అత్తారింటికి దారి ఇదే | What is Restitution of Kanjugal Rights? | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారి ఇదే

Published Tue, Sep 27 2016 11:44 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

అత్తారింటికి దారి ఇదే - Sakshi

అత్తారింటికి దారి ఇదే

ఏలుకో.
మర్యాదగా ఏలుకో... లేదా జైలుకి పో!
ఒకవేళ భార్యను వదిలి పారిపోయినా...
భార్యను పుట్టింట్లో దించి జారుకున్నా...
సార్‌కి కోర్టు మంచి మొట్టికాయలు వేస్తుంది.
ఆడపిల్లకు అత్తారింటికి దారి చూపిస్తుంది!
అంటే... ఇన్-లాస్ దగ్గరికి తీసుకెళ్లే ‘లా’ ఇది!
శభాష్... ఐ లవ్ దిస్ లా!!

 
‘‘పాప... బంగారు బొమ్మలా ఉంది’’.
 ‘‘అబ్బో సొట్ట బుగ్గలు..  అచ్చం నాన్న పోలికే’’.
 ‘‘పండులా ఉందిరా.. పండు అని పిలుచుకోండి ముద్దుగా’’.
 ‘‘ఏం పేరు సెలెక్ట్ చేసుకున్నారు... ఆడపిల్ల అంటే లక్ష్మి... లక్ష్మీదేవి పేరేదైనా పెట్టండి... బాగుంటుంది’’.
 ‘‘ఏం కాదు.. అమ్మాయంటే శక్తి... పార్వతీదేవి పేరేదైనా సెలెక్ట్ చేద్దాం’’.
 మైథిలి ఒళ్లో హాయిగా నిద్రపోతున్న 21 రోజుల పసిపాప గురించే ఆ చర్చ! ఆ పాపాయికి వరుసకు అత్తలు, పిన్నులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అయ్యే వాళ్ల మాటలు అవన్నీ!
 
చెవులతో వింటూ మర్యాదకు నవ్వుతున్నా మైథిలి మెదడు తన భర్త గురించే ఆలోచిస్తోంది. ఆమె కళ్లు అతడి కోసమే వెదుకుతున్నాయి. ఏడో నెలలో తీసుకొచ్చి అమ్మవాళ్లింట్లో దింపాడు. అడపాదడపా ఫోన్‌కాల్స్ తప్ప పెద్దగా మనసు విప్పి మాట్లాడింది లేదు ఈ రెండున్నర నెలల్లో. ఒకట్రెండు సార్లు ఏదో పనిమీద వచ్చినప్పుడు మాత్రమే తనను చూసి వెళ్లాడు తప్ప ప్రత్యేకించి తనకోసం వచ్చిందీ లేదు, తను కడుపుతో ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి పంచుకున్న కలలూ లేవు, పెట్టుకున్న ముచ్చట్లూ లేవు!
 ఈ ఆలోచనలతో గతంలోకి వెళ్లిపోయింది మైథిలి!
 
బిడ్డ పుట్టక ముందే... బెదిరింపు!
ఉమ్మడి కుటుంబం. అత్తా, మామ, బావగారు, తోడికోడలు, వాళ్ల ఇద్దరు పిల్లలు, పెళ్లి కావలసిన మరిది, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చిపోయే ఆడబిడ్డ. వీళ్లందరితో కళకళలాడుతూ కనిపించింది ఆ ఇల్లు కొత్త పెళ్లికూతురిగా ఆ గుమ్మంలోకి అడుగుపెట్టిన మైథిలికి. పనులతోపాటు స్నేహాన్నీ పంచుకోవచ్చునుకుంది తోడికోడలుతో. ఆడబిడ్డ తనకూ అక్కయ్య అవుతుందని ఆశపడింది. మరిది తమ్ముడు లేని లోటు తీరుస్తాడని, అత్తామామల పెద్ద దిక్కు నీడలో నిశ్చింతగా ఉండొచ్చు అని ఊహించుకుంది. అయితే ఆర్నెల్లకు అత్తారింటి స్వభావం పూర్తిగా అర్థమైంది. తాను ఊహించుకుంది తలకిందులైంది.

భర్త... తన మాట తప్ప అందరి మాటా వింటాడు. తనకు తప్ప అందరికీ విలువిస్తాడు. పడకగదిలో తప్ప తన గురించి ఆలోచించడు. అప్పుడు కూడా... ఆ ఇంట్లో తనకు జరుగుతున్న అవమానాల గురించి చెప్పినా పట్టించుకోడు. అమ్మ, వదిన, అక్క మాటలకు ఎదురు చెప్పొద్దు అనేవాడు. భర్త దగ్గర ప్రైవసీ కోరుకోవడం కూడా తప్పే ఆ ఇంట్లో. అదీ తన విషయంలో మాత్రమే. ఎందుకో అర్థం కాలేదు. ఈలోపే నెల తప్పింది. విషయం తెలిసిన వెంటనే తన భర్త... ముందుగా వాళ్ల అమ్మానాన్న, అక్క, వదిన మొహంలోకి చూశాడు. వాళ్లు సంతోషంగా కనపడ్డాకే తాను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అదీ వాళ్లతోపాటుగానే. వాళ్లందరి సమక్షంలోనే! కొడుకే పుట్టాలని తనతో ఏవేవో పూజలు చేయించారు. మరి ఆడపిల్ల పుడితే? ఉక్రోషంతో భర్తను అడిగింది ఒకసారి మైథిలి. ‘‘శాశ్వతంగా మీ అమ్మవాళ్లింట్లోనే ఉంటావ్’’ అనేసి వెళ్లిపోయాడు! కంగు తిన్నది మైథిలి. పొగిలి పొగిలి ఏడ్చింది. ‘‘ఏయ్ పిల్లా.. కళ్లనీళ్లేంటి? నీ కూతురును పొగుడుతుంటే మురిసిపోయి వచ్చిన కన్నీళ్లా...’’ వదిన ఆడుతున్న పరాచకానికి చప్పున ఈ లోకంలోకి వచ్చింది మైథిలి.
 
బిడ్డ పుట్టాక... రాకుండా సాధింపు!
మైథిలి తల్లీతండ్రీ, అన్నావదినా.. ఇంటిల్లిపాదీ వెళ్లి మైథిలి అత్తారింటివారిని ఆహ్వానించినా ఉయ్యాల వేడుకకు ఎవ్వరూ రాలేదు. అర్ధరాత్రి వరకూ ఎదురుచూస్తూనే ఉంది మైథిలి. ‘‘నా పిచ్చిగానీ... డెలివరీ అవగానే మహాలక్ష్మి పుట్టిందండీ’’ అంటూ మామయ్య, అత్తయ్యవాళ్లకు నాన్న సంతోషంగా ఫోన్ చేస్తే ‘అవునా’ అని కూడా అనని వాళ్లు, అమ్మాయి పుడితే అక్కడే ఉండాలని అల్టిమేటం ఇచ్చిన భర్త.. కనీసం పుట్టిన పసిగుడ్డును చూడాలనే ఆరాటమైనా లేని భర్త.. ఉయ్యాల ఫంక్షన్‌కు వస్తారని ఎలా అనుకుంది? అత్తారింట్లో పరిస్థితి గురించి అమ్మకు చెపితే... ‘ఓ బిడ్డ పుట్టనీవే అన్నీ సర్దుకుంటాయి..

పుట్టే పిల్ల కేరింతలు అందరినీ మార్చేస్తాయి చూడూ’’ అంటూ ఆశపెట్టింది. హు.. నమ్మడానికి తనకుండొద్దూ.. ఆశకైనా హద్దుండొద్దూ.. అంటూ నిరాశతో తన మీద తనే నిష్ఠూరమాడుకుంది. బాధపడింది.
 పాప ఆలనాపాలనతో మూడు నెలలు గడిచాయి. మూడో నెల దాటకుండానే సారెతో అత్తారింటికి పంపించాలి. ఎన్నిసార్లు కబురుచేసినా వాళ్ల దగ్గర్నుంచి సమాధానం లేదు. వెళ్లి ఆహ్వానించినా స్పందన లేదు!
 
బెదిరింపులకు, సాధింపులకు... ముగింపు
‘‘ఏం చేద్దామనుకుంటున్నావ్?’’ మైథిలిని అడిగాడు వాళ్లన్నయ్య.
 ‘‘తెలీట్లేదన్నయ్యా’’ అంటూ బోరుమంది మైథిలీ. వెంటనే తేరుకొని.. ‘‘అయన మరీ చెడ్డవాడు కాదు... వాళ్ల అమ్మానాన్న, అన్నావదిన, అక్కాబావల మాట వింటాడు అదొక్కటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదన్నయ్యా...’’ అంది.
 ‘‘మరి అదే ఇంటికి మళ్లీ వెళతానంటావా?’’ అన్నాడు.
 ‘‘పాప ఉంది కదా.. అన్నయ్యా.. దాని ఆటపాటలు చూసైనా మారుతాడేమో.. ఒక్క ప్రయత్నం చేస్తా’’ అంది.
 మరునాడే.. మైథిలిని తీసుకొని లాయర్ దగ్గరకు వెళ్లాడు మైథిలి అన్నయ్య. విషయం, మైథిలి ఆశా అర్థమైన లాయర్.. ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్‌జుగల్ రైట్స్’ పిటిషన్ వేయమని సలహా ఇచ్చారు. మైథిలి పిటిషన్ వేసింది. రెండు నెలల్లో మైథిలి బిడ్డతో సహా అత్తారింటికి వెళ్లింది!
- సరస్వతి రమ
 
రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్‌జుగల్ రైట్స్ అంటే?
- ఇ. పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 వైవాహిక లేదా దాంపత్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించినది. సరైన కారణం చూపకుండా భర్త భార్యను గాని, భార్య భర్తను గాని వదిలేసి కాపురానికి తీసుకెళ్లకుండా లేదా కాపురానికి వెళ్లకుండా ఉంటే...  బాధితురాలు లేదా బాధితుడు కోర్టుద్వారా కాపురపు హక్కు డిక్రీని పొందవచ్చు. మైథిలి విషయంలో ఆమె భర్త బలమైన ఏ కారణం లేకుండానే ఆమెను తల్లిగారింట్లో వదిలేశాడు. మైథిలి వేసుకున్న పిటిషన్ ఆధారంగా కోర్టువారు ఆమె భర్తను పిలిపించి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు.

‘‘కుటుంబ సభ్యులను గౌరవించడమంటే భార్యను అగౌరవపరచడం కాదుకదా. ఆడపిల్ల పుట్టిందని, అమ్మ చెప్పిందని భార్యను కాపురానికి తీసుకెళ్లకపోవడమేంటి?’’ అని మైథిలి భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేరు కాపురం పెట్టయినా సరే మైథిలిని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సెక్షన్ స్త్రీలకు ఒక వెసులుబాటునూ ఇస్తోంది. ఒకవేళ కోర్టు ఆదేశాలను భర్త ధిక్కరిస్తే... అంటే డిక్రీ మంజూరైన తర్వాత కూడా యేడాది వరకూ భార్యను కాపురానికి తీసుకెళ్లకపోతే ఆ భార్యకు నష్టపరిహారం తీసుకునే హక్కును,  భర్త ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌ను కోరే వీలునూ కల్పిస్తోంది ఈ సెక్షన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement