తడిజుట్టుతో తిరిగితే జలుబు చేస్తుందా?
జలుబుకి సంబంధించి బాగా ప్రచారంలో ఉన్న అనేక మూఢనమ్మకాల్లో తడి జుట్టుతో బయట తిరిగితే జలుబు చేస్తుందనేది కూడా ఉంది. అంతేకాదు, తలంటు స్నానం చేసిన వెంటనే జుట్టు తుడిచి ఆరబెట్టుకోకపోయినా జలుబు చేస్తుందనే నమ్మకమూ జనంలో ఉంది. వానలో తడిసినా, చలిలో తిరిగినా, ఎక్కువసేపు ఈత కొట్టినా కూడా జలుబు చేస్తుందనే అభిప్రాయం ఉంది. జలుబు అనేది సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. వందల రకాల వైరస్‌లు అందుకు కారణమవుతాయి. ఆ వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించి, రోగనిరోధక వ్యవస్థపై ఆధిపత్యం సాధిస్తాయి.
అందువల్ల మనకు జలుబు వస్తుంది. ఎక్కువసేపు నీళ్లలో నానినందుకో లేదా తడిజుట్టుతో బయట తిరిగినందుకో రాదు. జలుబుకు కారణమయ్యే వైరస్‌లు దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని రుతువుల్లోనూ ఉంటాయి. మన శరీర ఆరోగ్య వ్యవస్థ అంతో ఇంతో బలహీనపడినపుడు మాత్రమే ఇవి ప్రభావాన్ని చూపగలవు. అలాగే జలుబుతో బాధపడుతున్న వారి దగ్గర ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదమే. అందుకే తుమ్ము వచ్చినపుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేయాలంటున్నారు డాక్టర్లు.