
పిల్లనీ కాదు.. పెంకునీ కాదు
కేటీ పెర్రీ : హె హె హె ::: నిడివి : 3 ని. 45 సె. ::: హిట్స్ : 1,53,05,223
ఆమెరికన్ పాప్ స్టార్లెట్.. కేటీ పెర్రీ ఈ వీడియోలో మీకు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ఆమెను ఆమె ఊహించుకున్న పాత్ర.. మ్యారీ ఆంటోనెట్! రెండోది ఆమె నుంచి ఆమెను బయట పడేసే పాత్ర.. జోన్ ఆఫ్ ఆర్క్. మ్యారీ ఆంటోనెట్ ఫ్రాన్స్ సామ్రాజ్యపు చిట్టచివరి మహారాణి. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రాన్స్ దేశపు ‘నూరేళ్ల యుద్ధం’లో హీరోయిన్. మ్యారీ ఆంటోనెట్ వేష ధారణలో.. ఇష్టం లేని పెళ్లి నుంచి ఫ్రీడమ్ కోసం పరితపిస్తూ ఉంటుంది కేటీ పెర్రీ. అందుకు కారణం.. ఆమెను వలచి ఎత్తుకొచ్చిన వరుడు రాజప్రాసాద వరాహంలా ఉంటాడు. నిన్ను రాణిలా చూసుకుంటానంటాడు.
ఎందుకు వింటుంది! మనసే లేకపోయాక?! ‘హె హె హె.. యు థింక్ దట్ ఐయామ్ ఎ లిటిల్ బేబీ. యు థింక్ దట్ ఐయామ్ ఫ్రాజైల్ లైక్ ఫ్యాబర్జే..’ (నువ్వనుకుంటున్నావ్ నేనో చిన్న పిల్లనని. నువ్వనుకుంటున్నావ్ కోడిగుడ్డు పెంకులా నేను పెళుసనీ..) అని కేటీ పాడుతుంది. కోపం వచ్చి కేటీ తల నరికేయిస్తాడు వరుడు. నేల రాలిన మ్యారీ ఆంటోనెట్ తలను చేతికి ఎత్తుకుని, కత్తితో జోన్ ఆఫ్ ఆర్క్ ప్రత్యక్షం అవుతుంది.
ఆ నెక్స్‌ట్ సీన్ ప్రిన్స్ గారి తలను జోన్ ఆఫ్ ఆర్క్ తెగ నరికేయడం. వీడియోలో లాస్ట్ సీన్ ఇది. కానీ కనిపించదు! ‘శివ’ మూవీలో రాం గోపాల్ వర్మ మర్డర్‌లు చేయిస్తాడు కానీ చూపించడు. బ్లడ్‌కి బదులు స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపో తుంది. అలా అన్నమాట. సాంగ్ బాగుంది. ఊహలున్న ఆడపిల్లలు చూడాలి. రెక్కలొచ్చేస్తాయి వాళ్లకి. వెరీ ఇన్‌స్పైరింగ్. రెండు క్యారెక్టర్‌లలో కేటీ కాస్ట్యూమ్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి.
రెప్పపాటులో గ్రేట్ రాబరీ
ఓషన్’స్ 8 : ఫస్ట్ ట్రైలర్ ::: నిడివి : 2 ని. 31 సె. ::: హిట్స్ : 84,24,344
వార్నర్ బ్రదర్స్ ఎట్టకేలకు ‘ఓషన్’స్ 8’ ఫస్ట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. శాండ్రా బుల్లక్.. నారింజ రంగులో ఉండే ఖైదీల జంప్‌సూట్‌లో కూర్చొని, ‘‘నన్ను కనుక విడుదల చేస్తే, బయటి ప్రపంచంలోకి వెళ్లాక సాధారణ జీవితం గడుపుతాను’’ అని ప్రమాణం చేయడంతో ట్రైలర్ మొదలౌతుంది. ఇమీడియెట్ సీన్‌లో.. శాండ్రా, తన దోపిడి ముఠాతో కలిసి న్యూయార్క్ సిటీలో యేటా జరిగే ‘మెట్ గాలా’ నుంచి 150 మిలియన్ డాలర్ల ఖరీదైన ఆభరణాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంటుంది! ‘ఎందుకు నువ్విలా చేస్తున్నావ్?’ ఓ క్యారెక్టర్ ఆమెను అడిగితే ‘నాకు బాగా తెలిసిన పని కాబట్టి’ అంటుంది శాండ్రా! ఎనిమిది మంది ఆడవాళ్లు సభ్యులుగా ఉండే ఈ దోపిడి ముఠా కామెడీ మూవీ ఓషన్’స్ 8 వచ్చే ఏడాది జూన్ 8న విడుదల అవుతోంది.
ఓషన్స్ 11 (2001), ఓషన్స్ 12 (2014), ఓషన్స్ 13 (2007)ల ఓషన్స్ ట్రయాలజీకి సీక్వెల్‌గా వస్తున్న ఓషన్’స్ 8 వస్తోంది. ట్రయాలజీలో మొదట వచ్చిన మూవీలోని డ్యానీ ఓషన్ అనే కల్పిత పాత్రను ఈ సీరీస్‌లో ప్రతి సినిమా టైటిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. ఆ డ్యానీ ఓషన్ చెల్లెలిగానే ఓషన్’స్ 8 లో మన దోపిడి ముఠా నాయకురాలు శాండ్రా బులక్ నటిస్తున్నారు.
రాక్షస నగరాల ఫిక్షన్, యాక్షన్
మోర్టల్ ఇంజిన్స్: టీజర్ ట్రైలర్ ::: నిడివి : 1 ని. 29 సె. ::: హిట్స్ : 31,24,363
రిలీజ్‌కు ఇంకా ఏడాది టైమ్ ఉండగనే, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మోర్టల్ ఇంజిన్’ టీజర్ విడుదలైంది! ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘హాబిట్’, ‘కింగ్ కాంగ్’ చిత్రాల నిర్మాత పీటర్ జాక్సన్ తీస్తున్న మరో గ్రాండ్ ఎపిక్ ఇది. డైరెక్టర్ క్రిస్టియన్ రివర్స్. పెద్ద నగరాలు చిన్న నగరాలను తినేయడం థీమ్! ఆ తినేయడం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఈ టీజర్‌లో చూస్తారు. అలాగే ఓ అందమైన అమ్మాయి (28 ఏళ్ల ఐస్‌ల్యాండ్ హెరా హిల్మర్) నటి కళ్లను కూడా. అయితే ఆ కళ్లలో ఆందోళన మాత్రమే మీకు కనిపిస్తుంది.
మీద పడి మింగేయబోతున్న ‘ట్రాక్షన్ సిటీ’ (కదిలే యంత్రం వంటి రాక్షస నగరం) నుంచి తను పుట్టిన ఊరిని, ఊరివాళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె అలా కనిపిస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? వెయ్యేళ్ల క్రితం సంభవించిన ఒక విపత్తులో భూగోళం మొత్తం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయి కొత్త జనరేషన్ పుట్టుకొస్తుంది. కొత్త టెక్నాలజీతో కూడా! దాంతో మానవ జీవనం రూపురేఖలే సమూలంగా మారిపోతాయి. మూవీంగ్ సిటీస్ తయారౌతాయి. టెక్నాలజీ అక్కడితో ఆగదు. వార్‌కి దారితీస్తుంది. పెద్ద సిటీస్ చిన్న పట్టణాలను పొట్టన పెట్టుకోడానికి బయల్దేరతాయి. ఈ ఆధిక్యపోరులో చివరికి టెక్నాలజీ గెలుస్తుందా? మనిషి గెలుస్తాడా అన్నదే స్టోరీ. సినిమా రిలీజ్ వచ్చే ఏడాది డిసెంబర్ 14న.
వెక్కిళ్లు లేకుంటే అదొక జీవితమా?!
హిచ్‌కీ: ట్రైలర్ ::: నిడివి : 2 ని. 31 సె. ::: హిట్స్ : 1,09,68,198
రాణీ ముఖర్జీకి టీచర్‌గా చేయడం ఇష్టం. అసలు అందుకోసమే పుట్టానంటుంది. కానీ రెండు మాటలు కూడా సరిగ్గా పలకలేదు. నిజానికి అవి మాటల్లా కూడా ఉండవు. వెక్కిళ్లలా ఉంటాయి. ఏదో న్యూరో డిజార్డర్! పెద్ద స్కూల్లో టీచర్‌గా జాయిన్ అవుతుంది. వాళ్లయినా ఎలా ఇస్తారు.. అలాంటి ఆవిడకు టీచర్ పోస్టు? ఇచ్చారు! ఒక్క ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఇచ్చారు. ‘ప్రూవ్ చేసుకుంటే ఉంటావ్. లేదంటే ఉండడం కష్టం’ అని. రాణీ ముఖర్జీ తనని తాను నిరూపించుకుంటుంది.
బ్యాడ్ స్టూడెంట్స్‌ని కూడా గుడ్ స్టూడెంట్స్‌గా మార్చేస్తుంది. తొలిరోజు క్లాస్‌లోకి రావడంతోనే ఈ టీచరమ్మకు కష్టాలు మొదలౌతాయి. ఎలాంటి కష్టాలో.. ట్రైలర్‌లో మీరే చూడండి. సిద్ధార్థ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ‘యశ్‌రాజ్ ఫిల్మ్’ బ్యానర్ కింద మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న మూవీ రిలీజ్ అవుతోంది. ‘మర్దానీ’ (మగతనం) తర్వాత దాదాపు మూడేళ్లకు మళ్లీ ఈ పిక్చర్‌తో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు రాణీ ముఖర్జీ.
Comments
Please login to add a commentAdd a comment