ఒక్కరే చూడొద్దు | Webflix special story in this week | Sakshi
Sakshi News home page

ఒక్కరే చూడొద్దు

Published Sat, Dec 22 2018 12:27 AM | Last Updated on Sat, Dec 22 2018 1:25 PM

Webflix special story in this week  - Sakshi

మనం ఏవిటేవిటో అనుకుంటాం.. మనం ఏకాకులం అని అనుకుంటాం!  చాలాసార్లు ఏకాంతం కోరుకుంటాం.. ఎవరితోనూ ఏ కనెక్షన్‌ లేకుండా మన ప్లేస్‌లో మనం ఉంటే బాగుండూ అనుకుంటాం. అలా అనుకోకండి...  ముందు టీవీ ఉండొచ్చు.. వెనకాల ఇంకెవరైనా ఉండొచ్చు!!

అర్ధరాత్రి దాటింది.. తలుపు కొడ్తున్నారు! లోపల.. ఒళ్లో పిల్లాడిని పెట్టుకుని కునికిపాట్లు పడుతున్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. ఇంకా తలుపు కొడ్తూనే ఉన్నారు. ఆ తల్లి వణికిపోతోంది. ‘‘మామయ్యా.. మామయ్యా...’’ పిలిచింది, వచ్చింది తన మామేమో అనుకొని.  ప్రతిస్పందనగా తలుపు కొట్టిన చప్పుడే వినపడుతోంది. ఆమెలో భయం ఎక్కువైంది. ‘‘ఈ పూట పనిచేస్తే సర్పంచ్‌ డబ్బులిస్తానన్నాడు. రెండు రోజులకు సరిపడా సరుకులు తెస్తా..’’ అని చెప్పి వెళ్లాడు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తలుపు కొడ్తున్న చప్పుడు ఆగలేదు. సొంత ఊళ్లో.. ఉన్న ఎకరం భూమిని ఆక్రమించి భర్తను చంపేశాడు భూస్వామి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని చంటిబిడ్డను చంకనేసుకొని ఈ ఊరొచ్చిపడ్డారు తనూ, మామ. ఇక్కడేమో అంతా వింతగా ఉంది.  ఈసారి తలుపు చప్పుడు మరింత గట్టిగా వినపడటంతో వర్తమానంలోకి వచ్చింది ఆమె. మామయ్యా అని పిలిచినా బదులు పలకట్లేదంటే.. తలుపు కొడ్తోంది వాళ్లేనా? నెమ్మదిగా వెళ్లి చూద్దామని అనుకునేలోపే.. ఆ గుడిసెలో ఉన్న గుడ్డి దీపం కాస్తా ఆరిపోయింది. ఇంతలోకే మోకాళ్ల మీద పాకుతూ ఆ ‘ముగ్గురు పిల్లలు’ తనను చుట్టుముట్టారు.  అనుకున్నంతా అయింది. రాత్రి గడపవతల అన్నం పెట్టలేదు. తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేశారు. తన చేతుల్లో ఉన్న పిల్లాడిని  దగ్గరగా పొదివి పట్టుకునుంది. అయినా వాళ్లు వదలట్లేదు. బలంగా లాగుతున్నారు. తను ప్రతిఘటిస్తోంది. చేతుల మీద రక్కుతున్నారు. గట్టిగా అరుస్తూ  పిల్లాడిని ఎత్తుకొని వాళ్ల నుంచి తప్పించుకోవడానికి గుడిసె దాటింది. పరిగెడుతూ పరిగెడుతూ ఓ చిన్న గుడి దగ్గర ఆగింది. ఆమె దేవుడి ప్రాంగణంలోకి వెళ్లేసరికి  ఆ ముగ్గురూ నిరాశతో వెనుదిరిగారు. 

ఊరవతల.. పాడుబడిన ఇంట్లో
ఆ పూటకి ఎలాగో గండం తప్పించుకుంది ఆ తల్లి. కానీ ఆ ఊళ్లో కొనసాగాలంటే ప్రతిరోజూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిందే. ఉదయమనగా వెళ్లిన మామ జాడలేడు. తెల్లవారే వరకు గడిపిన ఆమె వెలుతురు వెలువడ్డ మరుక్షణమే మామను వెదకడానికి బయలుదేరింది. ఊరవతల తాగి పడి ఉన్నాడు. లేపి.. గుడిసె దగ్గరకు తీసుకొచ్చి రాత్రి జరిగిన సంఘటనను మొరపెట్టుకుంది. అవి పిల్ల పిశాచాలు. వాటికి తిండి పెట్టకపోతే నా కొడుకుని పీక్కుతింటాయి అంటూ ఏడ్చింది. పిల్లా లేదు.. పిశాచమూ లేదు. అంతా భ్రమ. ఈ ఊళ్లోవాళ్లు మూర్ఖులు అని కొట్టిపారేశాడు ఇంకా మత్తు వదలని మామ.  వచ్చిన డబ్బులతో తాగడమే కాక పిచ్చి వాగుడు వాగుతున్నావని తిట్టింది. కొడుకును అతనికి అప్పజెప్పి తను బయలుదేరింది. ఆ ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు నది దగ్గర ఆ ఊరు ఆవిడ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. ‘‘ఈ ఊళ్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు తినడానికి ఉన్నా లేకపోయినా.. రాత్రి పడుకునే ముందు గడపవతల ప్లేట్‌లో అన్నం పెట్టడం మాత్రం మరిచిపోవద్దు. లేకపోతే మీ పిల్లాడి ప్రాణాలు పోతాయ్‌’’ అని. ‘‘ఎందుకలా?’’ అడిగింది. ‘‘తెలియదు. 70 ఏళ్లుగా సాగుతున్న ఆచారం. ఈ ఊరు చివరన ఉన్న పాడుబడ్డ ఇంట్లో మూడు పిల్ల పిశాచాలుంటాయి. రాత్రి అయిందంటే చాలు.. ఊరు మీదకొస్తాయి.  ప్రతి గుమ్మం ముందున్న  అన్నం తిని వెళ్లిపోతాయి లేకపోతే ఆ ఇంట్లో పిల్లల్ని మింగేస్తాయని చెప్తుంటారు’’ అని తనకు తెలిసింది చెప్పింది   ఆవిడ. ఆ ప్రకారమే ఈ తల్లి ఊరవతల ఉన్న పాడుపడిన ఇంటికి వెళ్లింది.  ఆ ఇంట్లో ఓ తల్లి చిన్న కుండలో చారెడు బియ్యంతోపాటు నూరిపెట్టిన గన్నేరు పప్పు ముద్దనూ వేసి గంజి కాసి.. ఆ పిల్లలకు పెడ్తూ కనిపించింది. చివరకు తను కూడా తిని ఈమె కళ్లముందే ఆ ముగ్గురు పిల్లలతోపాటు ఆ తల్లీ నురగలు కక్కి చనిపోతుంది. విషయం అర్థమవుతుంది వచ్చిన తల్లికి. ఆకలితో చనిపోయిన ఆ పిల్లలే పిశాచాలై ఊరు మీద పడ్డారని. భయంతో వెనుతిరుగుతుంది. 

రెండో కథ
చెరువు గట్టున.. జనం మధ్యలో .. ఎనభై ఏళ్ల ఓ ముసలావిడను గొలుసులతో గుంజకు కట్టేసి ఉంది. ‘‘ఈ దయ్యాన్ని వదిలిపెట్టేది లేదు బాబా’’ అంటున్నాడు ఆ ఊరి పెద్ద. ‘‘చెప్పు.. ఎందుకొస్తున్నావ్‌?’’ అంటూ  బాబా  మంత్రదండంతో ఆ ముసలావిడను   బెదిరిస్తున్నాడు. ‘‘నేను దయ్యాన్ని కాను.. నన్ను వదిలేయండి’’ ముసలావిడ ప్రాధేయపడుతోంది. అయినా వినట్లేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. దెయ్యం పేరుతో  వృద్ధురాలిని  గొలుసులతో బంధించడాన్ని చూడలేకపోయాడు. అసలు దయ్యాలు, భూతాలు ఏంటి? అంతా మూఢనమ్మకాలు. మానసిక రోగాలు. భ్రమలు, భ్రాంతులు అంటూ ఆమెను విడిపించబోయాడు. ఊరి పెద్ద,  బాబాతోపాటు చుట్టూ ఉన్న  జనం, కానిస్టేబుల్స్‌ కూడా ‘‘అయ్యా.. అపచారం.. అది దయ్యమే. బంధించే ఉంచండి’’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ మాట సాగనివ్వలేదు. చేసేదిలేక వెనక్కితగ్గాడు ఇన్‌స్పెక్టర్‌. కానీ రాత్రి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నాక వచ్చి.. ఆ వృద్ధురాలిని విడిపించి తన జీప్‌లో ఆమె ఇంటి దగ్గర దింపాడు ఇన్‌స్పెక్టర్‌. 

‘‘నన్ను విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు ఇన్‌స్పెక్టర్‌గారూ. నాకున్న కాసింత పొలాన్నీ కబ్జాచెయ్యడానికి ఊరివాళ్లముందు నన్ను దయ్యంలా నిరూపించాలని చూస్తున్నారు ఊరి పెద్ద. వాడికి బాబా వత్తాసు. సమయానికి వచ్చి రక్షించారు. మీ రుణం ఎలా తీర్చుకోనూ?’’ వినయంగా అడిగింది ఆ వృద్ధురాలు. ‘‘అయ్యో.. ఇది నా బాధ్యత. అవునూ.. ఊరవతల.. ఈ చిట్టడవిలో ఒంటరిగా ఉంటున్నావా?’’ గాబరాగా అడిగాడు  ఇన్‌స్పెక్టర్‌ ఆమె ఇల్లును చూసి. ‘‘లేదు బాబూ.. మా అక్కతో కలిసి ఉంటున్నాను. ఈ ఊరువాళ్ల బారి నుంచి తప్పించుకోడానికే’’ అంది. జాగ్రత్తలు చెప్పి జీప్‌ ఎక్కాడు ఇన్‌స్పెక్టర్‌. తెల్లవారి.. తన తల్లికి ఒంట్లో బాలేదని, రెండు రోజులు ఆమెకు సాయంగా ఉండొస్తానని  పుట్టింటికి బయలుదేరింది ఎస్‌ఐ భార్య.  యథావిధిగా అతనూ డ్యూటీకి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి చేరేసరికి భార్య దర్శనమిచ్చింది. అదేంటి రెండు రోజుల దాకా రానన్నావ్‌.. అప్పుడే వచ్చావేంటి?అని ఆశ్చర్యపోతాడు ఇన్‌స్పెక్టర్‌. ‘‘మరీ చేతకాకుండా ఏమీ లేదు అమ్మకి. బాగానే ఉంది. మీకు కష్టమవుతుందని వచ్చేశా’’అంటుంది. ఆ  రాత్రి ఎందుకనో మళ్లీ ఆ ముసలమ్మ గుర్తొస్తుంది ఎస్‌ఐకి. కానిస్టేబుల్‌ను తీసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు.  అక్కడికి చేరుకోగానే  భార్య నుంచి ఫోన్‌ వస్తుంది. ‘‘ఏంటీ.. ఇంకా ఇంటికి చేరారా లేదా? నేను లేను కదా అని డ్యూటీ పేరుతో స్టేషన్‌లోనే కాపురం ఉంటున్నారా?’’  అంటూ. షాక్‌ అవుతాడు ఎస్‌ఐ. 

మరి  ఇంట్లో ఉన్నది  ఎవరు?
అనుమానంతోనే ఇంటికి వస్తాడు. ఇంట్లో భార్య కనపడుతుంది.  అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది ఎస్‌ఐకి. ఆ అయోమయంలోనే  రెండు రోజులు గడుస్తాయి. పనిమీద ఎస్‌ఐ బయటకు వెళ్లినప్పుడల్లా పుట్టింటి నుంచి భార్య ఫోన్‌ చేస్తూంటుంది  క్షేమసమాచారాల కోసం. మళ్లీ ఇంటికి వెళ్లేసరికి ప్రత్యక్షమవుతుంది. అదే విషయం  అడిగితే.. నన్నే అనుమానిస్తున్నావా అంటూ  ఏడుస్తుంది. ఏమీ అర్థంకాదు ఎస్‌ఐకి. చేసేదిలేక బాబా దగ్గరకు  వెళ్తాడు. భార్య రూపంలో ఉన్నది  దయ్యమేనని స్పష్టం చేస్తాడు బాబా. మంత్రించిన ఆవాలు ఇస్తాడు చుట్టూ చల్లుకోమని. వాటిని తీసుకొని  ఇంటికి వెళ్లిన  ఎస్‌ఐ నిస్సత్తువగా కుర్చీలో కూలబడ్తాడు.  అతనిని  చూసిన  భార్య‘‘ఏంటి అంత నీరసంగా ఉన్నావ్‌? ఆకలిగా ఉందా? ఉండు వేడి వేడి సూప్‌ చేసుకొస్తాను’’ అంటూ వంటింట్లోకి వెళుతుంది. ఆమె అటు వెళ్లగానే బాబా ఇచ్చిన ఆవాలను కుర్చీ చుట్టూ  చల్లుకుంటాడు. ఇంతలోకి బయట గుమ్మం నుంచి సూట్‌కేస్‌ పట్టుకొని భార్య వస్తుంది. దిమ్మతిరుగుతుంది ఎస్‌ఐకి.  ‘‘ఇందాకే కదా వంటింట్లోకి వెళ్లావ్‌?’’  అంటాడు. ‘‘నేనా? ఇప్పుడే పుట్టింటి నుంచి వస్తుంటే..’’ అంటుంది అమాయకంగా. ‘‘రైలు దిగి ఎంతసేపటి నుంచి ఫోన్‌ చేస్తున్నానో తెలుసా నన్ను పికప్‌ చేసుకోవడానికి వస్తావేమోనని. నీ ఫోన్‌ కలిస్తేనా?’’ అంటూ దగ్గరకు వస్తుంది. కింద ఆవాలను చూసి.. ‘‘అయ్యో ఆవాలు పడేసుకున్నారా? వంట రానప్పుడు ఎందుకీ తంటా? హాయిగా బయటనుంచి తెప్పించుకోక?’’ అంటూ చీపురు తెచ్చి కిందంతా శుభ్రం చేస్తుంది. ఈలోపు వంటింట్లోంచి సూప్‌తో వస్తుంది భార్యలాగే ఉన్నా ఇంకో ఆవిడ. ఈ ఇద్దరినీ చూసి ఎస్‌ఐ మతి పోతుంది నిజంగానే. ఆ ఇద్దరు ఆడవాళ్లూ విస్తుపోతారు ఒకరినొకరు చూసుకుని. వాళ్లలో నిజమైన భార్య ఎవరో? ఆ  మిగిలిన వ్యక్తి ఎవరో? తెలుసుకోవడానికి రహస్యంగా బాబాకు ఫోన్‌ చేస్తాడు ఎస్‌ఐ. మాటల్లో పెట్టు వస్తానని చెప్తాడు బాబా. వాళ్లను మాటల్లో పెడ్తుండగానే బాబా వచ్చేస్తాడు. బాబాను చూసి సూప్‌ కాచిన భార్య పారిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పట్టుకొని.. ‘‘ఈమే దయ్యం. ఆ ముసల్ది. నేను చెప్తే మీరు నమ్మలేదు. రక్షించినందుకు మీ భార్య రూపంలోనే వచ్చి మీతో కాపురం చేస్తోంది’’ అంటూ కాళ్లు, చేతులు కట్టేస్తాడు బాబా. అంతా చూసి అసలు భార్య కళ్లుతిరిగి పడిపోతుంది.

భార్యే దయ్యమా? దయ్యమే భార్యా?
‘‘చెప్పు మళ్లీ ఎందుకొచ్చావో  చెప్పు’’ అంటూ దెయ్యాన్ని కొడ్తుంటాడు బాబా. ‘‘ఈమె పెళ్లికాకుండా చనిపోయింది. అందుకే ఇప్పుడు నీతో కాపురం చేస్తోంది’’ అని ఎస్‌ఐతో చెప్తూ  ఆ దయ్యాన్ని  సీసాలో బంధించే ప్రయత్నం చేస్తుంటాడు బాబా. ఆ దయ్యం అలా సీసాలోకి దూరుతుందో లేదో ఇటు  కళ్లుతిరిగిపడిపోయిన ఎస్‌ఐ అసలు భార్య లేస్తుంది. ‘‘ఎస్‌ఐ గారూ.. మీకేం భయంలేదిప్పుడు. ఆ ముసలి దయ్యాన్ని ఈ సీసాలో బంధించేశా’’ అని భరోసానిస్తూ వెళ్లిపోతాడు బాబా. ఆ సీసాను ఊరవతల చెరువు గట్టున పాతి పెడ్తాడు. మరుసటిరోజు అత్తగారిని చూడ్డానికి ఎస్‌ఐ తన భార్యతో ఊరికి ప్రయాణమవుతాడు. ముందు సీట్లో డ్రైవర్‌తోపాటు ఎస్‌ఐ, వెనక సీట్లో ఆయన భార్య కూర్చుని ఉంటారు. దయ్యం గురించి ఇంకా కలవర పడ్తున్నాడేమో అనుకొని వెనకనుంచి భర్త భుజమ్మీద చేయి వేస్తుంది ఆమె. ఏమీలేదులే అన్నట్టుగా వెనక్కితిరిగి చూడకుండానే ఆమె చేయిని నొక్కి రేర్‌ వ్యూ మిర్రర్‌లో చూస్తాడు భార్యను. వృద్ధ దయ్యం కనపడుతుంది నవ్వుతూ! ఒళ్లు గగుర్పొడిచే  ఇలాంటి పదిహేను కథలతో ‘‘అంజాన్‌.. రూరల్‌ మిత్స్‌’’ పేరుతో పదిహేను ఎపిసోడ్ల న్యూ వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అప్‌లోడై ఉంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మూఢనమ్మకాల ఆధారంగా  తీసిన సిరీస్‌ ఇది. అన్నిటికీ దయ్యమే నేపథ్యం. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు పాల్పడే కుటుంబసభ్యుల పనిపట్టే, మహిళల మీద జరుగుతున్న హింసను ఆపే  మంచి దయ్యాల కథలూ ఉన్నాయి వీటిలో. రూరల్‌ మిత్స్‌ అనే ట్యాగ్‌లైన్‌తో తీసిన ఈ సిరీస్‌లో  ఏ ఎపిసోడ్‌లోనూ అది మిత్‌ అన్న భావనను కలగజేసే లాజిక్‌ ఎండ్‌ ఇవ్వలేదు. హారర్‌ షోగా ప్రజెంట్‌ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అయ్యుంటే రూరల్‌ మిత్స్‌ అనే క్యాప్షన్‌ పెట్టి ఉండాల్సింది కాదు. పెట్టినందుకు కనీసం లాజిక్‌ ఎండ్‌ను ఇస్తే బాగుండేది. రాత్రి లైట్‌ ఆర్పేసుకొని ఈ సిరీస్‌ చూస్తే హారర్‌ షో థ్రిల్‌ కలుగుతుంది. అలాంటి జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ‘అంజాన్‌.. రూరల్‌ మిత్స్‌’ను ఎంజాయ్‌ చేస్తారు.
– సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement