
ఇచట వృద్ధాప్యం అమ్మబడును...
సాంకేతికం
అవును. మీరు చదివింది నిజమే. స్పెషల్ డిజైన్డ్ ఏజింగ్ సూట్‌ను కొంటే చాలు వృద్ధాప్యాన్ని కొన్నట్లే. ఈ ప్రత్యేకమైన దుస్తువులతో స్వయంగా వృద్ధాప్య సమస్యలను తెలుసుకోవచ్చు. మన వయసును చా...లా ముందుకు జరుపుకోవచ్చు.
‘‘నా వయసు 50 సంవత్సరాలు. స్పెషల్ డిజైన్డ్ ఏజింగ్ సూట్ ధరించగానే 80 సంవత్సరాల స్త్రీ దేహంలోకి ప్రవేశించినట్లయింది’’ అని ఆశ్చర్యంగా చెబుతోంది అమెడ అనే బ్యాంకు ఉద్యోగి. వృద్ధాప్యపు బాధలను అర్థం చేసుకోవడం ద్వారా వృద్ధులను సరిగా చూసుకోగలమనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. దీన్ని మిడ్ యార్క్‌షైర్ హాస్పిటల్స్ (ఇంగ్లండ్)లో పనిచేసే వైద్యబృందం తయారుచేసింది. వినికిడి, మతిమరుపు, దృష్టికి సంబంధించినవి మాత్రమే కాకుండా రకరకాల సమస్యలు ఈ సూట్ ద్వారా అనుభవంలోకి వస్తాయి.
ఇప్పుడు ఏజింగ్ సూట్‌కు ఎంత డిమాండ్ పెరిగిందంటే గరీబు నుంచి అమీర్ వరకు అందరూ దీన్ని ధరించడానికి తహతహలాడుతున్నారు. ‘‘ఇది వినోదం కోసం మాత్రం కాదు..’’ అంటున్నారు వైద్యులు. కొందరు వినోదం కోసం ఈ సూట్ ధరించినా ఆ తరువాత మాత్రం వారి వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చిందట. వృద్ధుల మీద సానుభూతి పెరిగిందట.
మరి మన దేశానికి ఎప్పుడొస్తుందో!