ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన?
►జెన్‌పథం సంపూర్ణ జ్ఞానం
అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.
అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరం అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానించి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది.
ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.
స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘వివాహం జరిగి తల్లి అయిన తరువాత క్షీరమునిచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు.
అలా ఎందుకు చేశావని అడిగాడు గురువు. ‘‘తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్పయ్రోజనమో నాకు అర్థమయింది స్వామీ..!’’ అన్నాడా భిక్షువు.
‘‘బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా‘ అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు.
ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన?
కోర్కెల సాఫల్యం కోసం వివిధ దేవతా పూజలను చేయడమనేది వేదకాలం నుంచి ఉన్న ఆచారమే. ఉదాహరణకు చదువు బాగా రావాలనే కోర్కె సిద్ధించాలంటే సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణీ ఆరాధించాలంటారు ఆర్యులు. పుత్రసంతానాన్ని పొందేందుకు దక్షుడు మొదలైన ప్రజాపతులను ఆరాధించాలి. సంతాన ప్రాప్తికి ఆది దంపతులైన శివపార్వతులలో పార్వతీదేవిని ఆరాధిస్తే దాంపత్య సౌఖ్యం దక్కుతుందట. విద్యాబుద్ధులు రావాలంటే దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. సౌందర్యం సిద్ధించాలంటే చంద్రుణ్ణి ఆరాధన చేయాలంటోంది శాస్త్రం. అన్నం కలకాలం ప్రాప్తించాలంటే అదితి, అన్నపూర్ణాదేవిల ఆరాధన చేయాలి. వైభోగ ప్రాప్తికి ఇంద్రుణ్ణి ఆరాధించాలి. కష్టాలు తొలగేందుకు దుర్గాదేవిని, నిత్యసౌభాగ్యాన్ని అందించేందుకు ఆదిముల్తైదువ పార్వతీదేవిని, బలానికి వాయుదేవుణ్ణి, వీర్యపుష్టికి అగ్నిదేవుణ్ణీ, ఆరోగ్యానికి సూర్యభగవానుడినీ, ఆయుర్దాయం కోసం అశ్వినీ దేవతలనీ, పరమశివుణ్ణీ; ధర్మం తప్పకుండా ఉండాలనే కోర్కెను నారాయణమూర్తినీ పూజించాలి. ఈ విధంగా వివిధ కోర్కెలకు వివిధ దేవతా రూపాలను ఆరాధించడం వల్ల శీఘ్రంగా నెరవేరతాయని శాస్త్రోక్తి.
పూజలలో కలశం ఎందుకు?
మనం ఏ పూజ, నోము లేదా వ్రతం చేసుకున్నా కలశం తప్పనిసరిగా పెడతాం. ఈ కలశంలోని నీటినే మనం పూజించే దైవానికి సమర్పించే అర్ఘ్యపాద్య అభిషేకాదులకు ఉపయోగిస్తాం. ఎందుకంటే భగవంతునికి సమర్పించే నీరు పవిత్రంగా ఉండాలి కాబట్టి పుణ్యతీర్థాల నుంచి తెస్తే మంచిది. లేదంటే మనకు లభించిన నీటినే ఒక పాత్రలో ఉంచి, ఆ కలశానికి పూజ చేసి ఆయా దేవతలను ఆహ్వానించడం ద్వారా ఆ జలాన్ని పవిత్రీకరణ గావించి భగవంతునికి చేసే ఉపచారాలలో వాడటం శ్రేష్ఠం. నిత్యపూజావిధానంలో కలశంలోని జలంలోనికి త్రిమూర్తులను, మాతృగణాలను, సప్తసాగరాలను, సప్తద్వీపాలతో కూడిన భూ మండలాన్ని, చతుర్వేదాలను, వేదాంగాలను ఆహ్వానిస్తారు. కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో అర్చించి, ఈ నీటిని పవిత్రీకరణ గావించి, ఆ జలాన్ని పూజాద్రవ్యాలపైన, తమపైన, దేవతా విగ్రహాలపైనా సంప్రోక్షణ చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల శుద్ధి చేసినట్లేనని శాస్త్రం చెబుతోంది.
⇒ మనం పూజ చేసేటప్పుడు ఆచమనం చేసే పాత్ర, దేవతలకు ఉపచారాలు చేయడం కోసం ఉపయోగించే పాత్ర వేర్వేరుగా ఉండాలి. మనం వాడుకున్న పాత్రలోని నీటిని భగవంతుని కలశానికి వాడరాదు.
జపమాలకు108 పూసలేఎందుకు?
అష్టోత్తర శతం అని అంటూ ఉంటాం కదా, అష్ట అంటే ఎనిమిది. ఉత్తరం అంటే ఎక్కువయినదని అర్థం. శతం అంటే వంద. ఎనిమిది ఎక్కువైన వంద అంటే నూట ఎనిమిది. వేదంలో 108వ మంత్రం, 116వ మంత్రం పరమేశ్వరుణ్ణి నేరుగా సంబోధించి చెప్పే మంత్రం. ఆ కారణంగా ఆ సంఖ్యలలో 108 పరమేశ్వర సన్నిధానానికి చేర్చగలిగిన శక్తి ఉన్నదని, ఇక 116 అనేది గురువుకి దక్షిణ ఇచ్చే సందర్భంగా చదివే మంత్రం కాబట్టి, నూట పదహారు పండిత దక్షిణ అనీ ఓ పద్ధతి వచ్చింది. 108... పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగిన మంత్ర సంఖ్య. అలాగే 108 పురాణాలు, 108 ఉపనిషత్తులున్నాయి. గ్రహాల సంఖ్యను రాశుల సంఖ్యతో హెచ్చిస్తే 108. నాడులు 108, శక్తి పీఠాలు 108... ఇలా 108 అంకెకు విశిష్టత ఉంది కాబట్టే జపమాలలో పూసలు 108గా పెద్దలు నిశ్చయించి ఉండవచ్చు.
నమస్కారంలోని గొప్పతనం ఏమిటి?
అయిదువేళ్లలో మనకి దగ్గరగా ఉండే బొటనవేలు. మన దగ్గరి వాళ్లకి మంచి జరగాలని, కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చెబుతుంది. మనకి మార్గదర్శకులై, విద్యాబుద్ధులు నేర్పి, చక్కటి సలహాలిచ్చిన ఉపాధ్యాయులకి, మన ఆరోగ్యం తప్పుదారి పడితే దాన్ని సక్రమమార్గంలోకి తెచ్చే వైద్యులకు మంచి జరగాలని, వారి కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చూపుడు వేలు చెబుతుంది. తర్వాతి వేలు, అతిపెద్దదైన మధ్యవేలు... మన మతపెద్దలు, నాయకులు మహాత్ములకి మంచి జరగాలని గుర్తు చేస్తుంది. నాలుగోవేలు ఉంగరపు వేలు, అతి బలహీనమైన వేలు. హార్మోని, పియానో వాయించేవారికి ఇది తెలుస్తుంది.
ప్రపంచంలోని బలహీనులు, పేదలు, రోగగ్రస్థులు, బాధల్లో ఉన్నవారి కష్టాలు తొలగిపోయి, శుభం చేకూరాలని ప్రార్థిస్తుంది. చివరగా చిటికెనవేలు, దేవుడి ముందు మనం ఎంతో చిన్నవాళ్లమని, అవతలివారికన్నా మనం అల్పులమని, కాబట్టి మనకన్నా ఉన్నతుడైన దేవుణ్ణి ప్రార్థించాలని గుర్తు చేస్తుంది. నమస్కారం ద్వారా మన వేళ్ల చివరలనున్న నాడులు చైతన్యవంతమవుతాయి. అవతలివారి పట్ల గౌరవం, వారు చెప్పేమాటలపై శ్రద్ధ, సావధానమూ కలుగుతాయి.
సర్వం సాయిమయం!
శిరిడీలో ఒక గజ్జి కుక్క ఉండేది. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జికుక్క ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండుమూడుసార్లు దానిని అదిలించాడు. అయినా అది వెనుకే రావటంతో విసుగెత్తి కర్రతో కొట్టాడు. ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘మహల్సా!’ పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తుంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది? అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ.
మౌనమేమంచి జ్ఞానసాధనం
⇒ భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి సరళమైన మార్గం మౌనమే అని తన జీవితం ద్వారా నిరూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. ఆయన బోధలు...
⇒ మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు.
⇒ ‘నేను’ అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది.
⇒ గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమరూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా.
⇒ మౌనంలోనే సాధకుని ప్రార్థన సైతం పరాకాష్ఠకు చేరుతుంది.
⇒ అన్ని దీక్షలకంటే మౌనదీక్ష ప్రశస్తమైంది. అదే అన్ని దీక్షలకు మూలం.
⇒ గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది
ఉత్తమమైనదానం
అన్నదానానికి మించిన దానం ముల్లోకాల్లోనూ లేనేలేదని ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏ వస్తువుని దానం చేసినా ‘మరికొంత ఇస్తే బాగుండేది– ఇంకా కొద్ది విలువైనదిస్తే చక్కగా ఉండేది’ అనే అభిప్రాయం కలగవచ్చునేమో కాని అన్నం వడ్డించడం ఆరంభిస్తే ‘ఇంక చాలు, వద్దు వద్దు’ అంటారట. అన్నం వద్దు, పప్పు వెయ్యద్దు, పులుసు చాలు, సరిపోయింది, పెరుగుకి ఖాళీయే లేదు అంటారు. అంటే కడుపు నిండిపోయిన సంతృప్త భావన కలుగుతుంది. మిగిలిన ఏ దానానికీ ఈ విధమైన భావన కలగదు. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయాలలోనూ, యాత్రాస్థలాలలోనూ అన్నదానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
– యామిజాల జగదీశ్