రేస్ 3 ట్రైలర్
నిడివి 3 ని. 9 సె. ,హిట్స్ 2,50,36,347
రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింలు ఉత్సాహంగా మాసాంతాన వచ్చే పండగ కోసం ఎదురు చూస్తారు. అలాగే ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు– సల్మాన్ ఖాన్ సినిమా కోసం. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ మాసం కలిసి వచ్చిందనడానికి గతంలో అతడు సాధించిన పెద్ద పెద్ద హిట్స్ ఉదాహరణ. ఈ రంజాన్‌కు అతడు ‘రేస్ 3’ సినిమాతో రానున్నాడు. ‘బాజీగర్’ వంటి పెద్ద హిట్స్ గతంలో తీసిన దర్శక ద్వయం అబ్బాస్–మస్తాన్ ఈ రేస్ సిరీస్‌కి ఆద్యులు. రేస్1, రేస్2 సినిమాలు సైఫ్ అలీఖాన్ ముఖ్యపాత్రలో పెద్ద హిట్ అయ్యాయి.
ఆ వరుసలోనే రేస్3 సైఫ్‌తో తీద్దామనుకున్నారు. కాని నిర్మాత రమేష్ తౌరాని రేస్ 3లో సల్మాన్ ఉండాలని భావించాడు. సల్మాన్ కథలో మార్పులు చెప్పి దర్శకుడిగా కొరియోగ్రాఫర్ రెమో డిసూజాను దర్శకుడిగా పెట్టుకోమని కోరాడు. దాంతో అబ్బాస్–మస్తాన్‌లు పక్కకు తప్పుకున్నారు. అలాగే సైఫ్ కూడా తప్పుకున్నారు. రేస్ 3లో సల్మాన్‌ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్ ఫెర్నాండెస్ వంటి భారీ తారాగణం ఉంది.
అలాగే భారీ పోరాట సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. థాయ్‌లాండ్, అబూదాబీ దేశాల్లో భారీ చేజింగ్‌లు ఈ సినిమా కోసం తీశారు. చూడబోతే ఫుల్ పైసా వసూల్ సినిమాలా ఉంది. ఇప్పటికే రెండు కోట్ల హిట్స్ దాటి పోయాయంటే సల్మాన్ హవా ఎలాంటిదో అర్థం చేసుకోండి.
నా నువ్వే ట్రైలర్
నిడివి 1 ని. 40 సె. ,హిట్స్ 76,78,820
పి.సి.శ్రీరామ్ చేయి పడితేనే ఎందుకో సినిమా ఫ్రెష్ లుక్ పొందేస్తుంటుంది. ‘నా నువ్వే’ ట్రైలర్ చూస్తే పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వల్లే తాజాగా అనిపిస్తుంది. కల్యాణ్‌రామ్ భిన్నమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఆ ఆసక్తి వల్లే ‘అతనొక్కడే’ సినిమా వల్ల సురేందర్ రెడ్డి వంటి మంచి దర్శకుడు దొరికాడు. ఇప్పుడు ‘నా నువ్వే’ వల్ల జయేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.
‘నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే విశ్వమంతా దాని విజయానికి కృషి చేస్తుంది’ అని నానుడి. కాని ఎంత స్వచ్ఛమైన ప్రేమకైనా ఏదో ఒక ఆటంకం ఉంటుంది... దాన్ని దాటితేనే ప్రేమ దొరుకుతుంది అనే లైన్‌లో ఈ సినిమా తయారైనట్టుగా కనిపిస్తుంది. తమన్నా అందంగా ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. కల్యాణ్‌రామ్ లుక్ కూడా కొత్తగా ఉంది. వెన్నెల కిశోర్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు. రైల్వే ప్లాట్‌ఫామ్ కూడా ఇందులో మరో ముఖ్యపాత్ర పోషించింది. ఎదురు చూడదగ్గ సినిమా.
మంటో ట్రైలర్
నిడివి 1 ని. 27 సె. ,హిట్స్ 40,11,718
ఇక్కడ ‘మహానటి’ సావిత్రి మీద బయోపిక్ వచ్చి వార్తలకెక్కితే హిందీలో సాదత్ హసన్ మంటోపై బయోపిక్ రాబోతూ సాహిత్యాభిమానుల్లో కుతూహలం రేపుతోంది. ఎవరీ సాదత్ హసన్ మంటో? దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ను ఎంచుకుని అక్కడ స్థిరపడి దేశ విభజన సమయంలో మానవ స్వభావంలోని నైచ్యాన్ని, హైన్యాన్ని కథనం చేసి లక్షలాది సాహిత్యాభిమానులను సంపాదించుకున్నాడు. కాని ‘సభ్య’ సమాజం అతణ్ణి వెంటాడింది. పదే పదే కోర్టు కేసులు వేసి విసిగించింది.
‘వేశ్యావాటికకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చుగానీ వేశ్య గురించి కథ రాయకూడదా’ అని ఈ ట్రైలర్‌లో మంటో పాత్రధారి నవాజుద్దీన్ సిద్దిఖీ అడుగుతాడు. వేశ్యల మీద, స్త్రీల మీద సాగిన రేప్‌ల మీద, హింస మీద మంటో కథలు ఉంటాయి. మంటో గురించి పాకిస్తాన్‌లో ఇది వరకే సినిమా వచ్చింది. భారతదేశంలో నాటకాలు వచ్చాయి. పూర్తిస్థాయి సినిమా రావడం ఇదే ప్రథమం. నందితా దాస్ దర్శకురాలు. జూన్‌లో విడుదల.
Comments
Please login to add a commentAdd a comment