. కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్యతోపాటు దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 

ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇంకేదైనా మెరుగైన దారి ఉందా??నిస్సందేహంగా కేన్సర్‌ను జయించే మార్గం ఉందంటున్నారు స్వతంత్ర ఆహార, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి!  సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవటం, కొన్ని రకాల కషాయాలను తాగటం, జీవనశైలిలో కచ్చితమైన మార్పులు చేసుకోవటం ద్వారా కేన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్‌ ఖాదర్‌ చెబుతున్నారు. సిరిధాన్యాలు, కషాయాలు, హోమియో/ ఆయుర్వేద మందుల ద్వారా రోగులు సాంత్వన పొందవచ్చని అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. తన వద్ద చికిత్స పొందిన, పొందుతున్న కేన్సర్‌ రోగుల జీవితాల్లో చీకట్లు తొలగి కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు. డా.ఖాదర్‌వలి‡ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...నాలుగు నెలల క్రితం ఒక యువకుడు తన తల్లితో కలిసి నా దగ్గరకు వచ్చాడు. అతను బయోటెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదువుకున్నాడు. అతని తల్లి గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చారు. ఆ చికిత్స తర్వాత ఆమె బక్కచిక్కి, బలహీనపడ్డారు. వైద్యులు ఇక చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా కుమారుడిని వెంటబెట్టుకొని ఆమె నా దగ్గరకు వచ్చారు. నేను వెంటనే ఆమె అనారోగ్యం పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నాను. ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత.. పర్వాలేదు, మీరు క్రమంగా కోలుకుంటారని నేను ఆశాభావంతో చెప్పాను. ఇంతకుముందు వైద్యులు ఇచ్చిన మందులను కొనసాగిస్తూనే.. అరికె బియ్యం, సామ బియ్యం వంటి సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని.. రావి ఆకులు, జామ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని 3–4 నెలల పాటు తాగాలని సూచించాను. నేను చెప్పిన మాటలపై ఆమె కుమారుడికీ నమ్మకం కుదిరినట్లు అనిపించింది. తల్లి, కొడుకు ఇద్దరూ ఆశాభావంతోనే ఇంటికి తిరిగి వెళ్లారు. 

అటువంటి రోగులు చాలా మంది నన్ను కలుసుకుంటూ ఉండటం మామూలే కాబట్టి ఆ తల్లి, కుమారుడి గురించి నేను అప్పట్లోనే మర్చిపోయాను. అయితే, రెండు రోజుల క్రితం వాళ్లిద్దరూ మళ్లీ నన్ను కలవడానికి వచ్చారు. నన్ను చూసీ చూడగానే కుమారుడు నాకు పాదాభివందనం చేశాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అనిపించింది. నేను ఆహారంలో చెప్పిన మార్పులను ఆమె తు.చ. తప్పకుండా పాటించారు. నిజానికి వాళ్లు తమకు అంతకుముందు వైద్యం చేస్తున్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లి నేను సూచించిన వైద్యాన్ని గురించి తెలియజేశారు. ఆయన వాళ్ల వైపు చూసి పిచ్చా.. వెర్రా.. అన్నట్లు హేళనగా నవ్వారట.  కేన్సర్‌ వంటి తీవ్ర వ్యాధులతో బాధపడే రోగులు నా దగ్గరకు చాలా మందే వస్తూ ఉంటారు లేదా ఫోన్‌ ద్వారా కూడా సంప్రదిస్తూ ఉంటారు. కానీ, నేనెప్పుడూ వారి కథలను రాసిపెట్టలేదు. ఇటువంటి వాళ్లందరికీ నేను సిరిధాన్యాలు + కషాయాలతో సులభమైన చికిత్సనే చేస్తున్నాను. ఈ చికిత్స చాలా మామూలు సంగతిగా అనిపిస్తున్నప్పటికీ ప్రభావశీలంగా పనిచేస్తున్నది. అందువల్ల, సిరిధాన్యాలు + కషాయాలతో కూడిన చికిత్స పద్ధతి ఆవశ్యకతను గురించి వివరంగా చెప్పుకోవటం అవసరం అనిపిస్తోంది. 

కషాయాలను వాడటం అనేది మన ఇళ్లలో పూర్వం నుంచీ ఉన్నదే. ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా బామ్మలు ఆయా లక్షణాలను బట్టి తగిన కషాయాలను సూచిస్తూ ఉంటారు. బామ్మలు సూచించే అటువంటి ఔషధాల గురించి నేను చాలా లోతుగా శాస్త్రీయ అధ్యయనాలు చేసి, నిర్థారణకు వచ్చిన తర్వాత రోగులకు సూచిస్తున్నాను. 
ఔషధ గుణాలున్న సిరిధాన్యాలు ఐదు రకాలు. కొర్ర (Foxtail Millet) బియ్యం, ఊద(Barnyard Millet) బియ్యం, అరిక(kodo Millet) బియ్యం, సామ(Littile Millet) బియ్యం, అండు కొర్ర(Browntop Millet) బియ్యం. వ్యాధిని బట్టి, కేన్సర్‌ రకాన్ని బట్టి ఈ ఐదింటిలో ఎంపిక చేసిన రెండు రకాల చిరుధాన్యాలను తినాలి. వీటితో పాటు ఈ ఐదింటిలో ఇతర సిరిధాన్యాల బియ్యాన్ని కూడా తినవచ్చు.  కేన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి నువ్వు లడ్డు తినాలి. లడ్డు తినటం వీలుకాకపోతే.. దోరగా ఇనుప పాత్రలో వేయించిన నువ్వులు అర చెంచాడు లేదా చెంచాడు, వారానికోసారి, తినాలి.

కషాయం.. ఓ ఆరోగ్య పానీయం!
కషాయాలను మొక్కల ఆకులు, రెమ్మలు, వేళ్లతో తయారు చేసుకుంటుంటాం. నాలుగైదు ఆకులను లేదా అవసరమైనన్ని రెమ్మలు లేదా వేరు ముక్కలను తీసుకోవాలి. వాటిని 150–200 ఎం.ఎల్‌. నీటిలో వేసి 3–4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపునే తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని నీటితో మాత్రమే కషాయం కాయడానికి వాడాలి! 

కేన్సర్‌ రోగులకు రోజూ రెండు రకాల కషాయాలు..
సాధారణంగా ఏ రకమైన కేన్సర్‌తో బాధపడే వారైనా సరే.. ప్రతి రోజూ రెండు రకాల కషాయాలు తాగాలి. ఉదయం, రాత్రి ఆహారానికి ముందు ఒక కషాయం తాగాలి. మధ్యాహ్న భోజనానికి ముందు మరో రకం కషాయం తాగాలి. ఈ కషాయాలను 3–4 నెలల పాటు క్రమం తప్పకుండా, విధిగా తాగాలి. ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు. అయితే, ఇదే వరుస పాటించాలన్న నియమం అవసరం లేదు.   
ఉదయం, రాత్రి తాగే కషాయాలు 3 రకాలు. మధ్యాహ్నం తాగే కషాయాలు 2 రకాలు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకోవడానికి ముందు, వారానికో రకం కషాయం చొప్పున 3 రకాల కషాయాలను తాగాలి. ఒక వారం పారిజాతం ఆకుల కషాయం, రెండో వారం రావి ఆకుల కషాయం, మూడో వారం జామ ఆకుల కషాయాలను ఒకదాని తర్వాత మరొకటి తాగాలి. ఈ 3 రకాల కషాయాలతోపాటు.. కేన్సర్‌ రకాన్ని బట్టి ఈ కింద పేర్కొన్న విధంగా.. రోజూ మధ్యాహ్నం ఆహారం తీసుకోవడానికి ముందు, మరో రెండు రకాల కషాయాలను, వారానికి ఒకటి చొప్పున తాగాలి. సిరిధాన్యాలను తినటం ద్వారా ఆధునిక కాలపు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సిరిధాన్యాల్లో పుష్కలంగా ఉన్న పీచుపదార్థమే మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. దీనికితోడు ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. పొగతాగడం, మద్యం తాగడం తక్షణం ఆపేయాలి. 

ఏయే కేన్సర్‌కు ఏయే చికిత్స? 
శ్వాసకోశ కేన్సర్‌: సిరిధాన్యాలు: కొర్ర   బియ్యంతో ఒక రోజు, సామ  బియ్యంతో మరో రోజు అన్నం వండుకొని తినాలి. ఆ రోజు 3 పూటలూ అదే రకం బియ్యం వండుకొని తినాలి.
కషాయాలు: పారిజాతం  , రావి , జామ  ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం అల్లం   కషాయం, మరో వారం పసుపు  కషాయం తాగాలి. 
ఎముకల కేన్సర్‌: సిరిధాన్యాలు: ఎముకల కేన్సర్‌ రోగులు అండు కొర్ర   బియ్యం ఒక రోజు, సామ బియ్యం మరొక రోజు, అరిక బియ్యం ఇంకో రోజు తినాలి. వీటిని అన్నంగా వండుకొని తినొచ్చు. లేదా గంజి చేసుకొని కూడా తాగొచ్చు. కషాయాలు: పారిజాతం , రావి, జామ  ఆకుల కషాయాలను (వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో ఒక వారం, పుదీన ఆకులతో ఒక వారం కషాయం చేసుకొని తాగాలి. 
మెదడు కేన్సర్‌: సిరిధాన్యాలు: అరిక బియ్యం ఒక రోజు, సామబియ్యం మరో రోజు, అండు కొర్ర  బియ్యం ఇంకో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు.. సదాప/ సదాపాకు  (కన్నడలో నాగదాలి) ఆకులతో ఒక వారం, మరో వారం దాల్చిన చక్క కషాయం తాగాలి.
రక్త కేన్సర్‌:  సిరిధాన్యాలు: అరికబియ్యం ఒక రోజు, కొర్ర  బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కరివేపాకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం మరో వారం తాగాలి. 
మూత్రాశయం/ప్రొస్టేట్‌ కేన్సర్‌: సిరిధాన్యాలు: ఊదబియ్యం ఒక రోజు, అరి బియ్యం మరో రోజు, అండు కొర్ర బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కొత్తిమీర కషాయం ఒక వారం, అటిక మామిడి ఆకుల కషాయం మరో వారం తాగాలి. 
రొమ్ము కేన్సర్‌: సిరిధాన్యాలు: అండు కొర్ర  బియ్యం ఒక రోజు, అరిక బియ్యం మరో రోజు తినాలి. 
కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కానుగ ఆకుల కషాయం ఒక వారం, వేప ఆకుల కషాయం మరో వారం వాడాలి. 
నోటి కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: కొర్ర బియ్యం, సామబియ్యం వండుకొని తినాలి. కషాయాలు: పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం పుదీన ఆకుల కషాయం, మరో వారం అల్లం కషాయం తాగాలి. 
నోటి కేన్సర్‌ రావడానికి ముఖ్య కారణం సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లేదా ఏదో ఒక రూపంలో పొగాకు నమలడం. పొగాకును ఏ రూపంలోనూ వాడకూడదు. అంతేకాదు, మద్యం తాగకూడదు. 
థైరాయిడ్‌/పాంక్రియాస్‌ కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: అరికబియ్యం ఒకరోజు, సామ బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు:  పారిజాతం, రావి, జామ  ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు బంతిపూలకషాయం ఒక వారం, చింత చిగురు  కషాయం మరో వారం తాగాలి. చింత చిగురు ఏడాది పొడవునా దొరకదు. అటువంటప్పుడు మునగ చెట్టు పూలతో చేసిన కషాయం తాగాలి. 
పొట్ట కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్రబియ్యం మరో రోజు తినాలి. కషాయాలు:  పారిజాతం, రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో చేసిన కషాయం ఒక వారం, అరటి బోదె ముక్కలతో చేసిన కషాయం మరో వారం వాడాలి. 
చర్మ కేన్సర్‌కు చికిత్స: అతి ప్రమాదకరమైన కేన్సర్లలో చర్మ కేన్సర్‌ ఒకటి. 
సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్ర బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు:  పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఉల్లికాడలకషాయం ఒక వారం, కలబందకషాయం మరో వారం తాగాలి. 

ఎవరీ డా.ఖాదర్‌వలి?
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన డాక్టర్‌ ఖాదర్‌ వలి (60) సిరిధాన్యాల పునరుద్ధరణకు 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారు.  మైసూరులో ఎమ్మెస్సీ (ఎడ్యుకేషన్‌) చదివిన తర్వాత బెంగళూరులో స్టెరాయిడ్స్‌పై పీహెచ్‌డీ చేశారు. సహ విద్యార్థిని ఉషను ప్రేమించి పెళ్లాడారు. అమెరికా వెళ్లి బీవెర్టాన్‌ ఓరెగాన్‌లో పర్యావరణ శాస్త్రంపై పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా ఉన్నారు.  ఏజెంట్‌ ఆరెంజ్, డయాక్సిన్లు వంటి అత్యంత విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయటంపై పరిశోధన చేశారు.  ఆహారం వాణిజ్యకరించబడుతున్న నేపథ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటమే జీవితానికి అర్థవంతంగా ఉంటుందని భావించి 1997లో భారత్‌కు తిరిగి వచ్చి మైసూరులో స్థిరపడ్డారు.  అంతరించిపోతున్న 5 రకాల చిరుధాన్యాల పునరుద్ధరణకు కృషి చేశారు. వీటిని వాడే క్రమంలో ప్రతి ఒక్క చిరుధాన్యానికి ఉన్న ఔషధ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు సైతం తగ్గుతున్నాయని కనుగొన్నారు. అందుకే వీటికి సిరిధాన్యాలని పేరు పెట్టారు. వీటిని సహజ పద్ధతుల్లో సాగు చేయడానికి ‘కాడు కృషి’ అనే విధానాన్ని ఆవిష్కరించారు. తన వద్దకు వచ్చే రోగులకు సిరిధాన్యాలు, కషాయాలతోను.. మరీ అవసరమైనప్పుడు హోమియో మందులనూ అందిస్తున్నారు. వరి బియ్యం, గోధుమలు, పాలు, మాంసాహారం, వేళా పాళాలేని ఆహార విహారాలు, జన్యుమార్పిడి పంటలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పర్యావరణాన్ని, ఆహారాన్నీ విషతుల్యంగా మార్చి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలడానికి కారణభూతమవుతున్నాయని ఆయన భావిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మలబద్ధకం, పైల్స్, గ్రాంగ్రీను, ట్రైగ్లిజరైడ్స్, పీసీఓడీ, అతి తక్కువ వీర్యకణాలు, చర్మవ్యాధులు, మూత్రపిండాలు, థైరాయిడ్‌ సంబంధిత అనారోగ్యాలతోపాటు మెదడు సంబంధమైన, రక్త సంబంధమైన వంటి జబ్బులేవీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిరిధాన్యాలు అందిస్తాయని రుజువైందని తెలియజెబుతున్నారు. 

►మన దేశంలో కేన్సర్‌ నిర్థారణ రోజుకు 2,000 మంది

► కేన్సర్‌ మరణాలు.. రోజుకు 1,500 మంది

► కేన్సర్‌తో ఏటా చనిపోతున్న భారతీయులు: 5,56,400  మంది

► 2020 నాటికి పెరగనున్న కేన్సర్‌ రోగుల సంఖ్య 17.3 లక్షలు

► రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. ఏదన్నా చేయండి చెమట పట్టేలా చేయాలి! వంటికి చెమట పట్టడం చాలా మందికి ఇష్టం లేక ఇటువంటి పనులు చేయటం లేదు. ఇది అసలు సరైనది కాదు. చెమట పట్టడం వల్ల దేహంలో నుంచి వ్యర్థాలను, కల్మషాలను బయటకు పంపటంతోపాటు.. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామనడానికి నిదర్శనం కూడా.

గమనిక: ఈ వ్యాసంలో వ్యక్తపరచిన అభిప్రాయాలన్నీ స్వతంత్ర ఆహార, అటవీ వ్యవసాయ (కాడు కృషి) శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి (మైసూరు) వ్యక్తపరచినవి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement