ఏది అందం..? ఏది వికారం..? | What is beauty ? What is nausea? | Sakshi
Sakshi News home page

ఏది అందం..? ఏది వికారం..?

Published Thu, Mar 5 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ఏది అందం..?  ఏది వికారం..?

ఏది అందం..? ఏది వికారం..?

అతను ఓ చిత్రకారుడు. అత నికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడు పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది.

ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు  అడిగి తెలుసుకున్నాడు.

అతను చెప్పిన వివ రాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు.
 - యామిజాల జగదీశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement