హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య కాలంలో ఐదు కేజీల వరకు బరువు పెరిగాను. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకొని డాక్టర్‌ను కలవమని ఫ్రెండ్స్ అంటున్నారు. అసలు లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి? హోమియో మందుల ద్వారా కొవ్వులు ఎక్కువగా ఉన్న స్థితిని నయం చేసుకోడానికి మార్గం ఉందా? – సుదర్శన్, రేణిగుంట
లిపిడ్స్ అనేవి కొన్ని రకాల కొవ్వులు, కొవ్వులాంటి పదార్థాలు. సాధారణంగా కొవ్వులు శక్తి కోసం అవసరం. కొలెస్ట్రాల్ వంటి కొవ్వు కూడా కొంతవరకు మంచి ఆరోగ్యానికి అవసరం. అయితే ఇటీవల మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక–శారీరక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జీవక్రియలలో మార్పుల వల్ల మనలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. జీవన విధానంలో కృత్రిమ ఆహారాలు తీసుకోవడం, మద్యపానం వంటి అలవాట్లుతోనూ, శారీరక శ్రమ తగ్గడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసమతౌల్యత ఏర్పడుతోంది. కొవ్వుల పాళ్లు పెరిగిపోయి అవి అనేక అనారోగ్యాలకూ, అనర్థాలకూ కారణమవుతున్నాయి. లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష ... ఎల్‌డీఎల్ అనే చెడు కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అనే హానికారక కొవ్వులు, హెచ్‌డీఎల్ అనే మంచి కొవ్వులు ఎంతెంత పాళ్లలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
కొన్ని రకాల కొవ్వులు... అవి ఉండాల్సిన పాళ్లు
∙హైడెన్సిటీ లైపో ప్రోటీన్ (హెచ్‌డీఎల్): సాధారణంగా దీన్ని మంచి కొవ్వు అనీ, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుగా చెబుతారు. దీని సాధారణ విలువ 40 ఎంజీ/డీఎల్ నుంచి 60 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. ఆరోగ్యకరమైన పాళ్లలో ఉన్నప్పుడు ఇది రక్తనాళాల్లోకి కొవ్వును చేరకుండా నిరోధిస్తుంది. అక్కడి నుంచి తొలగించి, ఆ కొవ్వు అంతా కాలేయంలోకి వెళ్లేలా చేస్తుంది.
లో డెన్సిటీ లైపో ప్రోటీన్ (ఎల్‌డీఎల్): దీన్ని చెడుకొవ్వుగా పేర్కొంటారు. దీని సాధారణ విలువ 140–150 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు.
ట్రైగ్లిజరైడ్స్: ఇది కూడా హానికారకమైన కొవ్వే. దీని పాళ్లు 150 ఎంజీ/డీఎల్ వరకు ఉండవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో మొత్తం ఏడు అంశాలు ఉంటాయి. అవి... 1. మొత్తం లిపిడ్స్ 2. సీరమ్ టోటల్ కొలెస్ట్రాల్ 3. సీరమ్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ 4. టోటల్ కొలెస్ట్రాల్ / హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ నిష్పత్తి 5. సీరమ్ ట్రైగ్లిజరైడ్స్ 6. సీరమ్ ఫాస్ఫో లిపిడ్స్ 7. విద్యుత్ అంశీకరణ... దీని వల్ల ఈ కింది అంశాల శాతాన్ని నిర్ణయిస్తారు. అవి... ∙కైలో మైక్రాన్స్ ∙లో డెన్సిటీ లైపోప్రోటీన్ ∙చాలా తక్కువ సాంద్రత (వీఎల్‌డీఎల్) ∙హైడెన్సిటీ లైపో ప్రోటీన్.
చికిత్స: అధిక కొవ్వులను తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సాధారణమైన మందులలో... కాల్కేరియా కార్బ్, ఫైటోలిక్కా, కొలెస్ట్రినమ్, గ్రాఫైటిస్, కాక్టస్, రావుల్ఫియా సర్పెంటీనా వంటివి కొన్ని మాత్రమే. ఇవే కాకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలో సరైన హోమియో మందులను క్రమం తప్పకుండా వాడితే మీ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ఎందుకు?
Published Tue, Apr 25 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
Advertisement