భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ! | Wife also is similar to the life-saving | Sakshi
Sakshi News home page

భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ!

Published Wed, Jun 25 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ!

భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ!

పెళ్లి మీద ఉన్నన్ని జోకులు, పెళ్లి పైన ఉన్నంత ఆసక్తి మరెక్కడా, ఎవరికీ ఏ అంశంలోనూ ఉండవు. ఒకే విషయంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు పెళ్లి విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటికీ కారణం - ‘ఆమె’. అసలు పెళ్లంటే... మగాడు తన బ్యాచిలర్ డిగ్రీని పోగొట్టుకుని, భార్య తన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందడమే అంటుంటారు. కానీ, గమనిస్తే, ‘పొదుపు’ అంత మంచిది, అంత ఉపయోగకరమైనది - ‘భార్య’. ఈ విచిత్రమైన పోలిక... వెనక ఉన్న కథాకమామిషు!
 
ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది.
 
పొదుపు చేయడం ఓ యజ్ఞం. అందరూ చేయాలనుకుని, కొందరు ఆసక్తితో, ఇంకొందరు అవసరంతో, మరికొందరు అవగాహనతో చేసే పని. సరిగ్గా పెళ్లి కూడా అలాంటిదే. భార్యకు -పొదుపుకు అనేక పోలికలున్నాయి.

మొదటి దశ

పెళ్లయినప్పటి తొలినాళ్ల లాగే మొదలుపెట్టినప్పుడు పొదుపు చాలా ఆసక్తితో క్రమబద్ధంగా చేస్తాం.  ఆర్థికంగా ఏ ఇబ్బందులూ లేనపుడే కదా సాధారణంగా పొదుపు మొదలుపెడతాం. కాబట్టి, నెలనెలా ఠంచనుగా పొదుపు ఖాతాలోకి డబ్బులు మళ్లిస్తాం. ప్రతి నెలా ఓ ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ఓ ఆరునెలలు గడిస్తేనే... ‘అబ్బో అప్పుడే ఆరునెలలు పొదుపు చేసేశానే’ అనుకుని సంబర పడతాం.
 పెళ్లయిన కొత్తలో దశ కూడా ఇంతే. ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా వస్తాం. అడిగిందే తడవుగా అడిగినవన్నీ సమకూరుస్తాం. భార్యపై ఎక్కడ లేని ప్రేమాభిమానాలుంటాయి. ప్రతి నెలా ఎంతో కాలం కలిసి ఉన్నట్లు లేత జ్ఞాపకాలు తలచుకుంటూ సంబర పడిపోతాం. అలా, వేగంగా, హాయిగా జీవితం గడుస్తుంది. భార్యపై అపారమైన ప్రేమ ఉంటుంది.

మధ్య దశ

పొదుపు ఖాతాలోకి ఎంతో కాలం నుంచి డబ్బులు వేస్తూ ఉంటాం. మధ్యలో డబ్బు అవసరాలు పెరుగుతుంటాయి. పొదుపు ఆపలేం. నానా ఇబ్బందులు పడి పొదుపు చేయక తప్పదు. ఎన్నాళ్లింకా పొదుపు చేయాలని చిరాకు వస్తుంది. మధ్యలో ఆపేద్దామా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో వచ్చే లాభాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే ఎంతో కాలం నుంచి చేస్తుంటాం, ఇంకా ఎంతో కాలం చేయాల్సి ఉంది. దీంతో చచ్చీచెడీ ఆ పొదుపు కొనసాగిస్తాం.

 సరిగ్గా పెళ్లి పాతబడ్డాక... ప్రేమను రెండోస్థానంలోకి నెట్టేసి బాధ్యతలు మొదటి స్థానంలోకి వస్తాయి. ఆమె వల్లే కలిగే మేలు, దక్కే ప్రేమ కంటే కుటుంబ బాధ్యతలు నిరంతరం వెంటాడుతుంటాయి. ఈ పెళ్లీ వద్దు, పెళ్లామూ వద్దు ఈ కష్టాలూ వద్దనిపిస్తుంది. కాస్త భారంగా జీవితం నడుస్తుంటుంది.

చివరి దశ

క్రమం తప్పకుండా చేసిన పొదుపు ఖాతా అలా పెరిగి పెరిగి ఓ పెద్ద సొమ్ము జమ అవుతుంది. కష్టాలు పడితే పడ్డాం కానీ కష్టకాలంలో ఆదుకుంటోంది. అవసరానికి అక్కరకు వచ్చింది అనిపిస్తుంది. మన మీద మనకు ప్రశంస, అందివచ్చే సొమ్ముపై ఆశ తలెత్తుతాయి. ఇక అది చేతికి అందినప్పుడు ఆ ఆనందం చెప్పలేనిది.

 ఇక జీవితం విషయానికి వస్తే... వెనక్కు తిరిగి చూసుకుంటే ఆమె లాగా నిరంతరం ఎవరూ మన వెంట నడవలేదని గుర్తుకువస్తుంది. రోజురోజుకూ ఆమెపై ఆధారపడటం పెరుగుతూ వచ్చి ఆమె లేనిదే జీవితం లేదనిపిస్తుంది. ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది.

 భార్యను జీవిత భాగస్వామి అని ఊరకే అనలేదు. ఆమె భాగస్వామ్యం - ఆస్తులు, సుఖాల్లోనే కాదు కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య బాధల్లో. అన్నింటిలో అండగా ఉండే భార్య ఎప్పటికీ భారం కాదు, బాధ్యత! అందుకే, అది సెవెన్ ఇయర్స్ ఇచ్ కాదు, సెవెంటీ ఇయర్స్ బ్యూటిఫుల్ లైఫ్!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement