చికిత్స పొందుతున్న తండ్రి గురునాయుడు, కుమార్తె లాస్య
తగరపువలస(భీమిలి) విశాఖ జిల్లా: విధి ఆ కుటుంబంపై కన్నెర్ర చేసింది. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వారి జీవితాలను తలకిందులు చేసింది. వారి మధుర స్వప్నాలను చెరిపేసి దినదినగండంగా మార్చేసింది. ఈ హృదయ విదారక దుస్థితిని గత తొమ్మిది నెలలుగా ఎదుర్కొంటోంది భీమిలి మండలం మజ్జివలస పంచాయతీ కాగితాలపేటకు చెందిన చిల్ల గురునాయుడు కుటుంబం. క్వారీ లారీలో కార్మికునిగా పనిచేస్తూ భార్య జయలక్ష్మి, కుమారుడు అఖిల్‌కుమార్, కుమార్తె లాస్యను గురునాయుడు పోషించుకునేవాడు.
చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి..
కుమారుడు పంచాయతీలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతుండగా కుమార్తె మండల పరిషత్ పాఠశాలలో మూడో తరగతిలో చేరాల్సి ఉంది. ఏ వ్యసనాలూ లేన గురునాయుడు కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేవాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం లాస్యకు మధుమేహం నిర్ధారణ కావడంతో వైద్యానికి రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. అంతటి ఆర్థిక స్థోమత లేని గురునాయుడు స్థానికుల చొరవతో కేజీహెచ్‌లో చేర్పించి ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లాస్యకు మధుమేహం అదుపులోకి వచ్చింది. ఇంతలో కుమారుడు అఖిల్‌కుమార్ పలుమార్లు కింద పడిపోవడంతో రెండు చేతులు వంకరగా తిరిగిపోయి ఏ పనీ చేయడానికి సహకరించడం లేదు.
మూడో దశలో బ్లడ్ క్యాన్సర్..
కుమార్తెకు మధుమేహం సోకడంతో ఏడాదిగా తల్లడిల్లిపోయిన గురునాయుడు గత ఏడాది అక్టోబర్‌లో జ్వరం బారినపడ్డాడు. ఎంతకీ కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించగా బ్లడ్ క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వాంతులు, విరేచనాలు కూడా నియంత్రణ లేకుండాపోయాయి. క్యాన్సర్ రోగులలో రేడియేషన్, కీమో థెరిపీకి మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్సకు అవకాశం ఉంది. ఏ పాజిటివ్ గ్రూపు రక్తం కలిగిన గురునాయుడుకు హఠాత్తుగా రక్తం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ చికిత్స ఉచితంగా అందుతున్నా వారంలో రెండు సార్లు ఎస్‌డీపీ ప్లేట్‌లెట్లు, ఆర్‌డీపీ ప్లేట్‌లెట్లు కలిగిన రక్తం ఎక్కించడానికి రూ.25వేలు ఖర్చవుతోంది. గత రెండు నెలల్లో ఈ ప్లేట్‌లెట్లు ఎక్కించడానికి రూ.2 లక్షలు అప్పులు చేసి ఖర్చు చేశారు. మరోవైపు 9 నెలలుగా గురునాయుడు పనికి వెళ్లకపోవడంతో ఇంటిలో పూట గడవడం కష్టంగా మారింది.
నా భర్త వైద్యానికి సహకరించండి
ఉన్నంతలో హాయిగా గడచిపోతున్న మా కుటుంబంపై విధి తన ప్రతాపాన్ని చూపింది. తొమ్మిది నెలల్లోనే మా జీవితాలు తలకిందులైపోయాయి. నా భర్త వైద్యానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా భీమిలి వైఎస్సార్‌సీపీ నాయకులు సహకరించాలి. అలాగే నిత్యం ఎస్‌డీపీ, ఆర్‌డీపీ ప్లేట్‌లెట్లు ఎక్కించడానికి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. వైద్యానికి సహకరించే దాతలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగరపువలస శాఖలోని 520291017909398 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: యూబీఐఎన్ 0913944 ఖాతా ద్వారా లేదా 91214 62179లో సంప్రదించి సహకరించగలరు.
– చిల్ల జయలక్ష్మి, మజ్జివలస, భీమిలి మండలం
Comments
Please login to add a commentAdd a comment