శివ ఆ పేరు ఎందుకు పెట్టిందో వాళ్ల అమ్మ...
శివుడు విషం కంఠంలో దాచుకున్నట్టే
ఇతను కష్టం గొంతు దాటనివ్వలేదు.
రక్తం కక్కాడు కానీ నిజం బయట పడనివ్వలేదు.
ప్రేమ ఇచ్చాడు కానీ బాధ పంచుకోలేదు.
పేగుబంధానికి ప్రాణం పోశాడు కానీ,
పేగు పంచుకున్న వారికి నష్టం రానివ్వలేదు.
ఉరిపోసుకున్నాడు కానీ
అడిగుంటే మా ఆయుష్షు పోసుకునేవాడు.
పెద్ద జబ్బు వస్తే పేద కుటుంబాలు అల్లాడిపోతాయ్. శివ తన కుటుంబంపై ఆర్థిక భారం మోపకూడదని చివరిక్షణాలు
అమ్మ వొడిలో, కుటుంబం సడిలో గడిపి సూసైడ్ చేసుకున్నాడు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, గొప్ప మనసు ఉన్నవారు ఎందరో శివను కాపాడుకునేవారేమో! అది తెలియక, చెప్పే వాళ్లు లేక శివలాంటి వాళ్లు ఎందరో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సంఘటన మనందరిని మేలుకునేలా చేస్తుందని మేం నమ్ముతున్నాం.
అమ్మంటే ప్రాణం
కర్నూలు జిల్లా ఆదోని. దిబ్బనకల్ గ్రామంలో రవి, జయంతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడి పేరు శివ. కిందటి నెల 16వ తారీఖుకి పద్దెనిమిది వెళ్లి పంతొమ్మిది వచ్చాయి.
శివ తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మిషన్ కుట్టి, భర్త సంపాదనకు తన సంపాదన జోడించి పిల్లలను
చదివిస్తోంది. ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు, పిల్లలు తప్ప. శివకుమార్ కర్నూల్ పాలిటెక్నికల్ కాలేజీలో కంప్యూటర్ కోర్సు పూర్తి చేశాడు. మిగతా పిల్లలిద్దరివీ ఇంకా స్కూల్ చదువులే. కోర్సు పూర్తవగానే శివకుమార్ ‘ఇన్నాళ్లూ అమ్మ, నువ్వు మా కోసం రెక్కలు ముక్కలు
చేసుకుంటూనే ఉన్నారు. నేను పట్నం వెళ్లి బాగా సంపాదిస్తా.
కుటుంబాన్ని పోషిస్తా, మీ కష్టాలన్నీ తీరుస్తా. అమ్మకు గుండాపరేషన్ చేయిస్తా’ అని పట్నం బస్సెక్కాడు. పట్నంలో ఓ ప్రయివేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. నెలకు ఏడున్నర వేలు జీతం. అందులో నాలుగు వేలు ఇంటికే పంపించేవాడు. ‘ఇంకో ఆరునెలలు పోతే జీతం పెరుగుద్ది. ఇంకా డబ్బులు పంపిస్తా. నువ్వు మిషన్ కుట్టుడు మానేయ్’మని తల్లికి ఎప్పుడూ ఫోన్లో చెప్పేవాడు.
బెంగపడ్డాడు... బోరుమన్నాడు
చూస్తుండగానే పదినెలలు గడిచిపోయాయి. వారం రోజులుగా ఫోన్ చెయ్యని కొడుకు ఓ రోజు ఫోన్ చేసి ‘అమ్మా. ఇక్కడ కంపెనీలో పని లేదు. భోజనానికి కష్టమైపోతుంది. ఊరొచ్చేస్తానే’ అన్నాడు. ‘అయ్యో. ఎందుకురా అంత డీలా పడిపోతావ్. ఉన్న చోటనే ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం రా. మీ నాయిన కూడా అదే చెబుతున్నడు. ఇంకేమీ ఆలోచించక వెంటనే బస్సెక్కు’ అని చెప్పింది ఆ తల్లి. అనుకున్నట్టుగానే శివ ఊరు చేరుకున్నాడు. అమ్మను నాన్నను తమ్ముడిని చెల్లెలి చూడగానే ఒక్కసారిగా వాళ్లను వాటేసుకొని
బోరుమన్నాడు. అందరూ కంగారుపడిపోయారు. ‘ఏమైందిరా..’ అంటే ‘ఇన్నాళ్లూ మీకు దూరంగా ఉన్నా కదా! అందుకే’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ. ఆకలేస్తుందని కావల్సివన్నీ చేయించుకున్నాడు అమ్మతో. ఆబగా తిన్నాడు. ‘పిల్లవాడికి ఇల్లు మనాది పట్టుకుంది. ఇంకెక్కడికీ వెళ్లకురా’ అన్నాడు తండ్రి.’ ‘సరే’ అన్నాడు శివ.
జన్మజన్మలకు గుర్తుంటుంది అమ్మ
అమ్మ ఏదైనా పని చేస్తుంటే ఆమెతో పాటే తిరిగేవాడు. సాయంకాలం తమ్ముడు, చెల్లెలితో షికార్లకని వెళ్లేవాడు. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేవాడు. పుట్టిన రోజున హుషారు అంతా ఇంతా కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి, అమ్మ చేత పాయసం చేయించుకొని ‘నీ చేతి రుచి జన్మ జన్మలకూ గుర్తుంటుంది అమ్మ’ అన్నాడు. అమ్మానాయిన కాళ్లకు మొక్కాడు. ‘నూరేళ్లు చల్లగా బతకరా తండ్రీ’ అని దీవించారు తల్లీతండ్రీ. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ తల్లిదండ్రులని హత్తుకుపోయాడు. కొత్త బట్టలు కొనుక్కోమని తల్లి డబ్బులు ఇస్తే ‘వద్దులే అమ్మా! అనవసరపు ఖర్చు... నీ ప్రేమ చాలు’ అన్నాడు. చిన్నాయనలను కలిసొస్తానని చెప్పి అందరిళ్లకూ వెళ్లి చాక్లెట్లు పంచి వచ్చాడు. సినిమా చూసొద్దామని ఇంటిల్లిపాదినీ తీసుకెళ్లాడు. ఎప్పుడైనా పొరపాటున కొడుకును
పనికోసం వెళ్లమని భార్య అంటుందేమో అని ‘ఎండలు తగ్గేదాక ఇంట్లనే ఉండనియ్యి. తర్వాత వాడే ఏదో పని చేసుకుంటాడులే’
అనేవాడు తండ్రి. వారి మీద ఎండ పడినా భరించలేరే... అలాంటిది మృత్యువే పడితే...
ఐదు రోజుల క్రితం
ఆ ఇంట్లో చీకటి ముసురుకుంది. రెండు నెలల పాటు తమను ఆనందపెడుతూ తను సంబరంగా ఉన్న కొడుకు ఉరివేసుకుని
నిర్జీవంగా కనిపించాడు. ఇంటిల్లిపాదీ హతాశులయ్యారు. తమ గారాల బిడ్డ తమనెందుకిలా అన్యాయం చేశాడో అంతుచిక్కక కాసేపు
పిచ్చివాళ్లయ్యారు. విషయం తెలిసి తల్లిడిల్లిపోయారు. శివకుమార్ రాసిన చివరి ఉత్తరం వారి కంటపడింది. అందులో...
అమ్మా, నాన్న! పట్నంలో ఉన్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్‌కు చూపించుకున్నాను... బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని, అయినా బతకడం కష్టమని వైద్యులు చె ప్పారు. వైద్యం చేయించుకునేంత డబ్బు నా దగ్గర లేదు. ఈ విషయం మీకు తెలిస్తే ఏమైపోతారో అని భయం. పైగా నా వైద్యం కోసం మీరు ఎన్ని అప్పులు చేస్తారో.. తమ్ముడు, చెల్లెలి చదువులు ఆగిపోతాయేమో.. మన కుటుంబం రోడ్డున పడుతుందేమో... ఇది తలుచుకుంటే దుఃఖం ఆగడం లేదు. ఇన్నాళ్లూ కడుపునొప్పి, నోట్లో నుంచి రక్తం వస్తుంటే మందులు తింటూ కాలం గడిపాను. నాకు రోజులు దగ్గరపడ్డాయని అర్థమైంది. ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో పట్నంలో ఉండలేక ఊరొచ్చాను. ఈ చివరి రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశ. కానీ, బాధ నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. భరించలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఎవ్వరూ నా కోసం బాధపడవద్దు. ఇంతటితో మీతో నా రుణం తీరింది.
ఇట్లు.. మీ శివకుమార్
తల్లిదండ్రికి ఏమీ అర్థం కాలేదు. శివకుమార్ మరణించి ఐదు రోజులయ్యాయి. తమ కోసం బిడ్డ ఆలోచించిన తీరుకు కరిగి నీరవుతున్నారు ఆ తల్ల్లీ తండ్రీ. ముందే విషయం తెలిస్తే యములోరితో పోరాడైనా కొడుకును బతికించుకొనేవారం కదా! అని కుమలిపోతునే ఉన్నారు.
ఇంకో శివ బూడిద కాకూడదు...
ఎంతటి విషమ పరిస్థితి వచ్చినా పోరాడవచ్చు అనే ధైర్యం ప్రతి ఒక్కరికీ ఈ సమాజం నుంచి అందాలని హెచ్చరిస్తున్న సంఘటన ఇది. వ్యక్తికష్టం సమాజకష్టం అయినప్పుడే ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవు.
- నిర్మలా రెడ్డి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
ఇన్‌పుట్స్: డి. చంద్రశేఖర్, ఆదోని రూరల్, సాక్షి
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అంటే చాలా మంది వెనకడుగు వేస్తారు కానీ మా దగ్గర కార్పోరేట్ ఆసుపత్రులకు దీటైన చికిత్స ఉంది. అనుభవం ఉన్న వైద్యులతో, అత్యుత్తమ ఆధునిక పరికరాలతో అన్ని రకాల క్యాన్సర్‌లకు పూర్తి ఉచితంగా చికిత్స లభిస్తుంది. అంతేకాదు, జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం వచ్చేవారికి ప్రయాణ ఛార్జీలు ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది.
- డా.రమేష్ మాటూరి, అసోసియేట్ ప్రొఫెసర్,
ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్
కాన్సర్‌లలో వందల రకాలున్నాయి. వీటి బారిన పడి నయమైనవారి కథనాలతో పాటు, అవగాహన సదస్సులూ నిర్వహిస్తుంటాం.
లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)కు చికిత్స అందుబాటులో ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స లభిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్ నుంచి క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇస్తుంది. వచ్చే నెల (జూన్)1వ తారీఖున క్యాన్సర్ అవగాహన సదస్సు ఆసుపత్రిలో జరుపుతున్నాం.
- డా. పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, డెరైక్టర్,
అపోలో క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్
క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఉంది. క్యాన్సర్‌కు సరైన వైద్యం హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రోగులకు హైదరాబాద్‌లోనూ వైద్యం లభిస్తుంది. ఎన్టీఆర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యసేవ కింద క్యాన్సర్ తీవ్రత లేదా జబ్బు రకాన్ని బట్టి రేటు నిర్ణయించి ఉంది. అంతకు మించి ఖర్చయినా తగిన కారణాలు చూపిస్తే అదనంగా డబ్బులు మంజూరు చేసే అవకాశం ఉంది.
- డా.శాంతారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్
పిల్లలు వాస్తవ జీవితానికి దూరమైపోతున్నారు. ఏదైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియజెప్పడం కూడా అవసరం. సమస్య ఏదైనా వచ్చినప్పుడు పెద్దల సాయం తీసుకోమనాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో ఏదో రూపంలో మాటలు, ప్రవర్తన ద్వారా తెలియజేస్తుంటారు. వారి ప్రవర్తన సాధారణంగా కంటే పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తే వెంటనే మానసిక వైద్యుల సలహా తీసుకోవాలి. కొందరిలో అత్యంత సాధారణ ప్రవర్తనతో ఉంటారు. లేదంటే బాహ్యప్రపంచంతో పూర్తిగా డిస్‌కనెక్ట్ అయిపోతారు. ఇవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. - డా.గీతా చల్లా, సైకియాట్రిస్ట్