డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 26 ఏళ్లు. వాతావరణం మారినప్పుడల్లా నా చర్మం కాస్త డల్‌గా అనిపిస్తోంది. నా చర్మం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండటానికి తగిన సూచనలు ఇవ్వండి. – వి. జయశ్రీ, విశాఖపట్నం
శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేహాన్ని కప్పి ఉంచే రక్షణ కవచం వంటిది. బయటి నుంచి వచ్చే ప్రతి ప్రభావాన్నీ, ఒత్తిడిని ముందుగా భరించేది చర్మమే. చర్మం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది. అది... సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం, కాంబినేషన్ చర్మం. పొడిచర్మం సాధారణంగా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటి చర్మతత్వం కలిగిన వారిలో ముడుతలు త్వరగా వస్తాయి. వీళ్లు తప్పనిసరిగా చర్మంలోని తేమను నిలిపి ఉంచడం కోసం మాయిశ్చరైజర్లను వాడాలి. జిడ్డు చర్మం ఉన్నవారి మేను కాస్తంత జిడ్డుగా ఉంటుంది. వీళ్లలో చర్మరంధ్రాలు కాస్తంత స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. కొంతమందిలో మొటిమలు రావడం కూడా చాలా సాధారణం. కాంబినేషన్ చర్మం ఉన్నవారిలో ముఖంలోని కొన్ని భాగాలు... ముఖ్యంగా బుగ్గల్లోని కొంతభాగం, ముక్కు, గడ్డం వంటివి జిడ్డుగా కనిపిస్తుంటాయి. మిగతా భాగాలు పొడిబారినట్లుగా ఉంటాయి. సాధారణ చర్మం కలిగిన వారిలో మరీ జిడ్డుగానూ, మరీ పొడిగానూ లేకుండా చర్మం సాధారణంగా ఉంటుంది.
చర్మ సంరక్షణ కోసం కొన్ని సూచనలు...
∙పొడి చర్మం ఉన్న వారికి చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో కొంచెం సమస్యలు తక్కువేనని చెప్పాలి. అయినప్పటికీ వీళ్లు మాయిశ్చరైజర్లు వాడటం మాత్రం మానకూడదు. ఎస్‌పీఎఫ్ 30 కలిగిన సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరి.
∙జిడ్డు చర్మం కలిగిన వారికి ఎండాకాలంలో చర్మంపై జిడ్డు పెరిగినట్లుగా ఉంటుంది. చెమట పట్టడం వల్ల సమస్య మరింత ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. వీరు ఎక్కువగా వేడిమి ఉన్న వాతావరణంలో తరచూ ముఖం నీటితో కడుక్కుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ బేస్‌డ్ మాయిశ్చరైజర్లు వాడాలి.
∙ఇక ఏరకమైన చర్మం ఉన్నవారైనా నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటి పాళ్లు ఎక్కువగా ఉండే పుచ్చపండ్ల వంటి తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సమతులమైన ఆహారం తీసుకోవాలి.
ప్రైవేట్‌పార్ట్స్‌లో నలుపు, ఎరుపు మచ్చలు...
నా వయసు 37 ఏళ్లు. బైక్‌పై ఆఫీసుకు వస్తుంటాను. ఇటీవల వారం పాటు వర్షాలు పడ్డప్పుడు అండర్‌వేర్ తడిసింది. దాంతో తడిగా ఉన్న అండర్‌వేర్‌నే తొడుక్కొని వస్తున్నాను. రెండు మూడు రోజులుగా నడుము కింద చోట చర్మం మడతలు పడే ప్రదేశాల్లో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – సుభాష్, హైదరాబాద్
మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్–100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. తడి అండర్‌వేర్‌ను ఎప్పుడూ ధరించవద్దు.
మీసాలలో దురద... పరిష్కారం సూచించండి
నా వయసు 29 ఏళ్లు. నాకు ప్రతిరోజూ మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. డేవిడ్, ఖమ్మం
మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మీ మీసాలు ఉన్న చోట సెబమ్ అనే నూనె వంటి దాన్ని ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల వచ్చే సమస్య. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి.
∙మొమటోజోన్‌తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
∙మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి.
ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి... తగ్గేదెలా?
నా వయసు 15 ఏళ్లు. నాకు ముఖం నిండా మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి తగ్గేదెలా? – నివేదిత, తాడేపల్లిగూడెం
మీలాంటి టీనేజీ యువతీయువకుల్లో సాధారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment