
నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు
డెమీ లొవాటో : టెల్ మీ యు లవ్ మీ
నిడివి : 6 ని. 47 సె., హిట్స్ : 1,23,18,780
లవ్ బ్రేక్ అయినప్పుడు ఎవరు ఎక్కువ బాధపడతారు? అమ్మాయా? అబ్బాయా? లవ్ బ్రేక్ అయ్యాక, మళ్లీ దగ్గర కావాలని ఎవరు ఎక్కువ ఆరాటపడతారు? అబ్బాయా? అమ్మాయా? డెమీ లొవాటో కొత్త వీడియో ట్రాక్‌లో మాత్రం ‘టెల్ మీ యు లవ్ మీ’ అని అమ్మాయే అంటుంది. ‘నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు..’ అని వాడిని మనసులోనే వెయ్యిసార్లు వేడుకుంటుంది. అది వాడికెలా తెలుస్తుంది? లవ్‌లో ఉన్నప్పుడే ఆమెను తెలుసుకోలేకపోయాడు. లవ్ బ్రేక్ అయ్యాక తెలుసుకుంటాడా? అసలు బ్రేక్ అవడానికే కారణమే వాడు కదా! వీడియోలో మీకు కనిపించే ఆ ‘వాడు’ జెస్సీ విలియమ్స్. సాంగ్ వెంటనే స్టార్ అవదు. కొన్ని సీన్లు ఉంటాయి.
‘కపుల్–వై’ ఈవెంట్స్, ప్రపోజల్, మేక్–అవుట్ సెషన్స్, లాస్ట్‌లో లవర్స్ ఫైటింగ్. ఆ ఫైటింగ్ ఎందుకవుతుందంటే.. మధ్యలోకి ఎరిక్ అనేవాడు వచ్చేస్తాడు. డైరెక్టుగా రాడు. ఆ అమ్మాయి ఫోన్‌లోకి వచ్చేస్తాడు. ‘హూ ఈజ్ హీ?’ అంటాడు జెస్సీ. నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అని అక్కడితో ఆగదు, ‘జెలస్ ఫీల్ అవుతున్నావా?’ అంటుంది. జెస్సీకి కోపం వస్తుంది. లవర్స్‌గా ఉన్నప్పుడే మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే మండిపోతుందే, పెళ్లి ఫిక్స్ అయి, భార్యాభర్తల్లా ఉంటున్నప్పుడు ఎంటర్ అయితే మనసు దహించుకుపోదా? ముçహూర్తం రోజు వస్తుంది.
పాస్టర్ పెళ్లి జరిపిస్తాడు. కానీ జెస్సీ మూడీగా ఉంటాడు. మెల్లిగా లొవాటో దగ్గరకు వెళ్లి, ఆమె తన వేలికి తొడిగిన ఉంగరాన్ని తీసి, ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. లొవాటో గుండె బద్ధలైపోతోంది. లొవాటో 25 ఏళ్ల అందమైన అమెరికన్ గాయని. ఇక జెస్సీ హాలీవుడ్ యాక్టర్. చక్కటి జంట. వాళ్లు బ్రేకప్ అవడం ఏమో కానీ.. మన మనసుకు బాధగా అనిపిస్తుంది.. ఒక రిలేషన్ పాడైపోవడం.
గట్టి పిల్లే.. కాస్త ఎమోషనల్ అయింది
సెలెనా గోమెజ్ టియర్‌ఫుల్లీ యాక్సెప్ట్స్
నిడివి : 2 ని. 21 సె., హిట్స్ : 34,32,541
‘బిల్‌బోర్డ్’ యు.ఎస్.లో పెద్ద పేరున్న ఎంటర్‌టైన్‌మెంట్ మేగజైన్. ఆ పత్రిక ఏటా రకరకాల కేటగిరీలలో ‘బిల్‌బోర్డ్ మ్యూజిక్’ అవార్డులు ప్రకటిస్తుంటూంది. ఈ ఏడాది అమెరికన్ సింగర్, నటి సెలెనా గోమెజ్ ఎంపిక అయ్యారు! రెండు రోజుల క్రితం ‘బిల్ బోర్డ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంటూ స్టేజ్ మీద ఉబికి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోడానికి చాలా ప్రయత్నించారు సెలెనా. ‘యాక్సెప్టెన్స్ స్పీచ్’లో ఆమె ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు.
ఈ అవార్డు తనకు రావలసింది కాదు, ఫ్రాన్సియా రైజియాకు రావలసింది అన్నారు! ఫ్రాన్సియా ఆమె కన్నా నాలుగేళ్లు పెద్ద స్నేహితురాలు. అమెరికన్ నటి. ఈ రెండింటినీ మించి, సెలెనాకు ప్రాణదాత! అవును. గత అక్టోబర్‌లో సెలెనాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆమెకు కిడ్నీ ఇచ్చింది ఫ్రాన్సియానే. తనెంతో అదృష్టవంతురాలిననీ, తన కన్నా పెద్దవాళ్లైన స్త్రీలందరినీ మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేస్తున్నాననీ అన్నారు సెలెనా. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పడు ఆమె గుండె నిబ్బరానికి మనమూ ఎమోషనల్‌గా ఫీలైపోతాం. కన్నీళ్లను పక్కన పెట్టి చూస్తే ఎంత మెచ్యూర్డ్‌గా ఉందీ పిల్ల!
సూర్యా గ్యాంగ్‌లో శివగామి
తాన సెరన్‌ద కూట్టమ్ : ట్రైలర్
నిడివి : 1ని. 14 సె. హిట్స్ : 59,85,968
సూర్య కొత్త మూవీ ‘తాన సెరన్‌ద కూట్టమ్’ ట్రైలర్.. సౌత్‌ని చిందులు వేయిస్తోంది. యోగ్యులు అక్కడే ఉంటారు. అయోగ్యలు ఎక్కడికో పోతారు.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది. లేనివాళ్లను దోచుకుని ఉన్నవాళ్లయిపోయిన పెద్ద మనుషుల్ని దోచుకునే హీరో.. ఇందులో సూర్య. అతడికో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో రమ్యకృష్ణ, సత్యన్ శివకుమార్ (త్రీ ఇడియట్స్‌లో సెలెన్సర్) ఉంటారు. ‘మన మనసు మంచిదైతే, మంచి మనసుతో మనం ఏదైనా పని చేస్తే.. ’ అంటూ ట్రైలర్ చివర్లో సూర్య ఏదో చెప్పబోతుంటే రమ్యకృష్ణ దగ్గుతుంది. దాన్ని బట్టి ఇదేదో మంచి పని చేయబోతున్న దొంగల ముఠా అనే డౌట్ వస్తుంది. సంక్రాంతికి గానీ అసలు కథేమిటో తెలీదు. జనవరి 12న పిక్చర్ రిలీజ్. హీరోయిన్ కీర్తీ సురేశ్. ట్రైలర్‌లో ఒక చోట చార్మినార్ కూడా కనిపిస్తుంది. అంటే.. ఇది తెలుగులోకి కూడా రీమేక్ అవుతోందన్నమాట! మాట కాదు. నిజమే. తెలుగులో ‘గ్యాంగ్’ అని పేరు పెట్టారు. ‘తాన సెరన్‌ద కూట్టమ్’ అన్నా కూడా అర్థం అదే.. ‘సొంత ముఠా’ అని.
కుర్రాడికి ఎంత కష్టమొచ్చిందీ!
లవ్, సైమన్ : ట్రైలర్
నిడివి : 1 ని. 51 సె. హిట్స్ : 27,01,971
సృష్టిలోంచి ప్రేమను మైనస్ చేసేస్తే, ఏమీ మిగలదు. శూన్యం తప్ప. సృష్టి విరుద్ధమైన ప్రేమను బయటికి చెప్పుకుంటే చుట్టూ ఒక్కరూ మిగలరు. మనోవేదన తప్ప. సైమన్ స్పియర్ 17 ఏళ్ల కుర్రవాడు. ఆన్‌లైన్‌లో ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు. అంటే ‘గే’! ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేడు. తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ సతమతం చేస్తుంటూంది. అయినా తన లవ్‌ని కొనసాగిస్తూంటాడు. ఆ ఆన్‌లైన్ లవర్.. సైమన్ క్లాస్‌మేటే.
అయితే ఆ క్లాస్‌మేట్ ఎవరో మాత్రం సైమన్‌కి నేరుగా తెలీదు. కానీ గాఢంగా ప్రేమిస్తుంటాడు. సైమన్ ఎవరో గే లవర్‌తో చాట్ చేస్తున్నాడని కొందరికి తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చెయ్యడం ప్రారంభిస్తారు. బ్లాక్ మెయిల్స్ నుంచి, లవ్ మెయిల్స్ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తుంటాడు సైమన్. వీడియోలో సైమన్‌ని చూస్తే జాలేస్తుంది! ఏంట్రా నాయనా ఈ పిల్లాడికి ఇంత కష్టం అనిపిస్తుంది. లవ్‌ని అర్థం చేసుకోవడం కష్టం. ‘గే’ లవ్ అర్థం కావడం ఇంకా కష్టం. ఈ కష్టమంతా మైల్డ్ హాలీవుడ్ కామెడీ డ్రామాగా వచ్చే ఏడాది మార్చి 16న విడుదల అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment